Agent Review | ఈ ‘ఏజెంట్’ చిచ్చరపిడుగు కాదు.. ఇంకా సిసింద్రీనే!

Agent Review మూవీ పేరు: ‘ఏజెంట్’ విడుదల తేదీ: 28 ఏప్రిల్, 2023 నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి, డైనో మోరియా, సంపత్ రాజ్, ఊర్వశీ రౌతెలా తదితరులు ఎడిటింగ్: నవీన్ నూలి కథ: వక్కంతం వంశీ సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, జార్జ్. సి. విలియమ్స్ సంగీతం: హిప్ హాప్ తమిళ, భీమ్స్ సిసిరోలియో నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ సినిమా వచ్చి […]

  • By: krs    latest    Apr 28, 2023 1:02 PM IST
Agent Review | ఈ ‘ఏజెంట్’ చిచ్చరపిడుగు కాదు.. ఇంకా సిసింద్రీనే!

Agent Review

మూవీ పేరు: ‘ఏజెంట్’
విడుదల తేదీ: 28 ఏప్రిల్, 2023
నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి, డైనో మోరియా, సంపత్ రాజ్, ఊర్వశీ రౌతెలా తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి
కథ: వక్కంతం వంశీ
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, జార్జ్. సి. విలియమ్స్
సంగీతం: హిప్ హాప్ తమిళ, భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి
స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి

అక్కినేని అఖిల్ సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ సరైన విజయాలు సాధించక పోవడంతో పాటు.. అఖిల్‌కు గుర్తింపును కూడా ఇవ్వలేక పోయాయి. దీంతో ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టాలని.. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో సినిమా ప్లాన్ చేశారు. సినిమా అనుకున్నారు.. ముందు అంతా బాగానే జరిగింది.

కానీ.. తర్వాత కింగ్ నాగార్జున ఈ సినిమా విషయంలో కలుగజేసుకోవడంతో.. పలుమార్లు రీ షూట్స్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకే ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆగిపోవడం ఇలా వరసగా జరుగుతూ వచ్చాయి. ఈ వాయిదాలతో అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అనే అనుమానాలు బలపడుతోన్న నేపథ్యంలో.. ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమకథలకి పెట్టింది పేరు. ఏఎన్నార్, నాగార్జున, ఆఖరికి నాగచైతన్య కూడా ప్రేమకథలతోనే భారీ విజయాలను అందుకున్నారు. అఖిల్ కూడా ఇప్పటి వరకు ప్రేమకథలనే నమ్ముకున్నాడు.. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు యాక్షన్ హీరోగా గుర్తింపు కోసం ‘ఏజెంట్’తో సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన అఖిల్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. సినిమాలో విషయం ఉన్నట్లుగా తెలియజేశాయి. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వంటి నటుడు ఇందులో చేస్తుండటం కూడా సినిమాపై క్రేజ్‌కి కారణమైంది.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో చెప్పిన విషయాలు, ఇంకా నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన హైప్.. ఖచ్చితంగా అఖిల్‌ను ఈ సినిమా రీ లాంఛ్ చేస్తుందని అనుకునేలా చేశాయి. మేకర్స్ కూడా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించడంతో.. అఖిల్ మాములు స్టార్ కాదు.. పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడనేలా అక్కినేని ఫ్యాన్స్ కూడా కలలు కన్నారు. మరి, వారి కలలు, సినిమాపై అంచనాలు ఏ మేరకు సక్సెస్ అయ్యయో, ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందో.. మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

రామకృష్ణ అలియాస్ రిక్కి(అఖిల్)కి స్పై ఏజెంట్‌ కావాలనేది డ్రీమ్. ఆ డ్రీమ్‌ని నిజం చేసుకునేందుకు ‘రా’లో చేరాలని ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చేసిన మూడు ప్రయత్నాల్లోనూ సెలక్ట్ కాలేకపోతాడు. దీంతో తనకి తెలిసిన ఎథికల్ హ్యాకింగ్ విధానాన్ని అనుసరించి ‘రా’ ఛీప్ కల్నల్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ని హ్యాక్ చేసి అతనికి ఝలక్ ఇస్తాడు. తన సిస్టమ్ హ్యాక్ చేసిన రిక్కీని మహాదేవ్ కనిపెడితే.. తన మనసులోని మాట చెబుతాడు. కానీ అతని కోతి చేష్టలు చూసి.. మహాదేవ్ కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడు. కానీ, ఓ మిషన్ నిమిత్తం రిక్కీని మహాదేవ్ లైన్‌లోకి దింపుతాడు.

భారతదేశాన్ని నాశనం చేసేందుకు గాడ్ (డినో మోరియా).. చైనాతో కలిసి ఓ భారీ కుట్రకు పథకం రచిస్తాడు. ఆ కుట్రను కనుగొనే క్రమంలో ఒకసారి ఫెయిల్ అయిన మహదేవ్.. ఈసారి రహస్య ఏజెంట్‌గా రిక్కీని సెలక్ట్ చేసుకుంటాడు. కానీ మహదేవ్ ఆదేశాలను పక్కన పెట్టి రిక్కీ వేరే ప్రయత్నం చేస్తాడు. రిక్కీ అలా ఎందుకు చేశాడు? ‘రా’ ఏజెంట్‌గా పనికి రాని వాడిని.. రహస్య ఏజెంట్‌గా మహదేవ్ ఎందుకు సెలక్ట్ చేశాడు? మధ్యలో వైద్యతో రిక్కీ ప్రేమాయణం ఎలా నడిచింది? గాడ్ తలపెట్టిన ‘మిషన్ రాబిట్‌’ని ఏజెంట్ ఎలా ఆపగలిగాడు? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ని థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

సినిమా రిజల్ట్ ఏదైనా కానివ్వండి.. అఖిల్ ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్‌కి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. కండలు తిరిగిన శరీరం కోసం ఎంత కష్టపడ్డాడో.. సురేందర్ రెడ్డి సృష్టించిన పాత్ర కోసం కూడా అంతే ఎఫర్ట్ పెట్టాడు. అందుకే అఖిల్ పరంగా ఈ సినిమాకు ప్లస్సే కానీ మైనస్ కానే కాదు. యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా అఖిల్ మెప్పిస్తాడు. అఖిల్ నటన పరంగా ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కాడనే చెప్పుకోవాలి. మమ్ముట్టి ఈ పాత్రను ఎందుకు అంగీకరించారో తెలియదు కానీ.. ఆ పాత్రకు మాత్రం ఆయన పూర్తిగా న్యాయం చేశారు. అందుకు తన అనుభవం కూడా తోడైంది. ‘రా’ ఛీప్‌గా చాలా హుందాగా కనిపించారు.

హీరోయిన్‌‌గా చేసిన సాక్షికి మాత్రం పెద్దగా స్కోప్ లేదు. అసలామె పాత్ర, పాటలు లేకుండా ఉంటే ఈ స్పై థ్రిల్లర్ ఇంకాస్త వేగవంతంగా ఉండేదనిపిస్తుంది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా అంత గొప్పగా ఏం లేదు. గాడ్‌గా విలన్ పాత్రలో నటించిన డినో మోరియాకు సెకండాఫ్‌లో మంచి సీన్స్ పడ్డాయి. అతను కూడా పర్వాలేదనిపిస్తాడు. ఒకానొక దశలో అతని పాత్రే హైలెట్ అనేలా ఉంటుంది.

సెంట్రల్ మినిస్టర్ జయకిషన్ పాత్రలో సంపత్ రాజ్‌కు కొన్ని సీన్లు పడ్డాయి. సంపత్, అఖిల్ కాంబినేషన్‌లో వచ్చే ఓ సీన్ హైలెట్ అనేలా ఉంటుంది. ఇంకా వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ, విక్రమ్ జిత్ వంటి వారు వారి పాత్రల పరిధిమేర నటించారు. ఊర్వశి రౌతెలా ఓ పాటలో మెరిసింది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని సినిమాలకు ప్లస్‌లుగా నిలుస్తున్న మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకి ప్రధాన మైనస్‌‌గా ఉంది. ‘ధృవ’ వంటి సినిమాకు సంగీతం ఇచ్చాడని ఈ సినిమాకు హిప్‌హప్‌ తమిజాను పెట్టుకున్నారో.. లేక ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఈ సినిమాకు అస్సలు అతను సపోర్ట్ చేయలేదని అనిపిస్తుంది. అందుకే భీమ్స్ సిసిరోలియో పేరు కూడా వేశారు. కాకపోతే అతను చేయడానికి కూడా ఏం లేదు. పాటలు పంటికింద రాళ్లలా అనిపిస్తాయి.

సినిమాటోగ్రఫీ మాత్రం చాలా రిచ్‌గా ఉంది. ఇక్కడ కూడా ఇద్దరు పని చేయడం విశేషం. ఈ సినిమాకి రీషూట్స్ జరిగాయనేది సినిమా చూస్తుంటే కూడా అర్థమవుతుంది. ఎడిటింగ్ పరంగా సాక్షి వైద్య ఎపిసోడ్స్, పాటలు లేపేసి ఉంటే బాగుండేది. ఉన్నంతలో ఎడిటింగ్, కెమెరా వర్క్‌కు మాత్రం మంచి మార్కులు పడతాయి. అసలు సినిమాలో కథ లేనిదే.. ఎవరు ఎంత ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం.

అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ తర్వాత అయినా వక్కంతం తన రూటు మార్చి ఉంటే బాగుండేది. మరో రొటీన్ కథతో సరి పెట్టేశాడు. అఖిల్ కోసం, సురేందర్ వర్క్ మీద నమ్మకంతో నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు సురేందర్ రెడ్డి రొటిన్ కథని ఆసక్తకర స్ర్కీన్‌ప్లేతో ఆకర్షించే ప్రయత్నం చేయలేక పోయాడనే చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ విక్రమ్ తరహాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.

విశ్లేషణ:

స్పై అనగానే.. మిషన్ గన్‌లు, సిక్స్‌ప్యాక్ బాడీ అన్నట్లుగా దర్శకుడు భావించినట్లు ఉన్నాడు. మాములుగా అయితే స్పై థ్రిల్లర్‌‌లో కథ కంటే కూడా ఆ కథని ఎంత గొప్పగా ఎగ్జిక్యూట్ చేశారనేదే ప్రధానాంశం. ఆ విషయంలో ఈ సినిమా పూర్తిగా గాడి తప్పింది. రొటీన్ కథే అయినా.. దీనికి సరైన స్ర్కీన్‌ప్లే, యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలను జోడించి ఉంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మరో ‘విక్రమ్’ అయ్యేది.

కథ పరంగా ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన ‘పఠాన్’ సినిమా కూడా గుర్తొస్తుంది. ‘రా’ ఏజెంట్‌ కావాలని కలలుగనే రిక్కీ పాత్రను.. కలతోనే ప్రారంభించడం బాగుంటుంది. ఆ తర్వాత లవ్ ట్రాక్‌తో బోర్ కొడితే.. కేంద్రమంత్రి సీన్‌తో కాస్త ఇంట్రస్ట్ వస్తుంది. ఇక సెకండాఫ్‌పై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసేలా ఇంటర్వెల్‌‌ని ప్లాన్ చేశారు కానీ.. సెకండాఫ్‌లో ఈ సినిమా గ్రాఫ్ లేపే సీన్స్ పడకపోవడంతో.. అఖిల్, మరో సినిమా చూసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు.

సెకండాఫ్‌లో వచ్చే సీన్స్ చాలా వరకు ముందే తెలిసిపోతుంటాయి. ఉత్కంఠ కలిగించే, థ్రిల్ చేసే జానర్‌ని ఎన్నుకున్నా.. ఆ దిశగా మాత్రం ఈ సినిమాని తెరకెక్కించలేకపోయారు. ఈ సినిమాతో చిచ్చర పిడుగులా మారిపోదామనుకున్న ఈ సిసింద్రీని.. ఇంకా సిసింద్రీగానే ఉంచేశారు. అఖిల్ పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది.

అఖిల్‌ని యాక్షన్ హీరోని చేసే క్రమంలో.. సురేందర్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం అస్సలు వర్కవుట్ కాలేదనే చెప్పుకోవాలి. ‘రా’ ఏజెంట్స్‌కి ఉండాల్సింది బాడీ కాదు.. బ్రెయిన్ అనే విషయంపై సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్‌కి, అక్కినేని ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ తప్పదు. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాలని ప్లాన్ చేసిన ఈ ‘ఏజెంట్’ ప్రయత్నాలన్నీ విఫలమైనట్లే.

ట్యాగ్‌లైన్: ఈ ‘ఏజెంట్’ చిచ్చరపిడుగు కాదు.. ఇంకా సిసింద్రీనే!
రేటింగ్: 2.25/5