Konda Surekha | మంత్రుల మధ్య మరో లొల్లి..పొంగులేటిపై ఖర్గేకు కొండా సురేఖ ఫిర్యాదు

వరంగల్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు. మేడారం టెండర్లలో పొంగులేటి జోక్యంపై సీఎం రేవంత్, ఖర్గేకు ఫిర్యాదు.

Konda Surekha | మంత్రుల మధ్య మరో లొల్లి..పొంగులేటిపై ఖర్గేకు కొండా సురేఖ ఫిర్యాదు

విధాత : తెలంగాణ రాష్ట్రంలో మూడో ప్రయత్నంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాల వ్యవధి పూర్తి చేసుకుంటున్నా..పరిపాలనలో తడబాటు కొనసాగిస్తుంది. మంత్రుల మధ్యనే సరైన సమన్వయం, సహకారం లోపిస్తూ..తరుచూ వివాదాలు రేగుతూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. తొలుత నిన్న మొన్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌ మధ్య నెలకొన్న అనుచిత వ్యాఖ్యల వివాదం మరువక ముందే.. మరో ఇద్దరు కాంగ్రెస్ మంత్రుల మధ్య మరో పంచాయతీ నెలకొంది. వరంగల్‌ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఆ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కొండా సురేఖకు మధ్య నెలకొన్న వివాదం కాస్తా రచ్చకెక్కి.. పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదుల వరకు వెళ్లింది. మంత్రి పొంగులేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌ రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. వరంగల్‌ రాజకీయాలతో పాటు తన పర్యవేక్షణలోని దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లలో ఇంచార్జి మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని, దేవాదాయ శాఖకి సంబంధించిన రూ.71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఖర్గేకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఢిల్లీకి కొండా దంపతులు

పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని ఖర్గేకి కొండా సురేఖ-మురళి దంపతులు ఫోన్‌ చేసి తెలిపారు. ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా రాజకీయాలను ఖర్గేకి వివరించారు. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దృష్టికి కూడా పొంగులేటి విషయాన్ని కొండా దంపతులు తీసుకెళ్లారు. హైకమాండ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కొండా దంపతులు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లి మల్లిఖార్జున ఖర్జేను వారు స్వయంగా కలిసి పొంగులేటి వ్యవహారాన్ని వివరించబోతున్నట్లుగా సమాచారం. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రేవంత్‌ రెడ్డి‌.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులకు సంబంధించిన కాంట్రాక్టులలో మంత్రి పొంగులేటి జోక్యంపై స్థానిక మంత్రిగా కొండా సురేఖ సీరియస్ గా ఉన్నారు.