BANGLADESH| బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు.. భవిష్యత్తుపై నిర్ణయం ఆమెకే వదిలేశాం : జైశంకర్
బంగ్లాదేశ్ పార్లమెంటును దేశాధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ మంగళవారం రద్దు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా పార్లమెంటును రద్దు చేయాలన్న ఆందోళనకారుల అల్టిమేటం మేరకు దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢాకా : బంగ్లాదేశ్ పార్లమెంటును దేశాధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ మంగళవారం రద్దు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా పార్లమెంటును రద్దు చేయాలన్న ఆందోళనకారుల అల్టిమేటం మేరకు దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు, పౌర సమాజ నేతలు, వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ నేతలతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్ష భవనం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా పార్లమెంటును రద్దు చేయకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ నేతలు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పార్లమెంటు రద్దు అయింది.
బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశంలో వివరించారు. బంగ్లా ఆర్మీతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అఖిపక్ష సమావేశం ఫొటోలను అందులో ఉంచారు. ఈ విషయంలో ఏకగ్రీవ మద్దతు లభించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రత, ఆర్థిక, దౌత్యపరమైన అంశాల విషయంలో తీసుకుంటున్న చర్యలను జైశంకర్ ఈ సమావేశంలో వివరించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉంటున్నారని, వారిలో 8 వేల మంది భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారని తెలిపారు. వెంటనే అక్కడి భారతీయులను భారత్‌కు తరలించేందుకు ఏర్పాటు చేయాల్సినంత దారుణంగా పరిస్థితులు ఏమీ లేవని చెప్పారు. అక్కడి భారతీయులతో ఇండియన్ హై కమిషన్ టచ్‌లో ఉన్నదని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల రక్షణపైనా సమావేశంలో చర్చించారు.
భవిష్యత్తుపై నిర్ణయాన్ని హసీనాకే వదిలేశాం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం
ఢిల్లీలో ఉన్నారని జైశంకర్ తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుని, కేంద్రానికి తెలిపేందుకు తగిన సమయం ఆమెకు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. షేక్ హసీనాను దేశం కాపాడుతుందని ప్రకటించారు. బంగ్లాదేశ్ విషయంలో కేంద్రం అనుసరించాలనుకుంటున్న దీర్ఘకాలిక, తాత్కాలిక వ్యూహాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిని అడిగి తెలుసుకున్నారు.