తెలంగాణలో చావు బతుకుల స్కామ్!
‘చావు బతుకుల కుంభకోణం’.. ఇలాంటిది కూడా ఒకటి ఉన్నదా? కాళేశ్వరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో స్కాం.. విద్యత్తు ప్లాంట్ల స్కాం.. మిషన్ భగీరథ స్కాం.. ధరణి స్కాం.. జీహెచ్‌ఎంసీ భూముల స్కాం

- వాటి ఆధారంగా లాండ్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు
- తప్పుడు ఆధార్, ఓటర్ ఐడీల సృష్టి
- వెలుగు చూస్తున్న వరుస అవకతవకలు
విధాత, హైదరాబాద్ : ‘చావు బతుకుల కుంభకోణం’.. ఇలాంటిది కూడా ఒకటి ఉన్నదా? కాళేశ్వరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో స్కాం.. విద్యత్తు ప్లాంట్ల స్కాం.. మిషన్ భగీరథ స్కాం.. ధరణి స్కాం.. జీహెచ్‌ఎంసీ భూముల స్కాం.. ఇవి చాలవన్నట్లుగా గొర్రెలు, ఆవులు, గేదెల స్కీమ్‌లలో స్కామ్, గిరిజన పిల్లలకు పాల పంపిణీలో స్కామ్ ఇలా.. అనేక కుంభకోణాలు తెలంగాణలో వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొత్త స్కాం ఒకటి బయటపడింది. అదే చావు బతుకుల స్కాం.. అర్థం కాలేదా? అదేనండి.. జీహెచ్‌ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ స్కాం. నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను ఫలక్‌నుమా సర్కిల్ అధికారులు జారీ చేసిన వైనం నివ్వెర పరుస్తున్నది. నాన్ అవైలబులిటీ సమాచారం రికార్డులలో లేకపోవడం విస్మయ పరుస్తున్నది. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే సర్కిల్ నుంచి 80 సర్టిఫికెట్స్ జారీ అయినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిల్స్‌లోనూ ఈ తరహా దందా జోరుగా సాగినట్లుగా గుర్తించారు. 1998లో జన్మించిన వ్యక్తికి నవంబర్‌లో నాన్ అవైలబులిటీ కింద సర్టిఫికెట్ జారీ అయ్యింది. ఈ సర్టిఫికెట్లను ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, లాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఘరానా మోసగాళ్లు వాడుతున్నట్లు బయటపడింది. గత ఏడాది గత కమిషనర్ హయాంలో దాదాపు 36 వేల ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ రద్దు అయ్యాయి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో మళ్లీ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఉన్నతాధికారుల అండదండలతోనే దందా నడుస్తున్నట్లు సమాచారం. ఒక్కో సర్కిల్ నుండి రూ.3 లక్షలు, ఆదాయం ఎక్కువ ఉన్న సర్కిల్‌లో ఐదు లక్షల వరకు సర్టిఫికెట్ల జారీతో వసూలు చేస్తున్నుట్లుగా తెలుస్తున్నది. మొన్ననే నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో 84 లక్షల రూపాయలను కాజేసిన కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
ప్రధానంగా నాన్ అవైలబులిటీలోనే..
జీహెచ్‌ఎంసీలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో 2022 నుంచి ‘ఇన్‌స్టంట్ అప్రూవల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో జరిగే జనన, మరణాల ధ్రువపత్రాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ పత్రాలు జారీ చేస్తుంది. వివరాలను నమోదు చేసి, సరైన పత్రాలను అప్‌లోడ్ చేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. ఆసుపత్రుల్లో కాకుండా ఇంటి వద్ద జరిగే జనన, మరణాల వివరాలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండవు. అందుకే వీటిని నాన్ అవైలబిలిటీగా పేర్కొంటారు. ప్రధానంగా నాన్ అవైలబిలిటీ ఆధారంగా జారీచేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లోనే భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు గతంలో అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ జనన మరణ విభాగం, మీసేవా కేంద్రాల నిర్వాహకుల నిర్వాకంతోనే నకిలీ సర్టిఫికెట్ల దందా జరిగినట్లుగా అప్పట్లో విజిలెన్స్ గుర్తించింది.