ఇకపై మంచివాడిగా ఉండను.. ఫోటోతో ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్ అణు చర్చలు ఫలించకపోతే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. రైఫిల్ ఫోటోతో ‘ఇకపై మంచివాడిగా ఉండను’ అంటూ పోస్టు వైరల్ అయింది.

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించకుంటే అమెరికా కఠిన వైఖరి తీసుకుంటుందని స్పష్టం చేశారు. ‘ఇకపై మంచివాడిగా ఉండను’..అంటూ రైఫిల్‌ పట్టుకున్న ఫొటోను ‘ట్రూత్‌ సోషల్‌’లో పెట్టి మరీ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

శాంతి చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేక పోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని, ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ఇక మీదట అంత మంచివాడిగా ఉండను అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలపై దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న వేళ ట్రంప్‌ ఈ హెచ్చరిక చేయడం ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరిస్తే తాము మరింత దూకుడుగా, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.

ఇరాన్‌పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతున్నట్లుగా అమెరికా మీడియాలో కథనాలు పశ్చిమాసియ యుద్దం మరింత ముదిరే దిశగా సాగుతుందన్న ఆందోళనను రేపుతున్నాయి. అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే.. పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్‌కు అనుకూలమైన గ్రూపులు రంగంలోకి దిగుతాయని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్ జీసీ) కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని వ్యాఖ్యానించింది.

ఇరాన్ కౌంటర్ ఎటాక్

ఇరాన్ ను హెచ్చరిస్తూ ఓ వైపు ట్రంప్.. రైఫిల్ పట్టుకున్న ఫోటోతో తాను ఇక మీదట అంత మంచివాడిగా ఉండను అని పెట్టిన పోస్టు వైరల్ అవుతుండగానే….ఇరాన్ ఎంబసీ సైతం అంతే ధీటుగా రిప్లై ఇవ్వడం ఉద్రిక్తతలను మరింత పెంచేదిగా మారింది. అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో శత్రువుకు తల వంచొద్దని, దేశాన్ని వారికి అప్పగించే బదులు మనమంతా ప్రాణాలు అర్పిద్దామని యూకేలో నివసిస్తోన్న ఇరాన్‌ పౌరులకు ఆ దేశ ఎంబసీ పిలుపునిచ్చింది. బలిదానానికి సిద్ధంగా ఉన్నవారు తమను సంప్రదించాలని కోరింది. ఇరాన్ ఎంబీసీ పోస్టుపై ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ యూకే సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఇటువంటి పోస్ట్‌ చేసినందుకు ఆ దేశ రాయబారి సయ్యద్ అలీ మౌసావినికి యూకే సమన్లు జారీ చేసింది. అయితే, ఇరాన్ రాయబార కార్యాలయం తమ పోస్ట్‌ను సమర్థించుకుంది. ఈ ప్రచారం దేశభక్తికి, దేశంపై విధేయతకు సంబంధించినదని.. హింసను ప్రోత్సహిస్తున్నట్లు కాదని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానీయులు ఎల్లప్పుడూ తమ మాతృభూమి పరిరక్షణకు ముందుంటారని తెలిపింది. కాగా యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి తనతో సహా ఇరాన్‌ పౌరులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కూడా ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Rashmika | 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసిన రష్మిక.. ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన నేషనల్ క్రష్
స్ట్రీట్ కాజ్‌ ఎన్​జీఓకు కేటీఆర్​ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం

Latest News