Firefighters | మంటలు ఆర్పడమే కాదు.. 73 శాతం వేరే పనులు కూడా.. అగ్నిమాపక సిబ్బంది అసలైన బాధ్యతలివే!

Firefighters | ఫైర్ సిబ్బంది అంటే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి మంటలను ఆర్పుతారు! మిగిలిన టైమ్‌లో ఖాళీగానే ఉంటారని అనుకుంటాం. కానీ అంతకుమించి వారు నిర్వహించే బాధ్యతలు మరెన్నో ఉన్నాయని తెలుసా!

Firefighters | మంటలు ఆర్పడమే కాదు.. 73 శాతం వేరే పనులు కూడా.. అగ్నిమాపక సిబ్బంది అసలైన బాధ్యతలివే!

Firefighters | ఫైర్ సిబ్బంది అంటే అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి మంటలను ఆర్పుతారు! మిగిలిన టైమ్‌లో ఖాళీగానే ఉంటారని అనుకుంటాం. కానీ అంతకుమించి వారు నిర్వహించే బాధ్యతలు మరెన్నో ఉన్నాయని తెలుసా! దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ పనుల్లో కేవలం 27 శాతం మాత్రమే మంటలు ఆర్పడమైతే.. మిగిలిన 73 శాతం ఇతర అత్యవసర సేవలు కూడా నిర్వహిస్తుంటారని గణాంకాలు చెబుతున్నాయి.

అగ్నిప్రమాదాలు మాత్రమే కాదు.. ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా సరే ఫైర్ సిబ్బందే ముందుంటారు. నీటిలో మునిగిపోయిన వారిని రక్షించడం, పాములు పట్టడం నుంచి, తలుపులు తెరవడం, లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడం, జంతువులను రక్షించడం ఇలా వారు అనేక సేవలు చేస్తుంటారు.

పాములు పట్టడంలో ఫైర్ సిబ్బందే ముందు!

ఇళ్లలో పాములు కనిపించడం, తేనేటీగలు గూళ్లు పెట్టడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లోనే మాత్రమే కాకుండా పట్టణాల్లోనూ కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రజలు ముందుగా 101 నంబర్ ద్వారా అగ్నిమాపక సిబ్బందినే సంప్రదిస్తారు. తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అధికారికంగానే పాములు పట్టడాన్ని తమ సేవలో భాగంగా పేర్కొందంటే అర్థం చేసుకోండి. పలు అధ్యయనాల ప్రకారం.. తమిళనాడులో 63 శాతం పాముల నుంచి రక్షణ కాల్స్ ఫైర్ సర్వీసులకే వస్తున్నాయి.

తేనెటీగల గూళ్ల తొలగింపులో కూడా ఫైర్ సిబ్బంది కీలక పాత్ర పోసిస్తున్నారు. వీటి కోసం ఒకే ఏడాదిలో డజన్ల కొద్దీ కాల్స్ వస్తుంటాయట. ఇక వర్షాకాలంలో పాములు, వేసవిలో తేనేటీగలు ఇళ్లలోకి వస్తుండటంతో ఈ కాల్స్ మరింత ఎక్కువ అవుతున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

మొసళ్ల నుంచి కోతుల వరకు..

గుజరాత్‌లోని విశ్వామిత్ర నది పరిసరాల్లో మొసళ్లు పట్టణ ప్రాంతాల్లోకి రావడం తరచూ జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా అగ్నిమాపక సిబ్బందినే సేవలందిస్తుంటారు. ఇక యూపీ ఫిరోజాబాద్‌లోని ఒక స్కూల్ టాయిలెట్‌లో ఏడడుగల మొసలి కనిపించడం, గుజరాత్‌లోని సోజిత్రా గ్రామంలోని ఇంటి టాయిలెట్‌లో మొసలి బయటపడటం వంటి ఘటనల్లో ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక చెట్ల మధ్యలో చిక్కుకున్న పక్షులు, కంచెల్లో ఇరుక్కున్న కోతిపిల్లలు, తీగల్లో చిక్కుకున్న జంతువులను రక్షించడం కూడా వారి రోజువారీ పనుల్లో భాగమే.

తలుపులు మూసుకుపోయినా.. వారే దిక్కు

ఫైర్ సిబ్బందికి వచ్చే అత్యవసర కాల్స్‌లో ఎక్కువ మొత్తం లాక్‌డ్ రూమ్స్‌కు సంబంధించినవేనట. ఇటీవల హైదరాబాద్ చాంద్రయాణగుట్టలో ఇద్దరు చిన్నారులు గదిలో చిక్కుకుతే ఫైర్ సిబ్బందే వచ్చి వారిని రక్షించారు. పుణేలో ఓ వృద్ధురాలు ఇంట్లో చిక్కుకుపోతే అప్పుడు కూడా అగ్నిమాపక సిబ్బందే కాపాడారు. ఈ ఘటనలే కాకుండా పిల్లలు కార్లలో ఇరుక్కుపోవడం, బాల్కనీల్లో చిక్కుకుపోవడం వంటి ఘటనల్లో కూడా పోలీసులతో పాటు ఫైర్ సిబ్బందే ముందుగా స్పందిస్తారు.

మాటలే కాదు.. గణాంకాల్లోనూ వెల్లడి

ముంబైలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఫైర్ బ్రిగేడ్‌కు మొత్తం 12,815 కాల్స్ వస్తే.. అందులో కేవలం 3,484 మాత్రమే అగ్నిప్రమాదాలకు సంబంధించినవే. మిగతా కాల్స్ రక్షణ చర్యలు, ఇతర సేవలకు సంబంధించినవే కావడం గమనార్హం. అహ్మదాబాద్‌‌లో లిఫ్ట్‌లో చిక్కుకున్న 10 మంది మహిళలను రక్షించడానికి ఫైర్ సిబ్బంది గోడను పగులగొట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

ఇక దేశవ్యాప్తంగా 28వేలపైగా ఫైర్ స్టేషన్ల అవసరం ఉందని ఒక అంచనా. కానీ ప్రస్తుతానికి కేవలం 8500 ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పరిమిత వనరులతోనే అగ్నిమాపక సిబ్బంది అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు స్పందిస్తూ సేవలను అందిస్తు్న్నారు.

Read More:

Noorjahan Mango | 3 కిలోల మామిడి.. ఒక్కోటి రూ.వెయ్యి.. నూర్జహాన్‌కు పెరుగుతున్న డిమాండ్

Emergency Alert | ఎమర్జెన్సీ అలారంతో ఫోన్లకు ఫ్లాష్ మెసేజ్.. టెస్టింగ్‌లో సునామీ, భూకంపాలను పసిగట్టే కొత్త డిజాస్టర్ అలర్ట్ సిస్టమ్!