US Government Shutdown | అమెరికాలో షట్‌డౌన్ ఎందుకు వచ్చింది?
బిల్లులు ఆమోదం కాకుండా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ లోకి. అత్యవసర ఉద్యోగులు తప్ప, ఇతరులకు జీతాలు ఇవ్వబడవు.

US Government Shutdown | కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ను ఎదుర్కొంటోంది. 2018 తర్వాత తొలిసారి షట్ డౌన్ కు గురైంది. దీంతో అత్యవసరం కాని ఉద్యోగులు జీతం లేకుండానే సెలవుపై వెళ్లాలి. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లో లక్షల మంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది.
షట్ డౌన్ అంటే ఏంటి?
ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రతి ఏటా కచ్చితంగా బడ్జెట్‌ను ఆమోదించాలి. బడ్జెట్ ఆమోదం పొందాలంటే నిధుల బిల్లుపై సెనెట్, హౌస్ ఆమోదించాలి. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే ఆయా విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు ఉండవు. అత్యవసరం కాని సేవలు, కార్యాలయాలు మూతపడతాయి. దీన్నే షడ్ డౌన్ గా వ్యవహరిస్తారు. ప్రభుత్వానికి నిధులు సమకూర్చాలన్న డెమోక్రాట్ల ప్రతిపాదన అమెరికా సెనెట్ లో 47:53 ఓట్ల తేడాతో ఆమోదం పొందలేదు. సెనేట్ లో ఈ బిల్లు నెగ్గాలంటే 60 ఓట్లు సాధించాలి. కానీ, 60 ఓట్లు కూడా సాధించలేదు. రిపబ్లికన్ ఫండింగ్ బిల్లు కూడా 55: 45 ఓట్ల తేడాతో వీగిపోయింది. రిపబ్లికన్లకు ఆధిక్యం ఉన్న కాంగ్రెస్ లో డెమోక్రాట్లు తమ కీలక డిమాండ్లు అయిన ఒబామా కేర్, బీమా సబ్సిడీ విస్తరణ, మెడికైడ్స్ కట్స్ రద్దు, విదేశీ సహాయం, పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్‌కు 9 బిలియన్ డాలర్ల కట్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ నేతృత్వంలో రిపబ్లికన్లు నవంబర్ 21 వరకు నిధులను విస్తరించే బిల్లును ఆమోదించారు, కానీ సెనెట్‌లో డెమోక్రాట్లకు బలం ఉండటంతో అది విఫలమైంది. సెప్టెంబర్ 29న డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశం కూడా ఫలితం ఇవ్వలేదు. ఇది షట్ డౌన్ కు దారి తీసింది.
ఏ రంగాలపై ప్రభావం?
అత్యవసర సేవల విభాగాల కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయి. విమాన, రక్షణ, వైద్యం వంటి రంగాల్లో యధావిధిగా నడుస్తాయి. అత్యవసర సేవల విభాగాల్లోని ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఈ సెలవుపై వెళ్లిన ఉద్యోగులకు జీతం ఉండదు. కీలక రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు షట్ డౌన్ ముగిసిన తర్వాత పాత జీతాలను కలిపి చెల్లిస్తారు. 2013లో షట్‌డౌన్ విధించారు. అప్పట్లో వందలకొద్దీ పార్కులు, మ్యూజియాలు మూతపడుతాయి. 2019 జనవరిలో 36 రోజుల పాటు షట్ డౌన్ సాగింది. అమెరికా చరిత్రలో ఇది అత్యధిక కాలంగా కొనసాగింది. 1981 నుంచి అమెరికాలో 15 సార్లు షట్ డౌన్ జరిగింది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అత్యధికంగా 36 రోజులు షట్ డౌన్ సాగింది.