చైనా దా‘రుణ’ యాప్‌లపై కొరడా.. 232 యాప్‌లపై కేంద్రం నిషేధం..!

యాప్‌ల‌కు డైరెక్ట‌ర్లుగా భార‌తీయుల నియామ‌కం.. ఏటా 3వేల శాతం వ‌డ్డీ పెంచేస్తున్న వైనం.. వ‌డ్డీ చెల్లించ‌క‌పోతే దారుణంగా వేధింపులు.. China App | డ్రాగన్‌ కంట్రీ చైనాకు భారత్‌ షాక్‌ ఇచ్చింది. సామాన్యులకు చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చి దోపిడీ, వేధింపులకు గురి చేస్తున్న రుణ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రజ‌ల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 రుణ చెల్లింపుల యాప్‌లను […]

చైనా దా‘రుణ’ యాప్‌లపై కొరడా.. 232 యాప్‌లపై కేంద్రం నిషేధం..!
  • యాప్‌ల‌కు డైరెక్ట‌ర్లుగా భార‌తీయుల నియామ‌కం..
  • ఏటా 3వేల శాతం వ‌డ్డీ పెంచేస్తున్న వైనం..
  • వ‌డ్డీ చెల్లించ‌క‌పోతే దారుణంగా వేధింపులు..

China App | డ్రాగన్‌ కంట్రీ చైనాకు భారత్‌ షాక్‌ ఇచ్చింది. సామాన్యులకు చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చి దోపిడీ, వేధింపులకు గురి చేస్తున్న రుణ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రజ‌ల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 రుణ చెల్లింపుల యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు హోంశాఖ వ్యవహారాల శాఖ నుంచి ఈ వారంలో ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది.

ఈ యాప్‌లను బ్లాక్ చేసే ప్రక్రియను ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ ప్రారంభించినట్టు సమాచారం. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69 ప్రకారం.. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. చైనా వ్యక్తులు ఈ యాప్‌లకు డైరెక్టర్లుగా భారతీయుల్ని నియమించి తమ వ్యూహాలను అమలు చేస్తున్నట్టుగా సమాచారం.

యాప్‌ నిర్వాహకులు ఏటా దాదాపు 3వేల శాతం మేర వడ్డీని పెంచేస్తున్నారు. రుణం తీసుకున్నవారు ఒకవేళ ఏదైనా పరిస్థితులతో వడ్డీని చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే.. యాప్‌ల నిర్వాహకులు దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు వారి ఫోన్‌లో ఉన్న ఫొటోలను తీసుకొని మార్ఫింగ్‌ చేసి వాటిని బయటపెడతామని బెదిరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్‌లో డబ్బులు పోగొట్టుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సైతం ఈ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరడంతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ గత ఆరు నెలల క్రితం 28 చైనా రుణ చెల్లింపు యాప్‌లను విశ్లేషించింది. అయితే, 94 యాప్‌లు ఈ-స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నట్టు కేంద్రం గుర్తించింది.

2020 జూన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం 2వేలకు పైగా చైనా యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో టిక్‌టాక్‌, షేరిట్‌, వియ్‌చాట్‌, హలో, లైకీ, యూసీ న్యూస్‌, బిగో లైవ్‌, యూసీ బ్రౌజర్‌ తదితరాల‌తో పాటు చైనీస్‌ యాప్‌లున్నాయి.