Maoist Surrender| ఇద్దరు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు(Maoists) పార్టీకి చెందిన కీలక నేతలు ఇద్దరు గురువారం రాచకొండ పోలీస్(Rachakonda police) కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు(Surrendered). 40ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన టీఎల్ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్ భార్య, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు కాకర్ల సునీత(Kakarla Sunitha) అలియాస్ బద్రీ, ఏరియా కమిటీ సభ్యులు చెన్నూరి హరీశ్(Chennuri Harish) అలియాస్ రమణలు ఇద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరూ కూడా పలు ఎన్ కౌంటర్లలో పాలు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. సునీతపై రూ. 20లక్షలు, హరీశ్ పై రూ.4లక్షల రివార్డు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
40ఏళ్ల తర్వాతా జనజీవన స్రవంతిలోకి..
విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కూతురైన సునీత మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్ గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన శాంతి చర్చల ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. సునీత ఇప్పటివరకు ఐదు మేజర్ ఎన్ కౌంటర్లలో పాలుపంచుకున్నారని పోలీసులు వెల్లడించారు. సునీత భర్త సుధాకర్ ఈ ఏడాది జూన్ లో అన్నపురం నేషనల్ పార్క్ ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. చెన్నూరి హరీశ్ కూడా అదే ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకుని ఈ రోజు పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. వరవరరావు, గద్దర్ వంటి విప్లవ నేతలు తన తండ్రి సత్యనారాయణ ఇంటికి తరుచు వచ్చే క్రమంలో సునీత మావోయిస్టు సిద్దాంతాల పట్ల ఆకర్షితురాలైంది. 1986లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో అజ్ఞాతంంగా పనిచేస్తూ 1986 ఆగస్టులో టీఎల్ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్ ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేశారు. 1992లో నల్లమల అడవులలో, 2001లో ఏవోబీకి, 2006లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. సునీత తన భర్త సుధాకర్ మరణించిన ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకుని తాజాగా పోలీసులకు లొంగిపోయారు.
లొంగిపోయిన చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ ఏటూరు నాగారం బీసీ వెల్పర్ హాస్టల్ పదో తరగతి చదువుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీతో పరిచయం ఏర్పడి అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2024లో ఏసీఎం హోదాలో పనిచేశాడు.