Israel-Iran | ఇజ్రాయెల్‌పై రేపోమాపో దాడికి సిద్ధమవుతున్న ఇరాన్!
హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్, లెబనాన్, గాజా, యమెన్‌లోని దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయా? సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్‌పై బాంబుల మోత మోగనున్నదా? అంటే.. అవుననే అంటున్నాయి ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు.

ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకార చర్యలు?
కలిసిరానున్న లెబనాన్, యెమెన్, గాజాలోని మిత్రులు
యుద్ధవిమానాలు, యుద్ధ నౌకలను తరలిస్తున్న అమెరికా
టెల్ అవీవ్: హమాస్ నేత ఇస్మాయిల్ హనియే (Ismail Haniyeh) హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్, లెబనాన్, గాజా, యమెన్‌లోని దాని మిత్రపక్షాలు భావిస్తున్నాయా? సోమవారం ఉదయం నుంచే ఇజ్రాయెల్‌పై బాంబుల మోత (Iran to attack Israel) మోగనున్నదా? అంటే.. అవుననే అంటున్నాయి ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు. ఇదే జరిగితే ప్రస్తుతం గాజాలోని హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం పరిధి విస్తరించే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సీనియర్ రక్షణశాఖ అధికారి జనరల్ మైఖేల్ కురిల్లా టెల్ అవీవ్‌కు చేరుకోవడం మధ్య ఆసియా సంక్షోభం (Middle East crisis) విస్తరించబోతున్నదనేందుకు సంకేతాలుగా భావిస్తున్నారు. సోమవారం లోపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్టు ముగ్గురు అమెరికన్, ఇజ్రాయెల్ అధికారులు అమెరికా మీడియా సంస్థ ఎక్సియోస్‌కు తెలిపారు.
ఇటీవల హమాస్ నేత హనియే లేదా హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాయద్ షుకుర్ హత్యలు రోజు వ్యవధిలో చోటు చేసుకున్నాయి. వాటికి తమదే బాధ్యతని ఇజ్రాయెల్ ప్రకటించుకోకున్నా.. ఇరాన్, దాని మిత్రపక్ష సంస్థలు ఇజ్రాయెల్‌నే అనుమానిస్తున్నాయి.
ఏప్రిల్ 13 దాడుల తరహాలోనే ఇరాన్ ప్రతికార చర్యలు ఉండొచ్చని అమెరికా సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతీకార చర్యల పరిధి మరింత విస్తృతంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా వంటి సంస్థలు కూడా వీటిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. 50 కత్యుషా రాకెట్లను హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై ఆదివారం ప్రయోగించింది. వాటిలో చాలామటుకు ఇజ్రాయెల్ డూమ్ వ్యవస్థ తిప్పికొట్టినా.. బెయిట్ హిలెల్ ప్రాంతంలో కొంత ప్రభావం కనిపించిదని సమాచారం.
మధ్య ఆసియా పర్యటన సందర్భంగా జోర్డాన్ తదితర గల్ఫ్ దేశాలను జనరల్ కురిల్లా (Gen Kurilla) సందర్శిస్తారని తెలుస్తున్నది. ఏప్రిల్ 13 నాటి ఇరాన్ దాడిలో క్షిపణులను మధ్యలోనే అడ్డుకోవడంలో జోర్డాన్ కీలక పాత్ర పోషించింది. తమ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకుపోతున్న డ్రోన్లను (Iranian drones) కూల్చివేసింది. ఇరాన్ డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు తమ వైమానిక స్థావరాలు వాడుకునేందుకు కూడా జోర్డాన్ అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే అమెరికా తన దళాలు, యుద్ధ విమానాలు, యద్ధ నౌకలను సమీప ప్రాంతాల్లో మోహరిస్తున్నది. ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధపడితే ప్రతిఘటించే ఉద్దేశంతోనే వీటిని సిద్ధం చేశారని తెలుస్తున్నది. అయితే.. ఇరాన్, దాని మిత్రపక్ష సంస్థలు భవిష్యత్తు యుద్ధ ప్రణాళికపై ఇంకా చర్చలు కొనసాగిస్తూనే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని లోపలి ప్రాంతాల్లో, పౌర ఆవాస ప్రాంతాల్లో సైతం హెజ్బొల్లా దాడులు చేస్తుందని తాము భావిస్తున్నట్టు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో లిఖితపూర్వక ఒప్పందం లేనప్పటికీ హెజ్బొల్లా సంస్థ మిలిటరీ లక్ష్యాలపైనే దాడులు చేస్తూ వస్తున్నదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని ఐక్య రాజ్య సమితిలో ఇరాన్ శాశ్వత మిషన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పడం గమనార్హం.