Site icon vidhaatha

అలాగైతే ఇండియాలో వాట్సాప్‌ సేవలు నిలిపేస్తాం

న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యతను బయటపెట్టాల్సిందేనంటే తాము భారతదేశంలో సేవలు నిలిపివేస్తామని వాట్సాప్‌ కంపెనీ పేర్కొన్నది. 2021 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలకు కట్టుబడి సందేశాల ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాలని ఒత్తిడి చేస్తే తమ కంపెనీ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుందని గురువారం ఢిల్లీ కోర్టుకు వెల్లడించింది. ఒక సందేశానికి సంబంధించి దాని మూలకర్తను గుర్తించాలనే అంశంపై సామాజిక మాధ్యమాలకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్‌, దాని మాతృసంస్థ మెటా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు విచారణ జరుపుతున్నది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2021 చట్టంలోని 4(2) నిబంధన.. సోషల్‌ మీడియా కంపెనీలు ఒక సమాచారానికి సంబంధించిన మూలకర్తను గుర్తించాలని పేర్కొంటున్నది. రాజ్యాంగంలోని 14 (చట్టం ముందు అందరూ సమానులే), 19 (భావ ప్రకటనా స్వేచ్ఛ), 21 (ప్రాణరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ) అధికరణాలు కల్పించిన ప్రాథమిక హక్కులను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వాట్సాప్‌ కంపెనీ కోర్టుకు తెలిపింది.

‘ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాలని అంటే.. వాట్సాప్‌ భారతదేశం నుంచి వెళ్లిపోతుంది’ అని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటువంటి నిబంధనలు ప్రపంచంలో ఎక్కడా లేవని అన్నారు. ఎన్‌క్రిప్షన్‌ ఉన్నందు వల్లే ప్రజలు వాట్సాప్‌ సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ నిబంధనను అమలు చేయడం ద్వారా తాము ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాల్సి ఉంటుందన్నారు. లేనిపక్షంలో మూలకర్తను గుర్తించే అవకాశం ఉండదన్నారు. పరిమితి లేని కారణంగా ఏళ్ల తరబడి కోటానుకోట్ల సందేశాలను స్టోర్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు లేదా సంబంధిత అథార్టీ ఏదైనా తీవ్ర నేరం జరిగినప్పుడు సందేశం మూలకర్తను గుర్తించాలని సోషల్‌ మీడియా కంపెనీలను కోరే అవకాశాన్ని కేంద్రం తీసుకవచ్చిన నిబంధన కల్పిస్తున్నది. ‘రెండు హక్కులు ఉన్నాయి. ఒకటి గోప్యత. అదే సమయంలో ఎవరన్నా ఉగ్రవాది సందేశం పంపితే అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ఈ రెండింటి మధ్య మేం చిక్కుబడిపోయాం. ఒక అంశంలో నేను నా ప్లాట్‌ఫాంను బ్రేక్‌ చేయాలా? లేక కోట్లకొద్దీ అంశాల ఆధారంగా బ్రేక్‌ చేయాలా? ఇది సమతూకంలో ఉన్నదా? ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని వాట్సాప్‌ వాదించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్ట్‌ 14కు కోర్టు వాయిదా వేసింది.

Exit mobile version