Dolphins : ఇండియాలోని న‌దుల్లో ఉన్న డాల్ఫిన్ల లెక్క తేలింది!.. ఏ న‌దిలో ఎక్కువ ఉన్నాయంటే..

గంగా నది, దాని ఉప నదులైన చంబల్, యమునా, రాప్తి, శారదా, ఘఘరా, మహానంద, కోసి, గండక్, గెరువా, రూపనారాయణ్, తోర్సా, కల్జనీ, చుర్ని, హల్దీ నదుల్లో మొత్తం 7,109 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లను కవర్ చేశారు. యూపీలోని చంబల్‌ నదిలో భింద్‌, పచ్‌నద మధ్య 47 కిలోమీటర్ల ప్రాంతంలో అత్యధికంగా డాల్ఫిన్లు కనిపించినట్టు నివేదికలో పేర్కొన్నారు.

Dolphins : ఇండియాలోని న‌దుల్లో ఉన్న డాల్ఫిన్ల లెక్క తేలింది!.. ఏ న‌దిలో ఎక్కువ ఉన్నాయంటే..

Dolphins : నీటిలో చెంగు చెంగున దూకుతూ సందడి చేసే డాల్ఫిన్లను చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంది. డాల్ఫిన్లు మనిషితో అత్యంత ఫ్రెండ్లీగా ఉంటాయి. సాధార‌ణంగా స‌ముద్రాల్లో ఇవి ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. కానీ.. న‌దుల్లో సైతం డాల్ఫిన్లు అక్క‌డ‌క్క‌డ సంద‌డి చేస్తుంటాయి. దేశంలోని ఏయే న‌దుల్లో ఎన్ని డాల్ఫిన్లు ఉన్నాయో కేంద్ర ప్ర‌భుత్వం లెక్క‌లు తీసింది. దేశంలోనే ఇటువంటి స‌ర్వే చేప‌ట్ట‌డం ఇదే మొద‌టిసారి. ఈ స‌ర్వేను వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, అస్సాం, జార్ఖండ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలతోపాటు అరణ్యక్‌, వరల్డ్‌ వైడ్‌లైఫ్‌ ఫండ్‌, టర్టిల్‌ సర్వైవల్‌ అలయెన్స్‌, వరల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో ఆసక్తికర సంగతులు వెలుగు చూశాయి.

2021 నుంచి 2023 మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో మొత్తం 6,327 నదీ డాల్ఫిన్లు ఉన్నట్టు లెక్కగట్టారు. వీటిలో 6,324 డాల్ఫిన్లు గంగ, బ్రహ్మపుత్ర, వాటి ఉప నదుల్లో ఉన్నాయి. పంజాబ్‌లోని సింధు నదిలో మూడు డాల్ఫిన్లు ఉన్నట్టు కనుగొన్నారు. గంగ, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదుల్లో 8,406 కిలోమీటర్ల మేర ఈ సర్వే కొనసాగింది. మరోవైపు బియాస్‌ నదికి సంబంధించి 101 కిలోమీటర్ల పొడుగున సర్వే చేశారు. గంగానదిలో 5,689 నదీ డాల్ఫిన్లను గుర్తించారు. ఇవి కనిష్ఠంగా 5371, గరిష్ఠంగా 6,024 ఉండొచ్చని అంచనా వేశారు. బ్రహ్మపుత్రలో 635 డాల్ఫిన్లను కనుగొన్నారు. మొత్తంగా 6,234 డాల్ఫిన్లను గుర్తించగా, 5,977.. 6,688 మధ్య ఉంటాయని అంచనా వేసినట్టు సర్వే నివేదిక పేర్కొంటున్నది.

గిర్‌ నేషనల్‌ పార్క్‌లో నిర్వహించిన నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ ఏడవ సమావేశం సందర్భంగా ఈ గణాంకాలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం విడుదల చేశారు. 2020 ఆగస్ట్‌ 15న ప్రాజెక్ట్‌ డాల్ఫిన్‌ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం గుర్తించిన 6,324 గంగా డాల్ఫిన్లలో 3,275 డాల్ఫిన్లను ప్రధాన నదిలో కనుగొన్నారు. గంగ ఉప నదుల్లో మరో 2,414, బ్రహ్మపుత్ర ప్రధాన నదిలో 584 డాల్ఫిన్లను గుర్తించారు. డాల్ఫిన్ల గణన కోసం 28 నదులను పడవల ద్వారా సర్వే చేయగా, మరో 30 నదులను రోడ్డు మార్గంలో మ్యాపింగ్‌ చేశారు. వీటిలో అత్యధికంగా యూపీలో 2,397 డాల్ఫిన్లను కనుగొన్నారు. బీహార్‌లో 2,220, జార్ఖండ్‌లో 162, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో 95, పశ్చిమబెంగాల్‌లో 815, అస్సాంలో 635, పంజాబ్‌లో 3 డాల్ఫిన్లను గుర్తించారు.

గంగా నది, దాని ఉప నదులైన చంబల్, యమునా, రాప్తి, శారదా, ఘఘరా, మహానంద, కోసి, గండక్, గెరువా, రూపనారాయణ్, తోర్సా, కల్జనీ, చుర్ని, హల్దీ నదుల్లో మొత్తం 7,109 కిలోమీటర్ల మేర సర్వే చేశారు. యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లను కవర్ చేశారు. యూపీలోని చంబల్‌ నదిలో భింద్‌, పచ్‌నద మధ్య 47 కిలోమీటర్ల ప్రాంతంలో అత్యధికంగా డాల్ఫిన్లు కనిపించినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాన్పూర్‌- వింధ్యాచల్‌ మధ్య 380 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక కిలోమీటర్‌కు 1.89 చొప్పున డాల్ఫిన్లు ఉన్నట్టు కనుగొన్నారు.