Bill Gates | యువతకు బిల్‌గేట్స్ ఐదు సలహాలు.. అవేంటంటే
విధాత: అరే.. ఈ విషయం మన 20 ల్లోనే తెలిసుంటేనా…. నా జీవితం ఇంకా బాగుంటుందేమో అని అందరూ అనుకుంటూనే ఉంటాం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) సైతం అలా కొన్ని సార్లు అనుకుంటారట. ఆయనలా యువత భవిష్యత్తులో బాధపడకుండా గేట్స్ ఐదు ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసా? కెరీర్ నిర్ణయాలు శాశ్వతం కాదు పాఠశాలలో చదువుతున్నపుడు పలానాది చదువుకుందాం అనుకుంటాం. ఆ తర్వాత అది చదవడం సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ చదివినా […]

విధాత: అరే.. ఈ విషయం మన 20 ల్లోనే తెలిసుంటేనా…. నా జీవితం ఇంకా బాగుంటుందేమో అని అందరూ అనుకుంటూనే ఉంటాం. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) సైతం అలా కొన్ని సార్లు అనుకుంటారట. ఆయనలా యువత భవిష్యత్తులో బాధపడకుండా గేట్స్ ఐదు ముఖ్యమైన సలహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసా?
కెరీర్ నిర్ణయాలు శాశ్వతం కాదు
పాఠశాలలో చదువుతున్నపుడు పలానాది చదువుకుందాం అనుకుంటాం. ఆ తర్వాత అది చదవడం సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ చదివినా దానికి సంబంధించిన ఉద్యోగం రాకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనం చిన్నప్పటి నుంచి ఊహించుకున్న ఉద్యోగం అని దాని మీదే ఉండిపోకుండా మనకు సరిపోయే మరో కెరీర్ ఆప్షన్‌ను చూసుకోమంటున్నారు గేట్స్. మన గోల్స్‌ను ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవడం మంచిదేనని, కొన్ని సార్లు అది తప్పనిసరి అని ఆయన ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు సలహా ఇస్తున్నారు.
కొత్త విషయాలను నేర్చుకోండి
గేట్స్ చెప్పే మరో ముఖ్యవిషయం… మనకు తెలిసింది చాలనుకుని ఉండిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక మనం ఏదైతే చదివామో.. అందులోకి కాకుండా మనకు పూర్తిగా పరిచయం లేని పని చేయడమే కొత్త విషయాలు నేర్చుకోవడానికి సులువైన మార్గమని గేట్స్ సలహా. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ జంకొద్దని, తెలివైన వాళ్లతో స్నేహం చేస్తే వారే మనల్ని కొత్త నైపుణ్యాల వైపునకు తీసుకెళిపోతారని తెలిపారు.
My message to the class of 2023. https://t.co/Zduz6ldbN5
— Bill Gates (@BillGates) May 15, 2023
పరులకు సాయం చేయండి
ఎప్పుడూ ఏదో దాతృత్వ కార్యక్రమం చేస్తూ వార్తల్లోకెక్కే గేట్స్ మనల్నీ దాతృత్వ గుణాన్ని అలవర్చుకోమంటున్నారు. మనం చదువుకున్న చదువు, ఉద్యోగం సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ఆ కోణంలో ఆలోచించాలని ఆయన తరచూ విద్యార్థులకు చెబుతూ ఉంటారు. ఎవరూ పరిష్కరించలేని ఒక సమస్యను తీసుకుని దాని పట్టు పట్టాలని గేట్స్ సూచించారు. అది ప్రపంచానికి ఒక సాయంగా మారగలదని చెప్పారు.
పరిచయాలే కాపాడతాయి
మనతో కలిసి పదో తరగతి చదివిన వారంతా మనకు గుర్తున్నారా? వారిలో సగం మందితో అయినా మనకు ఇప్పుడు మాటలున్నాయా? గేట్స్ ఇదే అడుగుతున్నారు. మనం తెలివైన వారి కోసం ఎక్కడెక్కడో చూస్తాం. ఎవరెవరితోనో మాట్లాడతాం. కానీ మనతో కలిసి చదువుకున్నవాళ్లని మర్చిపోతాం. వారిలో మనకి ఉపయోగపడేవారుండొచ్చు. వాళ్ల స్కిల్స్ మన వ్యాపారానికి అవసరమయ్యేవి కావొచ్చు. కాబట్టి మనం ఎవరెవరితో అయితే చదువుకుని, పని చేస్తూ వస్తున్నామో.. వారందరితోనూ మనం ఎప్పుడూ టచ్‌లో ఉండాలి. ఇదే గేట్స్ ఫార్ములా..
పనే జీవితం కాదు
వ్యాపారాలు మొదలుపెట్టిన రోజుల్లో సమయం చూసుకోకుండా పని చేశానని గేట్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. తనే కాకుండా తన దగ్గర ఉన్న ఉద్యోగుల్ని కూడా అలానే పనిచేయించేవారు. అయితే ఒక సమయం వచ్చాక తనకు పని కన్నా జీవితం గొప్పదని అర్థమయిందంటారు గేట్స్. ‘మీ బంధాలను కాపాడుకోవడానికి, ఆనందంగా ఉంచుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించుకోండి. మీ విజయాలను పండగ చేసుకోండి. అంతే కాదు ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపిస్తే ఏ మాత్రం మొహమాటం లేకుండా
కాస్త బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే పనే జీవితం కాదు’ ఇదీ బిల్‌గేట్స్ చెప్పే మాట.
ఎదుటివారి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే తెలివైన వాడి లక్షణo. ఇది ఆయన చెప్పే ఆఖరి సలహా.