Telangana Budget 2026-27 | మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా బడ్జెట్ : భట్టి

2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. CURE, PURE, RARE వ్యూహాలతో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటించింది.

Reported by: Tejaswini Nanna | Latest News | Mar 20, 2026, 4:35 pm IST
Read Time: 4 mins
Telangana Budget 2026-27 | మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా బడ్జెట్ : భట్టి

విధాత, హైదరాబాద్ : ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ యూఎష్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం అని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం బడ్జెట్ లో విభాగాలవారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం అని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మూడు ఆర్థిక మండళ్లతో ముందుకు

తెలంగాణ సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన CURE, PURE, RARE వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ మూడు ప్రధాన ఆర్థిక మండళ్ల ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం అన్నారు.

CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ):

హైదరాబాద్ ORR లోపల ఉన్న ఈ ప్రాంతాన్ని టెక్నాలజీ, AI, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు మరియు ఫైనాన్షియల్ సర్వీసులకు హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. HILT పాలసీ ద్వారా కాలుష్య కారక పరిశ్రమలను తరలించి, పాత ఆటోలను ప్రభుత్వ ఖర్చుతోనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చి నెట్-జీరో లక్ష్యాన్ని సాధిస్తాం.

PURE (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ):

ORR మరియు RRR మధ్య ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్ ఇంజిన్‌గా మారుస్తున్నాం. ఇక్కడ MSME క్లస్టర్లు, లాజిస్టిక్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

RARE (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ):

RRR అవతల ఉన్న ప్రాంతాల్లో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, విలువ ఆధారిత వ్యవసాయం మరియు పర్యావరణ పర్యాటక రంగాలపై దృష్టి సారించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాం అని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బడ్జెట్ పై చెవుల్లో పువ్వులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
మాది పీపుల్స్ సెంట్రిక్ బడ్జెట్ : భట్టి విక్రమార్క చిట్ చాట్