Earth | 260 కాంతి సంవత్సరాల దూరంలో.. అద్దంలా మెరుస్తున్న గ్రహం
Earth విధాత: మనం ఊహించలేనంత వేడిగా ఉండే ఒక గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఇది సౌర కుటుంబం ఆవల అత్యంత ఎక్కువగా కాంతిని పరావర్తనం చెందించే గ్రహమని తెలిపారు. అందుకే దీనిని ముద్దుగా మిర్రర్ ప్లానెట్ అని పిలుస్తున్నారు. ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ గ్రహం గురించి ఇటీవల ప్రచురితమైంది. మనకు సుమారు 260 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన గ్రహం.. తన సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో […]

Earth
విధాత: మనం ఊహించలేనంత వేడిగా ఉండే ఒక గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఇది సౌర కుటుంబం ఆవల అత్యంత ఎక్కువగా కాంతిని పరావర్తనం చెందించే గ్రహమని తెలిపారు. అందుకే దీనిని ముద్దుగా మిర్రర్ ప్లానెట్ అని పిలుస్తున్నారు. ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ గ్రహం గురించి ఇటీవల ప్రచురితమైంది.
మనకు సుమారు 260 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన గ్రహం.. తన సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో 80 శాతం వెలుగును అంతరిక్షంలోకి పరావర్తనం చెందిస్తోంది. అంతేకాకుండా ఈ గ్రహంపై మెటల్ మేఘాలు టైటానియం లోహాన్ని వర్షిస్తాయి. యూరప్‌కు చెందిన ఎక్సోప్లానెట్ ప్రోబింగ్ చిఓప్స్ స్పేస్ టెలిస్కోప్‌తో పరిశోధకులు ఈ గ్రహాన్ని అధ్యయనం చేశారు.
2020లో మొదటిసారి శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని గుర్తించారు. దీనికి ఎల్ టీ టీ 9779బి అని పేరు కూడా పెట్టారు. ఇది సుమారు మన శుక్ర గ్రహం అంత పరిమాణంలో ఉంటుందని పరిశోధనలో పాలు పంచుకున్న వివెన్ పార్మెంటియర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఎల్ టీ టీ 9779బి తన సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం కేవలం 19 గంటలేనని వెల్లడించారు.
ఈ గ్రహం సూర్యునికి బాగా దగ్గరగా ఉండటంతో.. దాని వైపు ఉండే ఉపరితలంపై సుమారు 2000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే ఇంత ఉష్ణోగ్రత ఉన్న గ్రహంపై మేఘాలు ఎలా ఏర్పడతాయన్న ప్రశ్న చాలా కాలం పరిశోధకులను వేధించింది. మనం బాగా వేడి నీటితో స్నానం చేసినపుడు. ఆ ఆవిరి పైకి లేచి పేరుకున్నట్లే ఈ గ్రహం మీదా మెటాలిక్ మేఘాలు ఏర్పడుతున్నాయని భావిస్తున్నామని పార్మెంటియర్ వెల్లడించారు.
ఈ గ్రహం ఉన్న ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ ఎడారి అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి గ్రహాలు వెంటనే నాశనమైపోవాలి అని పార్మెంటియర్ తెలిపారు. వీటిపై ఉన్న వాతావరణం అంతా దాని సూర్యునిలో కలిసిపోయి.. ఒక భారీ ఆస్టరాయిడ్ గా మారి ఉండాలని పేర్కొన్నారు. అయితే దీనిపై ఎల్లప్పుడూ ఉంటే మెటాలిక్ మేఘాలు ఈ గ్రహానికి ఒక ఉక్కు కవచంగా ఉన్నాయని అందువల్లే ఈ గ్రహం ఇలా నిక్షేపంగా ఉందని అధ్యయనంలో వెల్లడించారు.