KCR comments |పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం అని..ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు అయితే మన సత్తా మరింత బాగా తెలిసేదన్నారు.

KCR comments |పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల(gram panchayat election results)పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక(KCR comments)వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం అని..ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు అయితే మన సత్తా మరింత బాగా తెలిసేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి నన్ను తిట్టడం, చనిపోవాలని శాపనార్ధాలు పెట్టడం..అవమానించడమే విధానంగా మారిందని, ప్రజల కోసం చేస్తుందేమి లేదని, ఎన్నికల హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ప్రజల మూడ్ బయటపడిందని.. ప్రచారంలో ప్రజల రియాక్షన్ ఎలా ఉందని నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీగాని.. పథకంగాని తేలేదని, ఉన్నవాటిని ఆపేశారని కేసీఆర్ విమర్శించారు. గతంలో వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని తాను అసెంబ్లీలో మెచ్చుకున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన పాలసీలు పాలసీ రియల్‌ ఎస్టేట్‌ కోసమేనని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని అన్నారు.

ఒకప్పుడు యూరియా ఇంటికి వచ్చేదని..ఇప్పుడు యూరియా బస్తా కోసం కుటుంబం అంతా క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుందన్నారు. రైతుల కోసం కట్టిన చెక్ డ్యామ్ లను పేల్చేస్తున్నారని..ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల సమస్యలపై 15 రోజుల్లో మూడు బహిరంగ సభలు

కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని..ఏపీ జలదోపిడిని అడ్డుకోవడంలో విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డికి 91 టీఎంసీలు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించిందని ఆరోపించారు. దీనిపై అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ లక్ష్యంతో ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు వచ్చే 15 రోజుల్లో బీఆర్ఎస్ మూడు బహిరంగ సభలో నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా సమాచారం. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.

ఈ సమావేశం అనంతం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 8నెలల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం  గమనార్హం.