కవితకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు

కవితకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
  • తీహార్ జైలుకు కవిత


విధాత : ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవిత కస్టడీ ముగిసిపోవడంతో ఆమెను మరో 15రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరుపు న్యాయవాది జోయబ్ హుస్సెన్ కోరారు. లిక్కర్‌ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఇతర నిందితులను ప్రశ్నిస్తున్నామని, వారితో కలిపి కవితను విచారించాల్సివుందని వాదించారు.


కాగా.. ఆమె తరుపు న్యాయవాది బెయిల్ కోరుతూ కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదల ఉందని, అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుంది. కవితను అధికారులు తీహార్‌ జైలుకు పంపించారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 1న విచారించనున్నట్లుగా కోర్టు తెలిపింది.


నాది పొలిటికల్ లాండరింగ్ కేసు


కవితను కోర్టుకు హాజరుపరిచిన సందర్భంలో ఆమె తన వద్దకు వచ్చిన మీడియాతో మాట్లాడుతూ నాపై ఈడీ తప్పుడు కేసు పెట్టిందని, ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చుగాని, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో చెల్లించారని పేర్కోంది. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఆమె కోర్టులోకి వెళ్లారు.