CM Revanth Reddy| సెంటిమెంటా..డెవలప్ మెంటా తేల్చుకోండి : జూబ్లీహిల్స్ ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపు
సెంటిమెంటా..డెవలప్ మెంటా తేల్చుకోవాని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచినందునే అక్కడ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం మీట్ ది ప్రెస్ మీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు
విధాత, హైదరాబాద్ : సెంటిమెంటా..డెవలప్ మెంటా తేల్చుకోవాని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచినందునే అక్కడ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం మీట్ ది ప్రెస్ మీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో కాంగ్రెస్ పాలనను పోల్చవద్దన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్..ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది ప్రజలతో కలిసిపోయే కల్చర్ అన్నది ఆలోచించాలని.. సినీ కార్మికులతో ఎవరున్నారు? సినీ తారలతో ఎవరున్నారో ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఉన్నట్లుగా కేటీఆర్ ప్రచారం ఉందని..శ్రీలీల ఐటమ్ సాంగ్ కు కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి తేడా లేదు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ , బీజేపీలు ఎన్ని గూడు పుఠానీలు చేసినా..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు ఓటమి, బీజేపీకి డిపాజిట్ గల్లంతు తథ్యమన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో దివాలా తీయించిందని..అన్ని రంగాల్లో బకాయిలు పెట్టి 8లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారని, తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్లలో సచివాలయం, కమాండ్ కంట్రోల్, ప్రగతిభవన్ నిర్మాణాలతో ఒక్క ఉద్యోగమైన వచ్చిందా అని ప్రశ్నించారు.మా హయాంలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం అని, మరో 20 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం అని, ప్రొఫెసర్లకు రిటైర్మెంట్ వయసు పెంచాం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకులు కాళేశ్వరం కట్టడం కూలడం అయిపోయిందని..లక్ష కోట్ల గోదావరి నీళ్ల పాలయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం లేకున్నా దేశంలోనే అత్యధికంగా వరి దిగుబడి వచ్చిందని, 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో వరి ఉత్పత్తి లేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పాలకులు రూ.20 లక్షల కోట్లతో నికరంగా ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేయలేదని, 100 ఏళ్లు పూర్తయిన ఉస్మానియా ఆసుపత్రిని కూడా కట్టలేదు అన్నారు. కేటీఆర్ దశనే సక్కగలేదు..రాష్ట్రానికి దిశ ఏం చూపిస్తాడని ప్రశ్నించారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించినవాడు మహిళలకు రక్షణగా ఉంటాడా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
బీఆర్ఎస్ వాళ్ళు దొడ్డిబియ్యం ఇస్తే మేము సన్నబియ్యం ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం, రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా, పింఛన్లు, షాదీ ముబారక్ కొనసాగించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లతో రైతు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు. ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల వైపు నడిపించాం అని, మా ప్రభుత్వంలో 7100 కోట్లు ఉచిత బస్సు కోసం ఖర్చు చేశాం అని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం అని, 3 వేల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం అన్నారు. రూ.500 కే సిలిండర్ ఇచ్చాం అని, రూ.200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ఆపలేదు అన్నారు. ఎర్రగడ్డ, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్ కు కృష్ణా జలాలను తీసుకొస్తే..వాటిని నెత్తిమీద పోసుకోవడం తప్ప కేసీఆర్ పదేళ్లలో కొత్తగా నగరానికి మంచినీటీ కోసం చేసిందేమి లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకున్న వారు..వరదలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి రూపాయి పారదర్శకంగా ఖర్చు చేస్తున్నాం అన్నారు. మేం వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం , మేం వచ్చాక హైదరాబాద్ కు 70 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయన్నారు. హైదరాబాద్ ఐటీ, నాలెడ్జ్ సిటీగా మారిందంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలసీలే కారణం అన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గుజరాత్ కి ఎన్నాళ్లు గులామ్ గా ఉంటాడని, తెలంగాణ అభివృద్ధి నీకు అవసరం లేదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ తో కిషన్ రెడ్డి బ్యాడ్ సోపతి చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదన్నారు. ఫార్ములా ఈ కారు రేసులో గవర్నర్ అనుమతి ఇవ్వకుండా బీజేపీ కాపాడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు.కేటీఆర్, కిషన్ రెడ్డి తోడుదొంగలుగా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. అయినా విడతల వారీగా రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటిఐఆర్ ను మేం తెస్తే , కేసీఆర్, మోదీలు కలిసి రద్దు చేశారు అన్నారు. చివరికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పక్కన కూడా కేసీఆర్ కమిషన్లు రావని పక్కన పెట్టారని, మేం దాని పూర్తి కోసం ప్రయత్నించే క్రమంలో ప్రమాదం జరిగితే బాధ కంటే పైశాచిక ఆనందమే ఎక్కువ పొందారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడైనా ప్రతిపక్షం ఇలా ఉండేనా అని, మీకు అంత అసహనం ఎందుకు అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావుల ముఖాలను అసెంబ్లీలో చూస్తే వారిలో అసహనం కనిపిస్తుందన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై కాలేజీల రాజకీయ ఆటలు, ఒత్తిళ్లు మా వద్ద సాగవన్నారు. కేసీఆర్ హయాంలో ఎందుకు బకాయిలపై అడగలేదని ప్రశ్నించారు. పిల్లలు ఫీజులు కట్టి వెళ్లిపోయాక వారి ఫీజులను యజమాన్యాలు తీసుకుంటున్నాయని, వాటన్నింటిని చూశాక బకాయిలు చెల్తిస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram