Claude AI Bill | వామ్మో! ఒక్క నెలకే 4 వేల కోట్ల బిల్లు.. అడ్డూఅదుపు లేకుండా ఏఐని వాడటంతో అమెరికన్ కంపెనీకి షాక్!

Claude AI Bill | ఏఐ వాడకంతో పని స్పీడ్‌గా అవుతుందని మొన్నటి దాకా అనుకుంటే.. ఇప్పుడు ఏఐ వేసే బిల్లుల భారంతో కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తాజాగా తమ ఉద్యోగులు వర్క్‌ఫ్లో కోసం అడ్డూఅదుపు లేకుండా ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐని వాడటంతో ఒక్క నెలకే రూ.4800 కోట్ల బిల్లు వచ్చింది. టెక్ రంగంలో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

Claude AI Bill | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగాలు పోతాయని మొన్నటిదాకా అనుకున్నారు.. మానవ ఉద్యోగికి చెల్లించే జీతం కంటే తక్కువ ఖర్చులోనే 10 రెట్లు అధికంగా ఏఐతో పనిచేయించుకోవచ్చని కంపెనీలు కూడా భావించాయి. కానీ ఇప్పుడు వాస్తవిక పరిస్థితులు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. పని అంత మెరుగుపడకపోగా.. ఖర్చులు మాత్రం ఊహించనంతగా పెరిగిపోయాయి. దీంతో ఏఐ వాడటం వద్దురా బాబు.. దీనికంటే ఉద్యోగులను నియమించుకోవడమే బెటర్ అని అనుకుంటున్నారు. అమెరికాలోని ఓ కంపెనీకి ఎదురైన ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొవచ్చు. ఒక్క నెలలోనే ఆ కంపెనీకి సుమారు 4800 కోట్ల బిల్లు రావడంతో లబోదిబోమంటోంది.

అమెరికాకు చెందిన మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆ సంస్థ తమ ఉద్యోగుల కోసం ప్రముఖ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ (Claude) ఏఐ ప్లాట్‌ఫామ్ సేవలను అందించింది. తమ ఉద్యోగులకు ఈ ఏఐ యాక్సెస్‌పూ ఎటువంటి పరిమితులు విధించలేదు. ఈ ఏఐ వాడకంతో ఎంత ఖర్చు అవుతుంది? ఎవరు ఎంత వాడుతున్నారనేది లైవ్‌లో చూసేందుకు ఎలాంటి రియల్‌టైమ్ డాష్‌బోర్డు కానీ.. బడ్జెట్‌ అలర్ట్‌లను కానీ కంపెనీ పెట్టుకోలేదు.

ఇక ఉద్యోగులకు ఏఐ వినియోగంపై పూర్తి స్వేచ్ఛ ఉండటంతో తమ వర్క్‌ఫ్లో కోసం విపరీతంగా వాడేశారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా, వాటంతటా అవే వందలాది పనులు చేసుకుపోయే ఏఐ కోడింగ్ ఏజెంట్లు, ఏజెంటిక్ పైప్‌లైన్‌లను క్రియేట్ చేశారు. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరాయంగా రన్ అవుతూ.. భారీ లాంగ్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి లక్షలాది పేజీల టెక్ట్స్‌లను ప్రాసిస్ చేశాయి. దీంతో నెల తిరిగేసరికి సుమారు 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.4800  కోట్లు) వచ్చింది. ఇది చూసి సదరు కంపెనీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. టెక్ రంగంలో ఈ విషయం ఇప్పుడు సంచనలంగా మారింది. టెక్నాలజీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఐటీ వైఫల్యాల్లో ఒకటిగా నిలిచిపోతుందని కన్సల్టెంట్లు చెప్పుకుంటున్నారు.

అన్ని లక్షల కోట్ల బిల్లు ఎందుకు వచ్చింది?

సాధారణంగా క్లాడ్ ఏఐ సేవలు టోకెన్ విధానంపై పనిచేస్తాయి. అంటే వినియోగదారు ఇచ్చే ప్రతి పదం, ఏఐ ఇచ్చే ప్రతి సమాధానం ఖర్చుతో ముడిపడి ఉంటుంది. సాధారణంగా ఒక ఉద్యోగి మెమో లేదా ఈమెయిల్ తయారీ కోసం ఏఐని ఉపయోగిస్తే ఖర్చు తక్కువగానే ఉంటుంది. కానీ ఒకే సమయంలో పలు డేటా వనరుల నుంచి సమాచారం సేకరించడం, విశ్లేషించడం, నివేదికలు రూపొందించడం వంటి పనుల్లో ఏఐ ఏజెంట్లు విస్తృతంగా టోకెన్లను వినియోగిస్తాయి. ఇదే సమయంలో సదరు సంస్థ ఉద్యోగులు సృష్టించిన లూప్ ప్రాసెస్ వల్ల టోకెన్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిపోయి.. 4800 కోట్ల బిల్లు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలకూ తప్పని షాక్

ఇది సదరు సంస్థకు మాత్రమే పరిమితం కాలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ కోడింగ్ కోసం నెలకు రూ.40వేల నుంచి రూ.1.6లక్షల వరకు ఖర్చు చేయడంతో తమ అంతర్గత విభాగాల్లో క్లాడ్ కోడ్ లెసెన్స్‌లను భారీగా తగ్గించింది. విండోస్, మైక్రోసాఫ్ట్ 365, సర్ఫేస్ ఉత్పత్తులతో పనిచేసే విభాగాల్లో ఉద్యోగులను గిట్‌హబ్ కోపైలట్ CLI వంటి ప్రత్యామ్నయాల వైపు మళ్లించినట్లు సమాచారం.

అమెజాన్‌లో కూడా ఏఐ వినియోగంపై ఆసక్తి పెంచేందుకు ఉద్యోగులకు ర్యాంకింగ్ వ్యవస్థను అమలు చేశారు. అయితే కొందరు ఉద్యోగులు అవసరం లేని ప్రశ్నలు అడిగి ఏఐ వినియోగాన్ని పెంచడంతో దాన్ని నిలిపివేశారు. ఇక ఉబెర్‌లోనూ ఇదే ఎదురైంది. ఏప్రిల్ నాటికే తన 2026 ఏఐ బడ్జెట్ మొత్తాన్ని వాడేసింది. ఏఐ కోడింగ్ టూల్స్ కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్ 4నెలల్లోనే పూర్తిగా ఖర్చయ్యిందని సంస్థ సీటీవో ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించారు.

Read More:

AI దెబ్బకు ఫోన్ల ధరలు పెరుగుతాయా? మొదలైన కొత్త టెన్షన్​ !

హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?

Latest News