ఏంటి అనసూయ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందా.. ఆమె మాటలు వింటే షాకవుతారు..!

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా తన సత్తా చూపించి ఇప్పుడు నటిగాను మంచి పేరు తెచ్చుకుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. పాన్ ఇండియా చిత్రం పుష్పలో దాక్షాయణిగా కనిపించి అలరించిన అనసూయ ఇప్పుడు పుష్ప2లో కూడా కనిపించనుంది. అయితే తాజాగా అనసూయ నటించిన చిత్రం రజాకార్. యాట సత్యనారాయణ దర్శకత్వంలో బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రలో కనిపించి అలరించనుంది.
అతి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రజాకార్ సినిమా నుంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అనే పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో అనసూయ మెయిన్ లీడ్ కావడంతో సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి చిత్ర బృందంతో అనసూయ కూడా హాజరైంది. అయితే చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందడం, అలానే నిర్మాతలు రాజకీయాలకి సంబంధించిన వారు కావడంతో మీడియా వాళ్లు అనసూయని రాజకీయాలకి సంబంధించిన ప్రశ్నలు వేశారు. మీరు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఏమైన ఉందా? రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని వరుస ప్రశ్నలు అడిగారు.
మీడియా ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇస్తూ.. రాజకీయాలు నా వల్ల కాదు, వాటిపై ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదైన సమాజానికి చేయాలని అనుకుంటే బయట ఉండి కూడా చేయవచ్చు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. నేను బయట ఉండే చాలా చేస్తున్నాను, మీకు కూడా తెలుసు అని చెప్పుకొచ్చింది అనసూయ. ఇక ఏ పార్టీ వాళ్ళైనా ఆహ్వానించారా, ఈ సినిమా నిర్మాత బీజేపీ నేత కదా అని అడగగా.. నన్ను ఏ పార్టీ వాళ్ళు పిలవలేదు. సినిమా నిర్మాతకు, నాకు మధ్య అసలు రాజకీయాల ప్రస్తావనే రాలేదు అని కూడా అనసూయ ఈ సందర్భంగా తెలియజేసింది. మొత్తానికి అనసూయ పొలిటికల్ ఎంట్రీపై అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.