Trump Adviser Peter Navarro | రష్యా చమురుతో బ్రాహ్మణులకు లాభాలు: ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో
బ్రాహ్మణులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లతో బ్రాహ్మణులే లాభపడుతున్నారని ఆరోపించారు.

Trump Adviser Peter Navarro | రష్యా నుంచి చమురు దిగుమతులతో భారత్‌లో బ్రాహ్మణులు లబ్దిపొందుతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. అమెరికా ప్రభుత్వంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కులంపేరుతో ఆరోపణలు చేయడం ఇటీవల ఇదే ప్రథమం. అమెరికా అధ్యక్షుడు బోధించే వైవిధ్యం, సమానత్వం, సమ్మిళిత సూత్రాలకు ఇటువంటి ఆరోపణలు హానిచేస్తాయి. భారత్‌పై విధించిన అదనపు టారిఫ్ అమలు రష్యా అధ్యక్షుడు పుతిన్ తలవంచగలుగుతాయాని అని ప్రశ్నించినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఫాక్స్ న్యూస్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్పష్టంగా చెప్పదల్చుకున్నది ఏమంటే, భారత్‌పై ప్రస్తుతం 50 శాతం టారిఫ్ విధించాము. చైనాపై 50 శాతానికి మరికొంత అదనంగా ఉండవచ్చు. ఎటొచ్చీ మనకు నష్టం జరుగకుండా ఎంతవరకు టారిఫ్ విధించగలమన్నదే ముఖ్యం అని నవారో అన్నారు.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించే ముందు వరకు భారత్ రష్యా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయడం లేదు. చాలా చిన్న చిన్న మొత్తాల్లో చమురు తీసుకుంటూ ఉండవచ్చు. పుతిన్ మోడీకి తక్కువ ధరకు క్రూడ్ ఇస్తున్నారు. మోడీ తమ దేశంలో చమురుశుద్ధి కర్మాగారాలలో ఆ ముడి చమురును శుద్ధి చేసి యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎక్కువ ధరకు అమ్మి భారీగా లబ్దిపొందుతున్నారు అని నవారో తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఈ చమురు నిధులే ఇంధనంగా ఉపయోగపడుతున్నాయి అని ఆయన అన్నారు. రష్యాకు భారత్ ఒక వాషింగ్ మెషిన్‌లాగా ఉపయోగపడుతున్నది అని ఆయన అన్నారు. ఆ నిధులు ఉక్రేనియన్లను చంపుతున్నాయి. దానిని అడ్డుకోవడానికి మనం ఎక్కవగా ఖర్చుచేయవలసి వస్తున్నది. పన్నుచెల్లింపుదారులుగా మనపై అదనపు భారం పడుతున్నది నవారో వివరించారు. భారత్ టారిఫ్‌ల మహారాజా అని ఆయన అన్నారు. మోడీ గొప్ప నాయకుడని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహిస్తున్న ఆయన పుతిన్, జిన్‌పింగ్‌లతో సావాసం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదని నవారో వ్యఖ్యానించారు. భారత ప్రజలను పణంగా పెట్టి బ్రాహ్మణులకు లాభాలు సంపాదించి పెడుతున్నారని ఆయన అన్నారు.