కేసీఆర్ మూడో టర్మ్ కోసం 22 లగ్జరీ కార్లు! ఒక్కొక్కటి మూడున్నర కోట్లు
మూడోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కోసం గత ప్రభుత్వం 22 లగ్జరీ కార్లను ఒక్కొక్కటి మూడున్నర కోట్లతో కొనుగోలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

- ఎన్నికలకు ముందే కొనుగోలు
- విజయవాడలో దాచి పెట్టారు
- బీఆరెస్ నేతలు తిన్న లక్ష కోట్లలో కేటీఆర్ ఇచ్చింది లక్ష రూపాయలే..
- మిగిలినవన్నీ కక్కించి తీరుతాం
- ప్రజాపాలన లోగో ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
విధాత : రాష్ట్ర ఖజానాను గత బీఆరెస్ సర్కారు ఖాళీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే వాడుకునేందుకు వీలుగా 22 ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కార్లు ఒక్కొక్కటి మూడున్నర కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఎవ్వరికీ తెలియకుండా కొనుగోలు చేసి ఉంచిందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నిలకు ముందు వాటిని కొనుగోలు చేసి, వాటిని విజయవాడలో దాచిపెట్టారని చెప్పారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజాపాలన లోగో, అభయ హస్తం పథకాల దరఖాస్తు ఫారంను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి అధికారంలోకి వస్తే వాటిని వాడుదామని కేసీఆర్ అనుకున్నారని చెప్పారు. ఆ కార్ల సంగతి తెలియడానికి సీఎంగా తనకే వారం రోజులు పట్టిందని తెలిపారు. పాత కార్లకు మరమ్మతులు చేసి, వాటినే తిరిగి ఉపయోగించాలని తాను అధికారులను ఆదేశించిన సమయంలో 22 లాండ్‌క్రూజర్ కార్ల విషయాన్ని వారు తనకు తెలిపారని పేర్కొన్నారు. ఇదీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి సమకూర్చిన ఆస్తి అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వాళ్లవి ప్రజల రక్తం పిండి సంపాదించిన ఆస్తులని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని, అదే ఆస్తి సృష్టించడం అని చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్లపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని సీఎం తెలిపారు.
ఖాజనా ఖాళీ చేసేశారు..
లంక బిందెలనుకుని అధికారంలోకి వస్తే ఖాళీ కుండల మాదిరిగా ఖజనాను బీఆరెస్ పాలకులు ఖాళీ చేసేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పథకాల అమలుకు నిధుల సమీకరణ ఇప్పుడు తమకు సవాల్‌గా మారిందన్నారు. అయినా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని స్పష్టంచేశారు. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, 6.71 లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారని విమర్శించారు.
లక్ష కోట్లలో కేటీఆర్ లక్ష మాత్రమే చెల్లించారు
ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. బాధిత మహిళకు ఆయన లక్ష సాయం అందించారని ఆ రకంగా చూస్తే తమ ప్రజావాణి విజయవంతమైట్లేనన్నారు. కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష మాత్రమే ఇచ్చారని, మిగతా దోపిడీ సొమ్మంతా ప్రజలకు చేరేదాక వదలబోమని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు దోచుకుతిన్న సొమ్ము ప్రజల రక్తపు కూడని రేవంత్ వ్యాఖ్యానించారు.