కర్ణాటక రాజకీయాల్లో మరో నేత రిటైర్మెంట్
ఇవే చివరి ఎన్నికలన్న కుమారస్వామి 2028 ఎన్నికల్లో పోటీ చేయబోనని వెల్లడి ఒక వైపు కర్ణాటకలో ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ.. జేడీఎస్ కీలక నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగబోయే ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారు. విధాత : కర్ణాటకలో మరో కీలక నేత రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతుంటే.. ఇవే తనకు చివరి […]

- ఇవే చివరి ఎన్నికలన్న కుమారస్వామి
- 2028 ఎన్నికల్లో పోటీ చేయబోనని వెల్లడి
ఒక వైపు కర్ణాటకలో ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ.. జేడీఎస్ కీలక నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగబోయే ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారు.
విధాత : కర్ణాటకలో మరో కీలక నేత రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతుంటే.. ఇవే తనకు చివరి ఎన్నికలని జనతాదళ్ (సెక్యులర్) (Janata Dal (Secular)) నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) సంచలన ప్రకటన చేశారు. తన పంచ రత్న ప్రచార కార్యక్రమంలో భాగంగా చెన్నపట్న(Channapatna)లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 2023 ఎన్నికలు తనకు చివరివని, 2028 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగినా.. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని సంకేతాలిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో చెన్నపట్న నుంచి పార్టీ కార్యకర్తను నిలబెట్టి.. ఆయన విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు. ‘2028 ఎన్నికల్లో నేను పోటీ చేయను. రాజకీయాలంటే నాకు విసుగెత్తి పోయింది. నాకు విశ్రాంతి కావాలి. ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకొన్నా.. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతాను’ అని కుమారస్వామి చెప్పారు. ప్రస్తుతం కుమారస్వామి చెన్నపట్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2018లో చెన్నపట్నతోపాటు రామనగర (Ramanagara) నియోజకవర్గం నుంచి కూడా కుమారస్వామి పోటీ చేశారు.
ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని ఇటీవల కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. 224 సీట్లు ఉన్న అసెంబ్లీలో మెజర్టీ అయిన 123 నియోజకవర్గాల్లో విజయం సాధించి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. మే 24తో కర్ణాటక అసెంబ్లీ పదవీకాలం ముగియనున్నది.
2018 ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. బీజేపీ తరఫున యడ్యూరప్ప (BS Yediyurappa) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా.. మెజార్టీ నిరూపించుకోలేక రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఆ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడలేక పోయింది. విపక్షాలను చీల్చిన బీజేపీ.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయినా.. బీజేపీ అధిష్ఠానం 2021లో బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ను సీఎం పీఠంపై కూర్చొనబెట్టింది.