US Trade Penalty | అమల్లోకి ట్రంప్‌ కొత్త సుంకాలు – దెబ్బతిననున్న భారత ప్రధాన రంగాలివే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్​పై విధించిన 50% టారిఫ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో భారత ఎగుమతులకు గట్టి దెబ్బ తగలనుంది. ప్రధానంగా రొయ్యలు, రత్నాలు, వస్త్ర పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి

US Trade Penalty | అమల్లోకి ట్రంప్‌ కొత్త సుంకాలు – దెబ్బతిననున్న భారత ప్రధాన రంగాలివే

వాషింగ్టన్/న్యూఢిల్లీ: US Trade Penalty | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్తగా ప్రకటించిన కఠిన వాణిజ్య సుంకాలు భారత్‌పై భారీ ప్రభావం చూపాయి. బుధవారం (భారత కాలమానం ప్రకారం ఉదయం 9:31 గంటల నుంచి) అమల్లోకి వచ్చిన తాజా సుంకాల ప్రకారం, భారత్‌ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై 50 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు 25 శాతం ఉన్న రేటును రెట్టింపు చేయడంతో, ఇది గత దశాబ్దంలోనే అత్యంత కఠినమైన వాణిజ్య సుంకంగా భావిస్తున్నారు.

టారిఫ్ వెనుక కారణం

ట్రంప్ ప్రభుత్వం ప్రకారం, భారత్‌ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్లు కొనసాగించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ప్రకటనలో, ఈ సుంకం అమెరికాలో వినియోగం కోసం ప్రవేశించే లేదా గోదాముల నుంచి విడుదలయ్యే అన్ని భారత ఉత్పత్తులకూ వర్తిస్తుందని పేర్కొంది.

భారత్‌ ప్రభుత్వ అంచనాల ప్రకారం, కొత్త సుంకాల వల్ల సుమారు 48.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4 లక్షల 23వేల కోట్లు) విలువైన ఎగుమతులు నేరుగా ప్రభావితమవుతాయి. ఈ కొత్త విధానాలు ఎగుమతులను వాణిజ్యపరంగా అసాధ్యంగా మార్చవచ్చని, తద్వారా ఉద్యోగ నష్టాలు, ఆర్థిక మందగమనం వచ్చే ప్రమాదం ఉందని అధికార వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి.

ఇతర సియా దేశాలపై తక్కువ సుంకాలు

ట్రంప్‌ విధించిన కొత్త సుంకాలు భారత్‌పై అత్యధికంగా ఉన్నాయి.

  • చైనా – 30%
  • వియత్నాం – 20%
  • ఇండోనేషియా – 19%
  • జపాన్ – 15%

👉 దీంతో అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీ సామర్థ్యం తగ్గి, ఆ మార్కెట్‌ను ఈ దేశాలు ఆక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యధికంగా ప్రభావితమయ్యే రంగాలు

  1. రొయ్యలు (Shrimps):

భారత్‌ అమెరికాకు 2.4 బిలియన్ విలువైన రొయ్యలు ఎగుమతి చేస్తోంది. ఇది మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 32% వాటా. తాజా టారిఫ్‌లతో, అమెరికా మార్కెట్‌లో భారత రొయ్యల పోటీ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

  1. రత్నాలు & ఆభరణాలు (Gems & Jewellery):

సుమారు 10 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అమెరికాకు వెళుతున్నాయి. ఇవి భారత ప్రపంచ ఎగుమతుల్లో 40% వాటా. సుంకాలు 2.1% నుంచి 52.1%కి పెరగడంతో, సూరత్‌, ముంబై, జైపూర్‌లో లక్షలాది మంది కార్మికుల ఉపాధి నేరుగా ప్రమాదంలో పడుతుంది.

  1. వస్త్రాలు‌‌–దుస్తులు (Textiles & Apparel):
    2025 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి అమెరికాకు 10.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. వాటిలో 5.4 బిలియన్ డాలర్లు కేవలం దుస్తులే. అమెరికా వాటా మొత్తం ఎగుమతుల్లో 35%. టారిఫ్ 13.9% నుంచి 63.9%కి పెరగడంతో ధరల పోటీ ప్రయోజనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

    • ప్రధానంగా ప్రభావితమయ్యే క్లస్టర్లు: తిరుప్పూర్‌, నోయిడా-గుర్గావ్‌, బెంగళూరు, లుధియానా, జైపూర్.
    • ప్రత్యామ్నాయ దేశాలు: బంగ్లాదేశ్‌, వియత్నాం, మెక్సికో.
  2. తివాచీలు(Carpets):
    FY2025లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన కార్పెట్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికా వాటా 58.6%. టారిఫ్ 2.9% నుంచి 52.9%కి పెరగడంతో భదోహి, మిర్జాపూర్‌, శ్రీనగర్‌ వంటి ప్రాంతాల్లోని కార్పెట్‌ కళాకారులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోనున్నారు.
  3. హస్తకళలు (Handicrafts):
    1.6 బిలియన్ డాలర్ల విలువైన హ్యాండీక్రాఫ్ట్స్‌లో 40% అమెరికా వాటా. జోధ్‌పూర్‌, జైపూర్‌, మోరాదాబాద్‌, సహారన్‌పూర్‌ పరిశ్రమలు బలంగా ప్రభావితం కావచ్చు.
  4. తోలుపాదరక్షలు (Leather & Footwear):
    1.2 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అమెరికాకు వెళ్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా 50% టారిఫ్‌కు లోబడి, ఆగ్రా, కాన్పూర్‌, అంబూర్‌, రాణిపేటల క్లస్టర్లకు భవిష్యత్తు చీకటిగా మారింది.
  5. వ్యవసాయం & ప్రాసెస్డ్ ఫుడ్ (Agriculture & Processed Food):
    6 బిలియన్ డాలర్ల విలువైన బాస్మతి, టీ, మసాలాలు అమెరికా మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా 50% సుంకానికి లోబడి, పాకిస్తాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం లాంటి దేశాలకు అవకాశం లభిస్తుంది.

మినహాయింపులు (Tariff-Exempt Categories)

ఇక సుమారు 30.2% ఎగుమతులు (27.6  బిలియన్ డాలర్ల విలువైనవి) కొత్త పన్నుల నుంచి మినహాయింపుగా కొనసాగుతాయి.

  • ఫార్మాస్యూటికల్స్ & APIs: మినహాయింపులో 56% వాటా.
  • ఎలక్ట్రానిక్స్: స్మార్ట్‌ఫోన్లు, స్విచింగ్/రౌటింగ్ గేర్, చిప్స్‌, స్టోరేజ్ డివైజెస్.
  • ఇతర ఉత్పత్తులు: పెట్రోల్‌, విమాన ఇంధనం, పుస్తకాలు, ప్లాస్టిక్స్‌, బంగారం, నికెల్‌, రబ్బరు, ఇతర మినరల్స్‌.

వాణిజ్య నిపుణుల అంచనా ప్రకారం, ఈ 50 శాతం టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతులు కనీసం 25 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీని వలన లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ క్లస్టర్లలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడే పరిస్థితి తలెత్తవచ్చు. రొయ్యలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్ వంటి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నందున, గ్రామీణ మరియు పట్టణ కార్మిక వర్గాలపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది. దీని ప్రత్యక్ష ప్రభావం దేశీయ ఉత్పత్తిపై, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యంపై, చివరికి భారత GDP వృద్ధి రేటుపై కూడా పడవచ్చని ఆర్థిక నిపుణులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.