న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ హైకమాండ్ ముందు వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ డైరెక్ట్ ఎటాక్ చేయడం కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో చర్చల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
తాను ఈ రోజు మల్లిఖార్జున్ ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్ ను కలవలేదని, నేను నేరుగా సీఎంపైన, పార్టీపైన విమర్శలు చేయలేదని సురేఖ తెలిపారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని తెలిపారు. నాపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేముందు సీఎం రేవంత్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్ చెప్పుకుంటున్నారని, మంత్రులు నేతలు కూడా ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు అని సురేఖ తెలిపారు. పార్టీ హైకమాండ్ తో చర్చల సందర్బంగా తనను రాజీనామా చేయమని లేదా మరోకటిగాని చెప్పలేదన్నారు. నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు అని, మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారని, నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు.
క్రమశిక్షణ విషయంలో బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి అని, మరి వాటికి ఏం సమాధానం చెబుతారు..వారిపై ఏం చర్యలు తీసుకుంటారని సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపైన, భట్టి భార్య కమిషన్లపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి.. దానిపైన ఎందుకు మాట్లాడటం లేదు అని, చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. తన వాదనకు సంబంధించి, తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, పార్టీ పరిస్థితులపై అధిష్టానానికి అన్ని రాతపూర్వకంగా తెలియజేశానని, రాహుల్ గాంధీకి మెయిల్ కూడా చేశానని సురేఖ వెల్లడించారు.
