Sidda Ramaiah | హిందీ, ఇంగ్లీష్ ఆధిపత్యం పిల్లల ప్రతిభను దెబ్బతీస్తోంది.. కర్ణాటక సీఎం వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కన్నడ భాషను విస్మరిస్తూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రాష్ట్ర రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కన్నడ భాషను విస్మరిస్తూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రాష్ట్ర రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్, హిందీ ఆధిపత్యం వల్ల పిల్లల సహజ ప్రతిభ దెబ్బతింటోందని హెచ్చరించారు. దేశంలోని ఫెడరల్ వ్యవస్థను బలహీన పరుస్తూ కేంద్రం.. కర్ణాటకపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సీఎం సిద్ధారామయ్య ఆరోపించారు. తాము ఏడాదికి రూ.4.5 లక్షల కోట్లు కేంద్రానికి ఆదాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. కానీ, ప్రతిఫలంగా రాష్ట్రానికి నిధులు మాత్రం స్వల్పంగానే అందుతున్నాయని తెలిపారు.
హిందీ, సంస్కృత భాషల అభివృద్ధికి ఉదారంగా నిధులు కేటాయిస్తూనే, ఇతర భారతీయ భాషలను.. ముఖ్యంగా కన్నడ భాషను పక్కన పెడుతున్నారని సిద్దారామయ్య ఆరోపించారు. తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. ఇది ప్రాచీన భాష అయిన కన్నడకు అన్యాయం చేయడమేనని సీఎం సిద్ధరామయ్యా వెల్లడించారు. కన్నడను అణగదొక్కే శక్తులన్నింటిపైనా ఎదురు దాడి చేయాలని రాష్ట్ర ప్రజలందరికి సీఎం పిలుపునిచ్చారు. అలాగే, కన్నడ భాష, సంస్కృతికి మరింత గౌరంతో పాటు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
విద్యాలయాల్లో ఇంగ్లీష్, హిందీ ఆధిపత్యం పెరుగుతుండడం వల్ల పిల్లలు తమ మూలాలను, సృజనాత్మకతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తారు.. నేర్చుకుంటారు.. కలలు కంటారు.. కానీ మన దేశంలో దీనికి విరుద్ధంగా ఉంది అని సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, ప్రాథమిక దశలో మాతృభాషనే బోధనామాధ్యమంగా తప్పనిసరి చేసే చట్టాలు అవసరం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. కాగా, సైన్‌బోర్డులపై హిందీ తప్పనిసరి చేయడం, విద్యా విధానాల్లో భాషా వివాదాలు మళ్లీ చర్చకు రావడం నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటక ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ, కన్నడ ప్రాధాన్యాన్ని కాపాడే దిశగా పలు చర్యలు చేపట్టింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram