Banakacherla| బనకచర్లపై పునరాలోచన చేయాలి: సీఎం చంద్రబాబుకు ఏపీ నిపుణుల లేఖ

అది కాంట్రాక్టర్ కోసం పుట్టిన పథకం
కృష్ణా, గోదావరి జలాలలో ఏపీ హక్కులకు ప్రమాదం
విజయవాడకు వరద ముప్పు
పోలవరం – సోమశిలలో అందరికి మేలు
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆలోచనాపరుల వేదిక బహిరంగ లేఖ
విధాత, హైదరాబాద్ : గోదావరి – బనకచెర్ల పథకాన్ని గత సీఎంలు కేసీఆర్ – జగన్మోహన్ రెడ్డి..ఒక గుత్తేదారు సంస్థ అధినేత(మెగా కృష్ణారెడ్డి) మధ్యవర్తిత్వంతో పుట్టుకొచ్చిన పథకమని..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూగా ఇదే విషయాన్ని చెప్పారని..ఆ పథకంపై మీరు అడుగు ముందుకు వేస్తే మీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని..ఈ పథకం కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులకు, మరీ ప్రత్యేకంగా కరవు పీడిత రాయలసీమ నీటి హక్కులకు ప్రమాదకారిగా పరిణమిస్తుందని ఏపీ ఆలోచనా పరుల వేదిక సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసింది. రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సాగునీటి నిపుణులు లక్ష్మీ నారాయణ, అక్కినేని భవానీ ప్రసాద్, పాపారావు లు బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆలోచన పరుల వేదిక పేరుతో ఈ లేఖాస్త్రం సంధించారు. పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణా నది మీదుగా బనకచర్లకు తరలించాలనే ప్రతిపాదన తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమకు నీరుపేరుతో ప్రజల్నిమభ్య పెడుతున్నారని, దాని వల్ల నికర జలాల్లో వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునారాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం నిర్మించకుండా కాంట్రాక్టర్ల కోసం నిర్మించాలనుకోవడం సరికాదని ఆలోచనపరుల వేదిక సూచించింది. కాంట్రాక్టర్ల ఒత్తిడి, లాభాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం సరికాదని, ఈఏపీ పేరుతో కాంట్రాక్టర్లే డిజైన్ చేసి, రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రజలపై అప్పుల భారం మోపడాన్ని తప్పు పట్టారు. జగన్-కేసీఆర్-మేఘా కృష్ణా రెడ్డి మదిలో పుట్టిన బనకచర్లపై చంద్రబాబు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వారు ప్రశ్నించారు.
లేఖలోని అంశాలు:
విజయవాడ
తేదీ: 27-06-2025
మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. ప్రతిపక్షం శాసన సభకు వెళ్లడం లేదు. పోలవరం – బనకచెర్ల లాంటి అత్యంత కీలకమైన సమస్యలపై ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు, ఆయా రంగాలకు చెందిన నిపుణులు మరియు అధ్యయనకారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేదు. ఆలోచనాపరుల వేదికగా ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి, వినతిపత్రాన్ని అందజేసి, మా అభిప్రాయాలను నేరుగా తెలియజేద్దామన్నా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మా వినతిపత్రాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపాము. దాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము.
………………………………
శ్రీ నారా చంద్రబాబునాయుడు,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్,
అమరావతి
గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి,
విషయం: కృష్ణా – గోదావరి జలాల సమస్యలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, గోదావరి – బనకచెర్ల ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం
కృష్ణా – గోదావరి నదీ జలాల హక్కుల కోసం రాజీలేని పోరాటం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిన అవశ్యకత, గోదావరి – బనకచెర్ల ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో మా అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
1. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో 500 టీఎంసీలు, గోదావరి నదీ జలాల్లో 1000 టీఎంసీలు కేటాయించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు చేసిన డిమాండును నిర్ద్వంద్ధంగా తిరస్కరించి, ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
2. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం -1956 మేరకు ఏర్పాటు చేసిన మొదటి కృష్ణా జల వివాదాల (బచావత్) ట్రిబ్యునల్ 1973లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పునరుత్పత్తి జలాలతో కలిపి 811 టీఎంసీలు కేటాయించబడ్డాయి. అందులో తెలంగాణ వాటా 278.96 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా 522 టీఎంసీలు. 75% ప్రామాణికంగా లభించే జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రెండవ కృష్ణా జల వివాదాల (బ్రజేష్ కుమార్) ట్రిబ్యునల్ తీర్పు 2013లో పునరుద్ఘాటించింది. ట్రిబ్యునల్ కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా ఆదా అయ్యే నీటిలో 20 టీఎంసీలను భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించి, సిడబ్ల్యూసి ఆమోదంతో నిర్మించబడింది. అలాగే, 11 టీఎంసీల పునరుత్పత్తి జలాలు మరియు కె.సి. కెనాల్ ఆధునికీకరణ ద్వారా ఆదా అయిన 8 టీఎంసీ, మొత్తం 19 టీఎంసీలను శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు కేటాయించి, సిడబ్ల్యూసి ఆమోదంతో, ప్రపంచ బ్యాంకు రుణంతో నిర్మించుకున్నాం. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సర్దుబాటులను పరిగణలోకి తీసుకున్న మీదట ఆంధ్రప్రదేశ్ కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు లభించాయి. ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు ఉన్న ఆ జాబితాను మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు, తెలంగాణ ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావుగారు ఆ సమావేశానికి హాజరైనారు. ఆ నిర్ణయం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా తీసుకున్న సహేతుకమైన నిర్ణయం.
3. మొదటి అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం తాత్కాలికమైనదని బి(టి)ఆర్ఎస్ వక్రీకరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం -1956 ప్రకారం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి తెలంగాణ లేవనెత్తిన నీటి సమస్యపై విచారణ జరుపమని ఆదేశించింది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నది. నదీ పరివాహక ప్రాంతం నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటూ బచావత్ ట్రిబ్యునల్ ముందు కర్నాటక ప్రభుత్వం వాదించింది. ఆ వాదనను బచావత్ ట్రిబ్యునల్ నిర్ద్వందంగా తిరస్కరించింది. కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అదే వాదనను వినిపిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును పొరపాటున బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరగదోడితే అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కర్నాటక మరియు మహారాష్ట్రలు ట్రిబ్యునల్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయని గమనించాలి. పురాతనమైన కృష్ణా డెల్టా మరియు కె.సి. కెనాల్, కృష్ణా బేసిన్ పరిధిలోలేని నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు భాగాలకు మరియు ఎస్సార్బీసీకి నికర జలాల కేటాయింపును రద్దుచేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించాలని, తెలుగు గంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా, వెలిగొండ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్ లో లేవని, వాటికి నీటిని కేటాయించడానికి వీల్లేదని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీకి తరలించే 80 టీఎంసీలలో మహారాష్ట్ర మరియు కర్ణాటక వాటా 35 టీఎంసీలు పోను, మిగిలిన 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే కృష్ణా డెల్టా ఆధునికీకరణ పథకం ద్వారా ఆదా అవుతాయాని అంచనా వేసిన 20 టీఎంసీలను తెలంగాణలో నిర్మించబడిన భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించబడ్డాయి. క్రిష్ణా డెల్టా ఆధునికీకరణ పథకం ఇంకా పూర్తి కాలేదు. కానీ, భీమా పథకానికి సర్దుబాటు చేసిన నీటిని తెలంగాణ వాడుకొంటున్నది. ఈ వాస్తవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ నేడు పెనుసవాల్ గా పరిణమించింది. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేసి, కృష్ణా జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా సంక్రమించిన నీటి హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
4. 1980 నుండి అమల్లోకి వచ్చిన గోదావరి నది జల వివాదాల ట్రిబ్యునల్ (బచావత్ ట్రిబ్యునల్) తీర్పు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1172.78 టీఎంసీలు కేటాయింపు లభించింది. నాటి మధ్యప్రదేశ్ (ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) రాష్ట్రం నిర్మించే భోపాల్ పట్నం జల విద్యుత్ కేంద్రం వినియోగం తర్వాత కిందికి ప్రవహించే 192 టీఎంసీలు మరియు 108.50 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో కలిపి మొత్తం 1473.28 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దక్కాయి.
గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా కనబరిచిన కేటాయింపులు మరియు చిన్ననీటి వనరుల వినియోగం పద్దు కింది చూపెట్టిన నీటిని కలిపితే కొంత అస్పష్టంగా ఉన్నప్పటికీ తెలంగాణకు దాదాపు 800 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు దాదాపు 680 టీఎంసీలు ఉన్నట్లు లెక్కతే లుతున్నది. ఈ వాస్తవాలను మరుగుపరుస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గోదావరి జలాల్లో 1000 టీఎంసీలు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం చూస్తుంటే పురాతనమైన గోదావరి డెల్టాకు 300 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న పోలవరానికి 300 టీఎంసీల నికర జలాలు లాభిస్తాయా! అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గోదావరి నదీ జలాల అంశం తీవ్రరూపం దాల్చుతున్నదనిపిస్తున్నది. రాజ్యాంగం, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులు, అత్యున్నత న్యాయస్థానం తీర్పులే శిరోధార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదానికి ముగింపు పలకాలంటే తాము కోరుతున్నట్లు నీటిని కేటాయించాలని తెలంగాణ “బ్లాక్ మెయిల్” చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లుబాటు కాదన్న విషయాన్ని విస్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
5. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ట్రిబ్యునల్ తీర్పులను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను మనం వ్యతిరేకించాలి. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడంలేదన్న మీ వ్యాఖ్యలు తీవ్రఆందోళన కలిగిస్తున్నాయి. 2021 అక్టోబరు 14 నుండి అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో స్పష్టంగా అనుమతిలేని ప్రాజెక్టుల జాబితాను వెల్లడించారు. అందులో పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా అదనంగా ఒక టీఎంసీ తరలింపు, వగైరా భారీ మరియు మధ్య తరహా ప్రాజెక్టులున్నాయి. వాటినింటిని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించకపోతే ఆంధ్రప్రదేశ్ కు శాశ్వతంగా తీవ్రనష్టం వాటిల్లుతుంది.
6. 29 టీఎంసీల కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ఎన్టీఆర్ ప్రభుత్వం చేపట్టిన తెలుగు గంగ నిర్మాణం అత్యధిక భాగం పూర్తి కావడంతో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 టీఎంసీల కృష్ణా సగటు నీటి లభ్యత జలాలను కేటాయించింది. 40 టీఎంసీల కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న హంద్రీ – నీవా సుజల స్రవంతి మరియు 38 టీఎంసీల కృష్ణా మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న గాలేరు – నగరి సుజల స్రవంతికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 రక్షణ కల్పించింది. చట్టంలో ప్రస్తావించిన తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
7. శ్రీశైలం రిజర్వాయరుకు వరద ప్రవాహ రోజులు తగ్గిపోయిన నేపథ్యంలో హంద్రీ – నీవా ప్రధాన కాలువను 6100 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించడానికి మీరు గతంలో పరిపాలనా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ప్రధాన కాలువ విస్తరణ చేయకుండానే లైనింగ్ పనులు చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయడం మంచిదే. కానీ, నిర్ధేశిత లక్ష్యాలు నెరవేరవు. భవిష్యత్తులో విస్తరించాలంటే కనీసం ఒకవైపైనా కాలువ గట్టును, పలు నిర్మాణాలను పగలగొట్టాల్సి వస్తుంది. ప్రజాధనం వృథా అవుతుంది.
గాలేరు – నగరి రెండవ దశలో భాగమైన కడప – కోడూరు భాగం నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించారు. ఇది అత్యంత దారుణం. అతి ముఖ్యమైన శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు గుండెకాయలాంటి గోరకల్లు నిర్మాణాన్ని అసంపూర్తిగా, నాసిరకంగా చేయడంతో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి నెలకొన్నది. ఆ రిజర్వాయరు ప్రమాదపుటంచున ఉన్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వినియోగంలో ఉన్న పురాతనమైన పలు ప్రాజెక్టులు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదు. ఈ అంశాలపైన మీరు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
8. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, నిర్మాణంలో ఉన్న వంశధార ప్రాజెక్టులు, వంశధార – నాగావళి అనుసంధాన పథకం, తోటపల్లి బ్యారేజీ, తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలి. వంశధార జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోవడం పర్యవసానంగా నష్టం జరుగుతున్నది. నేడున్న సానుకూల రాజకీయ వాతావరణంలో ఆ సమస్యను సత్వరం పరిష్కరించుకోవడానికి మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాము.
9. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించిన గోదావరి – బనకచెర్ల పథకం కృష్ణా జలాల హక్కులకు ప్రమాదం తెచ్చిపెట్టేదిగా ఉన్నదని బలంగా భావిస్తున్నాము. పోలవరం కుడి కాలువ ద్వారా ప్రస్తుతం పట్టిసీమ నుండి 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి తరలించబడుతున్నాయి, భవిష్యత్తులో పోలవరం జలాశయం నుండి అందించబడతాయి. క్రిష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు ఆ నీటితో పాటు పులిచింతల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ప్రతిపాదిత పథకం ప్రకారం మొదటి దశలో పోలవరం జలాశయం నుండి +40 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున తాడిపూడి ఎత్తిపోతల పథకం మీదుగా పోలవరం కుడి కాలువకు దిగువన సమాంతరంగా వరద కాలువను తవ్వి 200 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి చేర్చుతామని ఆ నివేదికలో పేర్కొనబడింది. గత ఏడాది బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ప్రవహించిన బుడమేరు వరద నీరు, కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుండడం మూలంగా ప్రకాశం బ్యారేజీలోకి చేరలేక ఎగదన్ని కాలువకు భారీ గండ్లుపడి, విజయవాడను ముంచింది. మీ నాయకత్వంలో ఆ విపత్తు సహాయ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టి, ప్రజలను ఆదుకున్నారు. అలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా తరలించే పథకంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాము. పైపెచ్చు, గోదావరి నీటిని, క్రిష్ణా నదిలో కలిపితే బచావత్ ట్రిబ్యునల్ తీర్పును వాడుకుని, వాటా అడిగే అవకాశాన్ని పైరాష్ట్రాలకు ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నాము.
10. గోదావరి – పెన్నా అనుసంధానాన్ని, పోలవరం – సోమశిల అనుసంధాన పథకంగా పోలవరం కుడి కాలువకు ఎగువ భాగంలో చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు మరియు నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీరందిస్తూ, వైకుంఠాపురం వద్ద క్రిష్ణా నదిని, అటుపై నాగార్జునసాగర్ ను అక్విడెక్ట్స్ ద్వారా దాటించి, నూతనంగా నిర్మించతలపెట్టిన బొల్లాపల్లి జలాశయానికి చేర్చడం ఎంతో ప్రయోజనకరమని భావిస్తున్నాము. ఈ పథకం ద్వారా క్రిష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు నీటిని అందించడం ద్వారా క్రిష్ణా జలాలను ఆదాచేసి, శ్రీశైలం జలాశయం మీద ఆధారపడి నిర్మించిన మరియు నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు గ్రావిటీ మీద అందించడానికి అవసరమైన మౌలికమైన ప్రధాన కాలువలు, రిజర్వాయర్లు నిర్మించబడి ఉన్నాయి. ఇంకా అవసరమైన మేరకు ప్రధాన కాలువల విస్తరణకు ప్రభుత్వం గతంలోనే పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఆ పనులను సత్వరం పూర్తి చేయాలి.
11. గోదావరి – బనకచెర్ల పథకాన్ని కేసీఆర్ – జగన్మోహన్ రెడ్డి – ఒక గుత్తేదారు సంస్థ అధినేత మధ్యవర్తిత్వంతో పుట్టుకొచ్చిన పథకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అది వాస్తవం కూడా. ఆ పథకంపై మీరు అడుగు ముందుకు వేస్తే మీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావిస్తున్నాం. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ తో ముడిపెట్టే ఈ పథకం కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులకు, మరీ ప్రత్యేకంగా కరవు పీడిత రాయలసీమ నీటి హక్కులకు ప్రమాదకారిగా పరిణమిస్తుంది. దాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
12. పోలవరం – సోమశిల పథకంగా చేపట్టి బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జునసాగర్ రెండవ దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమలసాగర్ కు నీటిని అందిస్తూ, సోమశిలకు అనుసంధానించి, సోమశిల ఆయకట్టుకు, కండలేరు ద్వారా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని తెలుగు గంగ మరియు గాలేరు – నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. తద్వారా క్రిష్ణా జలాలపై వత్తిడి తగ్గించవచ్చు, పెన్నా నీటిని ఆదా చేసి, రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించవచ్చు. ఈ మా ఆలోచనలను మీతో పంచుకుంటున్నాము. మీరు సానుకూలంగా స్పందించి, లోతుగా పరిశీలించి, సముచితమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము.
అభివందనములతో
ఎ. బి. వెంకటేశ్వరరావు
టి. లక్ష్మీనారాయణ
కంభంపాటి పాపారావు
అక్కినేని భవానీ ప్రసాద్