US warships around Iran| ఇరాన్‌ చుట్టు అమెరికా యుద్ధ నౌకలు..సర్వత్రా టెన్షన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌ చుట్టు భారీగా అమెరికా యుద్ధనౌకలు మోహరించాయి. ఇరాన్‌ వైపుగా అమెరికాకు చెందిన భారీ సైన్యం వెళుతున్నట్లు.. ఏం జరుగుతుందో చెప్పలేమని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

US warships around Iran| ఇరాన్‌ చుట్టు అమెరికా యుద్ధ నౌకలు..సర్వత్రా టెన్షన్

విధాత: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో  ఇరాన్‌ చుట్టు భారీగా అమెరికా యుద్ధనౌకలు మోహరించాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుంచి అమెరికా యుద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సహా పలు యుద్ధనౌకలు ఇరాన్ చుట్టు మోహరించి సైనిక చర్యకు సిద్దంగా ఉన్నాయి. యుద్ద నౌకలతో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పశ్చిమాసియాకు పంపనున్నట్లుగా వైట్‌హౌస్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్ చుట్టు అమెరికా సైనిక బలగాలు : ట్రంప్ వెల్లడి

ఇరాన్‌ వైపుగా అమెరికాకు చెందిన భారీ సైన్యం వెళుతున్నట్లు.. ఏం జరుగుతుందో చెప్పలేమని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్ లో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, ఆ దేశంలో నెలకొన్న అనిశ్చిత ఉద్రిక్తతల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. అయితే సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్‌ తెలిపారు. దావోస్‌ నుంచి యూఎస్‌కు బయలుదేరుతుండగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్  దేశానికి ఎలాంటి నష్టం జరగకూడదని తాను భావిస్తున్నట్లుగా చెప్పకొచ్చారు.

ఇరాన్‌లోని వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి వల్లనే అక్కడి అధికారులు రద్దు చేసిన విషయాన్ని మరోసారి ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తాను కల్పించుకోకపోయి ఉంటే ఇరాన్‌లో 800 మందికి పైగా నిరసనకారులు తమ ప్రాణాలు కోల్పోయేవారని.. వారి ఉరిశిక్షలను తాను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. వారిని ఉరితీస్తే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్‌ పాలకవర్గం వెనక్కి తగ్గిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.