Liquor Shop License | తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్దతిలో ఎంపిక చేసి అధికారులు లైసెన్స్లు జారీ చేయనున్నారు.
విధాత, హైదరాబాద్ :
తెలంగాణలో మద్యం దుకాణాల డ్రాకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దరఖాస్తు దారులకు ఊరట కలగడంతో పాటు డ్రా ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు నిర్ణయంతో 2025, అక్టోబర్ 27న యధావిధిగా మద్యం షాపుల డ్రా ప్రక్రియను ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించనున్నారు. కాగా, వైన్ షాపుల కేటాయింపు కోసం గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారని పేర్కొంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై శనివారం రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 18వ తేదీ వరకు ఉన్న మద్యం దుకాణాల టెండర్ల గడువును 23 వరకు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాదాలు న్యాయస్థానానికి వెల్లడించారు.
23వ తేదీకి పెంచడం వల్ల ఐదువేలకు పైగా దరఖాస్తులు అదనంగా వచ్చాయని వివరించారు. ఇది తెలంగాణ ప్రోహిబిషన్ ఎక్స్సైజ్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఆర్టికల్ 12 (5) ప్రకారం గడువు పెంచడానికి అవకాశం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రాను కూడా 27వ తేదీకి పొడిగించారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరుఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గడువు పెంచడం అనేది తెలంగాణ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తెలిపారు. గడువు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు మద్యం దుకాణాల డ్రా ప్రక్రియ నిర్వహించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు నుంచి మద్యం షాపుల డ్రాకు గ్రీన్ సిగ్నల్ రావడంతో డ్రా ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 27న మద్యం దుకాణాల డ్రాకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా 27వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు వైన్స్ టెండర్ల డ్రా ప్రకియ నిర్వహించనున్నారు. కాగా, తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్దతిలో ఎంపిక చేసి అధికారులు లైసెన్స్లు జారీ చేయనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram