అనధికార లేఅవుట్లన్నీ.. ఆక్రమిత భూముల్లోనే
అనధికార లేఅవుట్లన్నీ ఆక్రమిత ప్రభుత్వ భూములు, చెరువులు,అసైన్డ్ భూముల్లోనే ఉన్నాయని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు

- మీ నాయకులకు దోచుకోమని అనుమతిచ్చారా
- క్రమబద్దీకరణ జీవోలు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినవే
- జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి
విధాత: అనధికార లేఅవుట్లన్నీ ఆక్రమిత ప్రభుత్వ భూములు, చెరువులు,అసైన్డ్ భూముల్లోనే ఉన్నాయని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు. వీటి క్రమబద్దీకరణ కోసం గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే రెండు జీవోలు ఇచ్చి, ధర కూడా నిర్ణయించారన్నారు. బుధవారం గాంధీభవన్‌లో . కాంగ్రెస్ సీనియర్ నాయకులు. అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ లే అవుట్లు జరుగుతుంటే మీరు నిద్ర పోయారా.. లేకుంటే మీ నాయకులకు దోచుకోండి అని అనుమతి ఇచ్చారా..? ఎందుకు కంట్రోల్ చేయలేదని నిలదీశారు. కొన్న వాళ్ళ పై మాకు సింపతి ఉందన్నారు. అమాయక ప్రజల నుండి డబ్బులు లాక్కునే పని చేసింది కేటీఆర్ అని అన్నారు.
ఇప్పుడేమో ఉచితంగా రెగ్యులర్ చేయండి అని నీతి మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు హౌసింగ్‌బోర్డ్ ద్వారా ఇండ్లు ఇచ్చిందన్నారు. కోకపేట లో ప్రభుత్వ భూమి పేదలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కానీ కేసీఆర్ పేదల భూములు లాక్కుని పెద్ద బిల్డర్ లకు ఇచ్చారన్నారు. అధికారం పోగానే నీతి మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. చాలా చోట్ల షిఖం భూములు కూడా కబ్జా చేశారన్నారు. ఇప్పడేమో తగదునమ్మా అని బీఆరెస్ వాళ్లు ధర్నాలు చేస్తున్నారన్నారు. హెచ్ ఎండీఏ చేసిన లే అవుట్లపైనా విచారణ జరపాలన్నారు. అమాయక ప్రజల దగ్గర డబ్బులు లాక్కున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోదండరెడ్డి కోరారు.
ఔటర్ రింగ్ రోడ్డును ప్రయివేటు కంపెనీకి అప్పగించావని కేటీఆర్‌ను ఉద్దేశించి కోదండరెడ్డి అన్నారు. నీ జీవితం అంతా నిర్వాకమే చేశావన్నారు. 111 జీవో పరిధిలోని భూములను కూడా ఆక్రమించాడని ఆరోపించారు. ఎఫ్‌టీఎల్ లో కూడా మీ భుములున్నాయని, వాటన్నింటిపై విచారణ జరపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆరెస్ నాయకులు అధికారం పోయిన తెల్లారి నుండే రోడ్డు ఎక్కడం ఇక్కడే చూశా నన్నారు. పుక్కిడికీ మంత్రులై, బరితెగించి సంపాదన చేసిన మిపై చర్యలు తీసుకోవాలని బీఆరెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారినుద్దేశించి కోదండరెడ్డి అన్నారు.