Jubilee Hills bypoll | కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డిది ‘ఫెవికాల్’ బంధం : హరీశ్ రావు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు ఉన్నా..ఎందుకు విచారణ జరగడం లేదు? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. దొంగే దొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన ఎద్దేవా చేశారు

Jubilee Hills bypoll | కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డిది ‘ఫెవికాల్’ బంధం : హరీశ్ రావు

విధాత, హైదరాబాద్ :

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు ఉన్నా..ఎందుకు విచారణ జరగడం లేదు? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. దొంగే దొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని భట్టి విక్రమార్క ఇంట్లో ఢిల్లీలో ఐటీ రైడ్లు జరిగాయన్నారు. గుర్గావ్ లో భట్టి ఇల్లుతో పాటు ఆయన అత్తాగారిల్లు కూడా ఉంది ఈ విషయం ఎందుకు బయటకు రావడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు.

అసలు కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏంటని నిలదీశారు. మంత్రి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరిగితే, ఎందుకు చెప్పలేదు?.. ఈడీ ఎందుకు ప్రెస్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బీజేపీతో రేవంత్ రెడ్డి అంటకాగుతున్నారని.. ఢిల్లీలో బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు బయటపడ్డాయి అని ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు.. కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నీ తప్పని క్షమాపణ చెప్పి ఓటేయ్యాలని అడగాలని రేవంత్ కు హరీశ్ రావు సవాల్ విసిరారు.

‘కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయంలో కూర్చునేది నువ్వే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీకి తెస్తానని రేవంత్ చెబుతారు’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. అప్పులపై పూటకో మాట, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.