KTR : కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

శాసనసభలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ సంస్కారం, పాలన వైఫల్యాలపై కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

KTR : కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

విధాత, హైదరాబాద్ : శాసన సభలో మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సభలో కలిసేంత సంస్కారం ఉంటే చాలు అని..ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుటుందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదేననన్నారు. మీసాలు, గడ్డాలు లేవన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గడ్డం మీసాలు లేవని నన్ను కాదు రాహుల్ ను, రాజీవ్ ను రేవంత్ రెడ్డి అన్నారని..గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ కాలేరని. గడ్డాలు పెంచడం చాల ఈజీ..పాలన చేయడమే కష్టం అని చురకలేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నేను అంద్రాలో చదివితే తప్పు బట్టారని.. కానీ ఆయన మాత్రం అల్లుడిని ఆంధ్ర నుంచి తెచ్చుకోవచ్చా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆపినందుకే బూతులు మాట్లాడుతున్నాడని..నన్ను అంటే రెస్పాండ్ కాను.. కానీ మా నాన్నను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బూతులకు నేను రెస్పాండ్ అవుతుంటే.. అతనిలా దిగజారవద్దని చెబుతున్నారని పేర్కొన్నారు. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌కే అల్లాడిపోతున్నారని.. అలాంటిది కేసీఆర్‌ను అసెంబ్లీకి రమ్మని డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నీళ్ల సబ్జెక్టు చదివితే రాదని.. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వస్తుందని చెప్పారు.

కాలంతో పోటీపడి మరీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అక్రమాలంటూ రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టమని అన్నారు. రాజకీయంగా తమకేమీ నష్టం రాదన్నారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నష్టం చేసినట్లే అని స్పష్టం చేశారు. 299 టీఎంసీలకు ఒప్పుకుంంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దానిపైనే తమ ప్రభుత్వం మరిన్ని కేటాయింపులు అడిగిందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పడకేయించారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు కడితే కేసీఆర్‌కు పేరు వస్తుంది.. అప్పుడు ఆయన బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని అన్నారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే బాబుకు కోపం వస్తుందని అన్నారు. అందుకే ప్రాజెక్టును పండబెట్టి..కాల్వలు కూడా తవ్వడం లేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గొప్ప ఫలితాలు వచ్చాయని తెలిపారు.

కృష్ణానది ఏ బేసిన్, ఎక్కడ ఉన్నదని ముఖ్యమంత్రి అడిగాడని కేటీఆర్ తెలిపారు. భాక్రనంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో కూడా ఈ ముఖ్యమంత్రికి తెల్వదని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నాడని మండిపడ్డారు. వీళ్లు ఇప్పుడు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారని అన్నారు. నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వ్యక్తులు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని తెలిపారు. కేసీఆర్ వస్తున్నాడని ఇప్పుడు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని విమర్శించారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీ చర్చ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎవరు ఏ ప్రాజెక్టులు కట్టినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాతనే అన్ని అనుమతులు తీసుకురావడం ఆనవాయితీ అని, కానీ ఈ విషయాన్ని ఎవరూ చెప్పరని వివరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్లుగా వింటున్నాం.. కానీ ఇంకా అది పూర్తి కాలేదని అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యిందని తెలిపారు. దీనికి కేసీఆర్ నిబద్ధతనే కారణమని స్పష్టం చేశారు. నీళ్లు ఎవరు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసన్నారు.

మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు సభలో స్పష్టంగా చెప్పాడని కేటీఆర్ అన్నారు. బూతులు మాట్లాడాలంటే ఎన్నిరోజులైనా చర్చ పెడతారని.. సబ్జెక్ట్ లేనప్పుడు సభను ఎక్కువ రోజులు నడపలేరని తెలిపారు. చెక్‌డ్యాం పేల్చివేతలో రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉన్నదని అన్నారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఇంజినీర్లు ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. రష్యా ఉద్యమంలో కాకువ డ్యామ్‌ను పేల్చేశారని.. అలాగే తెలంగాణలో మేడిగడ్డను పేల్చారని గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లుప్తంగా వివరించి చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం సభ సమయం పాటించడం లేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా సభలో ఇవాళ మొదటి రోజే జీరో అవర్ పెట్టారని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని..ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ నిఘా వ్యవస్థ లేదా.. ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ‘తాను ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని రేవంత్ రెడ్డికి చెప్పే దమ్ముందా?’ ..ఆనాడు ట్యాపింగ్ నిజమైతే అధికారులు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టడం లేదని అడిగారు. ఇప్పుడు డీజీపీ కూడా అప్పడు అధికారిగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి అన్ని తెలుసని చెప్పారు. నిఘా వ్యవస్థ ఏవిధంగా పనిచేస్తుందో ముఖ్యమంత్రికి అధికారులు చెప్పరని… వారికి ఉన్న నిబంధనల మేరకు, వారికి సమాచారం ఏవిధంగా వస్తుందో ముఖ్యమంత్రి అడగరని చెప్పారు. ఈ సిట్ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎన్నిరోజులు మరలుస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎన్నిరోజులు కాలం వెల్లదీస్తారని నిలదీశారు. ఇన్నిరోజులు సిట్, విచారణ, కేసుల పేరుతో సాధించిందేంటని ప్రశ్నించారు. కనీసం ఒక్క కేసులోనైనా అభియోగాలు రుజువై నిజం తెలిసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాజకీయ కోణంలో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడని.. దాన్ని కూడా తొందరలో ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చని ఎద్దేవా చేశారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని.. కానీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ఎవరూ ఊరుకోబోరన్నారు. ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చలో అన్ని విషయాలపైనా తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో.. ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్లిష్టమని అన్నారు. కానీ తమకు మాత్రం 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నిక చారిత్రాత్మక ఎన్నిక అని తెలిపారు. అలాంటి ఎన్నికలు ఇప్పటివరకు చూడలేదని.. మళ్లీ చూడబోమని చెప్పారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచిందని..జీహెచ్ఎంసీలో మేం గెలిచిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :

Srikanth | టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌కు ఈ స్టార్ నటి బంధువు అని మీకు తెలుసా?.. ఏం వ‌రుస అవుతుందంటే..!
Padi Kaushik Reddy : తొలి రోజునే రభసా..ముందంతా రచ్చరచ్చనే