Site icon vidhaatha

HYDRA TYPE DRIVE । రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన.. ప్రతి జిల్లాలోనూ హైడ్రా తరహా వ్యవస్థలు..

HYDRA TYPE DRIVE । హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలపై కొరడా ఝళిపిస్తున్న హైడ్రా (Hydra) తరహాలో ప్రతి జిల్లాలోనూ ఆ తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) సంకేతాలు ఇచ్చారు. వరద ప్రభావిత మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం పర్యటించిన ముఖ్యమంత్రి.. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా తరహాలో జిల్లాలో వ్యవస్థను కలెక్టర్లు   ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. చెరువులను ఆక్రమించుకోవడం (encroachments) క్షమించరాని నేరమని, చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించారు. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణల జాబితా సిద్దం చేయాలన్నారు.

 

మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరదలు

మాజీ మంత్రి ఆక్రమణల (encroachments) వల్లనే ఖమ్మంలో వరదలు వచ్చాయనే ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆక్రమణల తొలగింపునకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. కేటీఆర్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి.. అమెరికా లో జల్సాలో మునిగి తేలుతున్న ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నడని విమర్శించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా హరీశ్‌రావు ఖమ్మం పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రి ఆక్రమణల తొలగింపునకు హరీశ్‌ రావు సహకరిస్తారా? అని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు  కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా పరామర్శకు వచ్చారా? అని నిలదీశారు. మాసాయిపేటలో (Masaipet) పసిపిల్లలు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదని, హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌ హత్యకు గురైతే వెళ్లి చూడలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ మానవత్వం లేని మనిషని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? అని  ప్రశ్నించారు.

 

ప్రాణ నష్టం బాధాకరం

స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.  28 సెంటిమీటర్ల వర్షం కురిసినప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారని, అయినా ప్రాణ నష్టం జరగడం బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలో నలుగురు చనిపోయారని, అందులో ఇద్దరు ఈ జిల్లా వాసులు, మరో ఇద్దరు ఖమ్మం జిల్లా వాసులు ఉన్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 30  వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. 680 మంది కి పునరావాసం కల్పించామని చెప్పారు. సీతారామతండాలో వరద సమయంలో  ప్రజలకు అండగా నిలబడ్డ  ఎస్సై నగేశ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి అదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్ను ఆదేశించారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరానికి పదివేల సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామని ముఖ్యమంత్రి తెలిపారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరుతున్నామని తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరామ్‌ నాయక్‌, ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

కిడ్డీ బ్యాంకు నుంచి విద్యార్థిని విరాళం

మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాలకు తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు తమ ఒక రోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధులు అందజేశారు.

Exit mobile version