Pakistan violence | పాకిస్థాన్‌లో భూమి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 36 మంది దుర్మరణం..!
Pakistan violence | పాకిస్థాన్‌లో ఒక భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆగ్నేయ పాకిస్థాన్‌లో ఐదు రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 36 మంది మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. అప్పర్ కుర్రం ప్రాంతంలోని బోషెరా గ్రామంలో స్థానికంగా ఉండే సున్నీ, షియా జాతుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.

Pakistan violence : పాకిస్థాన్‌లో ఒక భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆగ్నేయ పాకిస్థాన్‌లో ఐదు రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 36 మంది మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. అప్పర్ కుర్రం ప్రాంతంలోని బోషెరా గ్రామంలో స్థానికంగా ఉండే సున్నీ, షియా జాతుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. భూమి విషయంలో గత ఐదు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సైనికాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బోషెరా గ్రామంలోని ఓ ల్యాండ్ తమదంటే తమదని సున్నీలు, షియాలు గత కొన్ని రోజులుగా గొడవపడుతున్నారు. వాస్తవానికి ఆ భూమి తమదంటూ గిరిజనులు కూడా రంగంలోకి దిగారు. దాంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకరి ఇళ్లు మరొకరు తగలబెబ్టడం, కనిపిస్తే కత్తిపోట్లు వంటి చర్యలతో రెండు వర్గాల వారు హోరాహోరీగా కొట్టుకున్నారు. ముందు సన్నీ, షియాల మధ్య చెలరేగిన ఘర్షణ.. గిరిజనుల జోక్యంతో మత సమూహాల మధ్య ఘర్షణగా మారింది.
అక్కడ స్థానిక డిప్యూటీ కమిషనర్ రెండు వర్గాలకు సంబంధించిన పెద్దలను సమావేశపరిచి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. అయినా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలలో ఇరువర్గాలు అత్యాధునిక యుద్ధ పరికరాలు ఉపయోగించడం గమనార్హం. ఏకంగా సైన్యం ఉపయోగించే రాకెట్ లాంఛర్లతో దాడులకు పాల్పడటం పోలీసులు, సైనికులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. దాంతో వారికి ఇంత అత్యాధునిక సాంకేతిక యుద్ధ పరికరాలు ఎలా అందుతున్నాయని ఎంక్వయిరీ చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో వీరిపై తాలిబాన్ల ప్రభావం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సున్నిత ప్రాంతాలైన మక్బాల్, ఖార్ కలే, పీవార్, పారా చమ్కానీ, కుంజ్ అలీజాయ్, పీవార్ తదితర ప్రాంతాలపై పోలీసులు, సైనిక అధికారులు అడుగడుగునా నిఘా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కార్డెన్ సెర్చ్ సోదాలతో ఇంటింటికీ వెళ్లి అక్కడ రాకెట్ లాంచర్లు, రాకెట్ షెల్స్ వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.
పగటిపూట 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. గిరిజనులను ఒప్పించి వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. ప్రజలు మాత్రం తమకు తీవ్ర అసౌకర్యంగా ఉందని, పాలు, ఆహారపదార్థాల వంటి నిత్యావసరాల కోసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, తమకు ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యా సంస్థలను మూసివేశారు. పరిస్థితి చక్కబడేదాకా తెరవద్దని ఆదేశాలు ఇచ్చారు. కార్యాలయాలకు వెళ్లే వారికి పాస్‌లు జారీ చేస్తున్నారు. అడుగడుగునా సోదాలు నిర్వహిస్తున్నారు.