భూదాన్ భూముల్లో యధేఛ్చగా లేఅవుట్- విక్రయాలు పూర్తి
ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్ భూములు పట్టించుకున్న నాధుడే లేడు. భూదాన్ బోర్డు ఆనాడు నామ మాత్రంగానే మిగిలింది. అంతే విలువైన భూదాన్ భూములు అక్రమ మార్కుల చేతుల్లో పడ్డాయి

- తాఫీగా మేలుకున్న ప్రభుత్వం
- భూదాన్ భూములని స్పష్టీకరణ
- బాబు కాలంలో మారిన చేతులు
- ఆదే ఏడాది ఇండికా గ్రూపు ఏర్పాటు
- లేఅవుట్ చేయడం, అమ్మడం
- అంతా ఆగమేఘాలపైనే..
విధాత: ఉమ్మడి రాష్ట్రంలో భూదాన్ భూములు పట్టించుకున్న నాధుడే లేడు. భూదాన్ బోర్డు ఆనాడు నామ మాత్రంగానే మిగిలింది. అంతే విలువైన భూదాన్ భూములు అక్రమ మార్కుల చేతుల్లో పడ్డాయి. అప్పనంగా అలాంటి వారికి లాభాలు గడించి పెట్టాయి. కోట్లలో లాభాలు దండుకున్నారు. ఆతరువాత అక్కడి నుంచి గయాబ్ అయ్యారు. కానీ మధ్య పేద తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ త్వరలో రానున్నదన్న ప్రచారంతో రియల్ బాబులంతా అక్కడ అడ్డగోలుగా వెంచర్లు చేసి విక్రయించారు. ఆనాడు రెవెన్యూ రికార్డులు సరిగ్గా నిర్వహించక పోవడంతో ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు ఇతర భూములను కూడా చెరబట్టి లే అవుట్లు చేసి అడ్డగోలుగా విక్రయించారు.
ఇలా ఒక బడా రియఎల్ ఎస్టేట్ కంపెనీ10 ఎకరాల భూదాన్ భూమిని చెరబట్టి తన వెంచర్‌లో కలుపుకొని విక్రయించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ వెంచర్ పూర్తి చేసిన 25 సంత్సరాలకు ఇది భూదాన్ భూమి అని బయటపడింది. అధికారులు ఇది భూదాన్ భూమి అని 22(ఏ)లో పెట్టారు. క్రయవిక్రయాలు నిషేధించారు. దీంతో తాము కొనుక్కున్న ప్లాట్లు అవసరాలకు అమ్ముకుందామంటే ఇది భూదాన్ భూమి అని అధికారులు చెప్పడంతో విస్తు పోవడం కొనుగోలుదారు వంతైంది. ఈ భూమి వివరాలను పరిశీలిస్తే…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 305, 320లో 31 ఎకరాల16 గుంటల భూమి రాంజీ లంబాడి, గజియా నాయక్‌లకు ఉన్నది. ఇద్దరు గిరిజన పెద్దలు ఆనాడు వినోబావే భూదానోద్యమానికి స్పంధించి తమకు ఉన్న భూమిలో నుంచి చెరో 5 ఎకరాలు కలిపి 10 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ 10 ఎకరాల భూమి భూదాన్ ట్రస్ట్‌కు వెళ్లింది. అయితే అప్పటి నుంచి ఈ భూమి ఆలనా పాలనా పట్టించుకున్న వారే కరువయ్యారు. వేల ఎకరాల భూదాన్ భూములన్నీ ఏవిధంగా ఆక్రమణకు గురయ్యాయే అదే తీరుగా ఈ 10 ఎకరాల భూమి కూడా అన్యాక్రాంతానికి గురైంది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 25 ఏళ్ల క్రితం 1999లో శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలో వెంకటస్వామి వీరారెడ్డి, తల మంచి సుబ్బారెడ్డి, భరతుల ప్రసాద్‌లు ఇండికా సిటీ పేరుతో భారీ వెంచర్ చేసి విక్రయాలు పూర్తి చేశారు. విచిత్రం ఏమిటంటే ఇండికా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీనీ ఏర్పాటు చేశారు. కంపెనీ ఏర్పాటు చేసిన సంవత్సరమే అక్కడ వెంచర్ చేయడం గమనార్హం.
వెంచర్ చేసిన ఇండికా కంపెనీ మంచి లాభాలు గడించింది. పని పూర్తి చేసుకొని వెళ్లారు. తిరిగి 25 సంవత్సరాల తరువాత ఈ 10 ఎకరాల భూమి భూదాన్ భూమి అని తేల్చింది. విచిత్రం ఏమిటంటే కంపెనీ ఏర్పాటు చేసిన ఏడాదే వెంచర్ చేసి విక్రయించారు. అంతా ఆగమేఘాలపైన జరిగిందని, దీంతో ఆనాటి ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇదంతా జరిగిందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తాజాగా 25 ఏళ్ల కిత్రం ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు తమ అవసరాల కోసం అమ్ముకుందామంటే ఈ భూమి నిషేదిత జాబితాలో ఉందని అధికారులు చెప్పడంతో ఖంగుతినడం కొనుగోలుదారుల వంతైంది. ఎందుకు మా భూమిని నిషేదిత జాబితాలో పెట్టారని అడిగితే ఇది భూదాన్ భూమి అని సమాధానం ఇస్తున్నారు. ఈ మేరకు ధరణి వెబ్ సైట్‌లో కూడా ఈ భూమిని భూదాన్ భూమిగా పొందుపరిచారు.

అయితే ఆనాడు యద్దేచ్చగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అధికారులు ఎందుకు నిరోధించలేక పోయారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదాన్ భూములల్లో అక్రమంగావెంచర్లు వేసి విక్రయించడంతో కొనుగోలు దారులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆనాడే అధికారులు ఈ భూమి భూదాన్ భూమి అని స్పష్టం చేస్తే తాము కొనుగోలు చేసే వాళ్లం కాదు కదా అని అంటున్నారు.