Jamili Elections |
- ఒకే ఎన్నిక మౌలిక రాజ్యాంగ సూత్రాలపై దాడి
- నిష్పాక్షిక ఎన్నికలపై విశ్వాసం లేకే ‘ఖర్చు’ వాదన
- విభిన్నతను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జమిలి
- ‘ఒకే’ సిద్ధాంతం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖర్చు 27,500 కోట్లు
- కాంగ్రెస్ వెచ్చించిన మొత్తం 9,625 కోట్లు మాత్రమే
- ఎన్నికలను ఖరీదుగా మార్చినదే బీజేపీ ప్రభుత్వం
- ఆ పార్టీ అధిక వ్యయంపై సుద్దులు చెప్పడమా?
- ఒకే ఎన్నికతో ఐదేళ్లు ప్రజలకు ఎవరు జవాబుదారీ?
- యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు లేకుంటే
- రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల పరిస్థితేంటి?
- ఇంకెన్నో నల్ల చట్టాలు తేవాలని చూస్తున్న ప్రధాని
- వాటికి అడ్డంకి ఉండకూడదనే జమిలి ఎన్నిక
- మోదీ గెలిస్తే పునర్విభజనలో దక్షిణాదికి ముప్పు
స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సమస్యలపై పార్టీ రహితంగా జరుగుతాయి. అదే విధంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై జరుగుతాయి. అందుకు విరుద్ధంగా ద్వేష రాజకీయాలను స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రవేశపెట్టడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. భారత దేశ రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పడినది. కొంతవరకు మాత్రమే కేంద్రం రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకోగలదు. ప్రజలను ఐదు సంవత్సరాలకు ఒకసారి కేవలం ఓటు వేసే యంత్రాలుగా, ప్రేక్షకులుగా మార్చేందుకు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు వీలులేని పరిస్థితులను కల్పించేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. – (డాక్టర్ మాధవరం నాగేందర్‌రావు)
భారత దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై, విభిన్న జాతుల అస్తిత్వంపై, ఫెడరల్ వ్యవస్థపై, మౌలిక రాజ్యాంగ సూత్రాలపై క్రూరమైన దాడిని మోదీ జనతాపార్టీ జమిలి ఎన్నికల రూపంలో ప్రారంభించింది. మోదీ జనతాపార్టీ అని ఎందుకు పిలవాల్సి వస్తుందంటే 2014 సంవత్సరం కంటే ముందు ఉన్న భారతీయ జనతా పార్టీ ఇలాంటి విధ్వంసకర విధానాలను అవలంబించి ఉండేది కాదు. ప్రజాస్వామ్యం పట్ల, నిష్పాక్షిక ఎన్నికల విధానం పట్ల విశ్వాసం లేని వారు మాత్రమే ఎన్నికలు ఖర్చుతో కూడిన పని అని అంటారు. ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే భారతదేశంలో విభిన్న జాతులను కలిపి ఉంచిందన్న విషయాన్ని విస్మరించి అధికార దాహంతో విభిన్నతను విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నం జమిలి ఎన్నికలు జరిపించడం.
‘ఒకే’ వాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదకరం
ఒక దేశం, ఒక జాతి, ఒక మతం, ఒక ఎన్నిక, ఒక భాష, ఒక ధర్మం, ఒక పార్టీ, ఒక లీడర్ అనే సిద్ధాంతం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది. ఈ సిద్ధాంతాన్ని అమలు పరచడానికి ప్రయత్నించిన జర్మనీ, ఇటలీ, జపాన్ వంటి దేశాలు ఘోరమైన తప్పిదాలు చేశాయి. ఆ దేశాలతోపాటు ప్రపంచ దేశాలు సైతం భారీ మూల్యం చెల్లించాయి. బీజేపీ ప్రవచించిన అధ్యక్ష విధానం అమలులో ఉన్న అమెరికాలో కూడా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడంలేదు. గవర్నర్ల ఎన్నికలు వివిధ రాష్ట్రాలలో వేరువేరుగా జరుగుతాయి.
వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నిక, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంవత్సరానికి జరిగితే, కొన్నిరాష్ట్రాలలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత జరుగుతాయి. ఒకే భాష మాట్లాడే దేశంలోనే అధ్యక్ష, గవర్నర్ల, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరగడంలేదు. ఆ విషయానికి వస్తే ప్రపంచంలో అధ్యక్ష విధానం లేదా పార్లమెంటరీ విధానం అమలులో ఉన్న ఏ దేశంలో కూడా ఒకేసారి ఎన్నికలు జరగడం లేదు.
అనుమానాలు రేపుతున్న మోదీ కారణాలు
అధికారాన్ని నిలుపుకోవాలనే కాంక్ష తప్ప ప్రధాని మోదీ చూపిస్తున్న కారణాలు అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి. బీజేపీ చేసే ప్రధానమైన ఆరోపణ అపరిమితమైన ఎన్నికల ఖర్చును భారతదేశం భరించలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఖర్చుతో కూడిన విషయమని భావించడమే సరియైనది కాదు.
ఎందుకంటే ప్రజాస్వామ్యం అమలు చేయని దేశాలలో జాతుల మధ్య వైరుధ్యాలు పెరిగి విచ్ఛిన్నమై పోయాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి ప్రధాన కారణం ప్రజల వాంఛను అమలు చేయడంలో వ్యవస్థ విఫలం కావడమే. సిక్కిం భారతదేశంలో విలీనం కావడానికి, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు చైనా దేశాన్ని చూసి భయపడడానికి ప్రధానమైన కారణం భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ.
ఇదీ ఖర్చుల కథాకమామిషు
2019 లోక్‌సభ ఎన్నికల కొరకు ప్రభుత్వం చేసిన వ్యయం 8,966 కోట్లు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం కొరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 3,000 కోట్ల రూపాయలు. 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఎన్నికకు అయిన ఖర్చు ఎక్కువేమీ కాదు. కార్పొరేట్ మిత్రులకు దోచిపెట్టిన డబ్బుతో పోల్చితే ఎన్నికల ఖర్చు లెక్కలోకి రాదు. కేవలం గత ఐదు సంవత్సరాలలో కొందరు వ్యాపారవేత్తలు తీసుకున్న 10.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
పార్టీలు ఎన్నికలపై ఎక్కువగా వ్యయం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరగడం వలన అనవసర వ్యయం తగ్గిపోనున్నదని సూచిస్తున్నది. ఎక్కువగా నిధులు వ్యయం చేస్తున్న పార్టీనే వ్యయాన్ని బూచిగా చూపిస్తున్నది.
సెంటర్ ఫర్ మీడియా స్టడీ ప్రకారం.. 2014లో బీజేపీ 12,750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కాంగ్రెస్ పార్టీ 9,300 కోట్లు వ్యయం చేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 27,500 కోట్లు వెచ్చిస్తే కాంగ్రెస్ 9,625 కోట్లు వెచ్చించింది. వివాదాస్పదమైన ఎలక్ట్రోరల్ బాండ్స్ అనే చట్టం తెచ్చి ప్రయోజనం పొందిన కంపెనీల నుండి నిధులు సమకూర్చుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు పరిచింది. తద్వారా 5,250 కోట్ల రూపాయల నిధులను బీజేపీ సమకూర్చుకుంది. మిగిలిన పార్టీలు అంత మొత్తాన్ని సమకూర్చుకోలేక పోయాయి. ఎక్కువ వ్యయం చేస్తూ ఎన్నికల ప్రక్రియను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చిన బీజేపీ వ్యయం తగ్గింపునకే ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వాదించడం విడ్డూరంగా ఉంది.
ఐదేళ్లు జవాబుదారీ ఎవరు?
ప్రధాని మోదీ చెప్పే మరో సాకు ఏమిటంటే నిరంతరంగా జరిగే ఎన్నికలు పరిపాలనకు అడ్డంకిగా మారి ప్రభుత్వ విధానాలను సరిగా అమలు చేయనివ్వడం లేదు. నిస్సందేహంగా ప్రభుత్వ నిర్ణయాలకు, విధానాలకు ఎన్నికలు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం ప్రజలకు నిరంతరం జవాబుదారీగా ఉండాల్సి వస్తున్నది. ప్రధాని మోదీకి అసహనం కలగడానికి ప్రధానమైన కారణం తన మిత్రులకు విరివిగా ప్రభుత్వ ఆస్తులను పంచి పెట్టడానికి అవకాశం పరిమితం కావడం, రుణాలు తీసుకొని దేశం దాటిపోతున్న ఆర్థిక ఉగ్రవాదుల చర్యలను ప్రజలు ప్రశ్నించడం ప్రధాని మోదీకి నచ్చడం లేదు. ఒకేసారి అన్ని వ్యవస్థలకు ఎన్నికలు జరిగితే ఐదు సంవత్సరాల వరకు ప్రజలకు సమాధానం చెప్పడానికి అవసరం ఉండదు. గ్యాస్ ధరను, పెట్రోల్ ధరను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
యూపీ ఎన్నికల వల్లే నల్ల చట్టాల రద్దు
అదానీ సంపద పెంచడానికి తెచ్చిన చట్టాలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. రైతు ఉద్యమంలో 700 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపించేసరికి తప్పని పరిస్థితులలో చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినట్లయితే ఇప్పటికీ రైతు వ్యతిరేక చట్టాలు అమలులో ఉండేవి.
కార్పొరేట్ మిత్రులకు ఐదు సంవత్సరాలపాటు నిరంతరాయంగా సేవ చేసుకునే భాగ్యానికి సహజంగానే రాష్ట్ర శాసనసభల ఎన్నికలు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ఖాతాదారుల పేర్లు ప్రజలకు తెలియాల్సిన అవసరంలేదని చట్టాలు తెచ్చారు. విదేశీ నల్లధనం విషయం దేవుడు ఎరుగు, ప్రస్తుత బ్యాంకు దోపిడీదారుల విషయాలు కూడా ప్రజల నుంచి దాచి పెట్టే నల్ల చట్టాలు అమలులోకి వస్తున్నాయి.
ఇంకా ఎన్నో నల్ల చట్టాలు అమలులోకి తేవాలని ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీకి ప్రస్తుత ఎన్నికల విధానం అడ్డంకిగా మారింది. ఐదు సంవత్సరాల వరకు ఏ విషయంలోనూ జవాబు చెప్పని విధానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. తొమ్మిది సంవత్సరాలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని ఏకైక ప్రధానిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంతగా ప్రజలను చూసి భయపడుతూ కార్పొరేట్ మిత్రుల కొరకు నిరంతరం శ్రమించే ప్రధాని భారత దేశ చరిత్రలో లేడు.
ఒక్కో ఎన్నికకు ఒక్కో ప్రాతిపదిక
మోదీ ప్రతిపాదిస్తున్నఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం విభిన్న జాతుల, సంస్కృతుల మేళవింపుతో ఏర్పడిన భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను, ప్రాంతాల హక్కులను హరిస్తే.. ప్రాంతీయ విద్వేషాలు ఏర్పడతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సమస్యలపై పార్టీ రహితంగా జరుగుతాయి.
అదే విధంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై జరుగుతాయి. అందుకు విరుద్ధంగా ద్వేష రాజకీయాలను స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రవేశపెట్టడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. భారత దేశ రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పడినది. కొంతవరకు మాత్రమే కేంద్రం రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకోగలదు. ప్రజలను ఐదు సంవత్సరాలకు ఒకసారి కేవలం ఓటు వేసే యంత్రాలుగా, ప్రేక్షకులుగా మార్చేందుకు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు వీలులేని పరిస్థితులను కల్పించేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.
ఎన్నికల్లో అమలు పరచలేని వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పలాయనం చిత్తగిస్తూ, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ, ఐదు సంవత్సరాల వరకు కాలం గడపడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. రైతుల బలిదానాలను పట్టించుకోని ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపు కొరకు వెనక్కు తగ్గి, చట్టాలను ఉపసంహరించుకొని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. మోదీ ఆత్మాభిమానం కంటే అదానీ వ్యాపార ప్రయోజనాలు ఎక్కువగా నష్టపోయాయి.
నమ్మకమైన వ్యక్తి ప్రధాని అయినప్పటికీ వ్యాపార ప్రయోజనాల కొరకు ప్రభుత్వం తీసుకునే విధానాలు అమలు పరచలేని నిస్సహాయ స్థితికి శాసనసభల ఎన్నికలు నెట్టివేశాయి. ఎంతటి ప్రజావ్యతిరేక విధానం తీసుకున్నప్పటికీ నిరభ్యంతరంగా అమలు పరిచే పరిస్థితులను సృష్టించడానికి ఒకే ఎన్నిక విధానం ప్రతిపాదించబడినది. ఇంకొక ప్రధానమైన కారణం.. త్వరలో జరగబోయే రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో మోదీకి వ్యతిరేక గాలి వీస్తున్నది.
సెమీ ఫైనల్‌గా భావించే ఈ ఎన్నికలలో మోదీ పార్టీ ఓడిపోతే లోక్‌సభ ఎన్నికలలో అధికార పార్టీ కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జమిలి ఎన్నికలు అనే నినాదంతో రాష్ట్రాల శాసనసభల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరిపించి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు.
ఈసారి నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే 2026లో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా లోక్‌సభలో సీట్లను పెంచి, కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాల ప్రజల మద్దతుతో శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదైతే ఖాయంగా కనిపిస్తున్నది.