‘ఆపరేషన్‌ సౌత్‌ స్టేట్స్‌’.. ఇవీ బీజేపీ వ్యూహాలు!

సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర కిందటే బీజేపీ సన్నద్ధమైంది

‘ఆపరేషన్‌ సౌత్‌ స్టేట్స్‌’.. ఇవీ బీజేపీ వ్యూహాలు!
  • దక్షిణాదిలో పెద్దగా ప్రభావంలేని బీజేపీ
  • ఉత్తరాదిలో సమీకరణాలు మారే చాన్స్‌
  • 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడినా బలంగానే ఓటు బ్యాంక్‌
  • రాహుల్‌ జోడో యాత్ర, తాజాగా భారత్‌ న్యాయ్‌ యాత్ర ప్రభావం చూపే అవకాశం
  • అక్కడ లోటు భర్తీ చేయడానికి దక్షిణాదే దిక్కు
  • కర్ణాటకలో ఫలించని బజరంగ్‌ బలి నినాదం
  • రాముడి గుడి దక్షిణాదిన ఓట్లు రాల్చేనా?



(విధాత ప్రత్యేకం)


సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర కిందటే బీజేపీ సన్నద్ధమైంది. మూడో దఫా కూడా ప్రజలు కళ్లు మూసుకుని గెలిపించేస్తారనే ధీమా కొరవడటంతో.. ముఖ్యంగా ఈసారి ఆ పార్టీ ఎన్నడూ గెలువని 144 స్థానాలపై దృష్టి సారించినట్టు గత ఏడాది సెప్టెంబర్‌ నెలలోనే వార్తలు వచ్చాయి. ఆ దిశగా ఆ పార్టీ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నడూ గెలువని స్థానాల్లో ఎక్కువ శాతం సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనివే. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ రాష్ట్రాల్లో 132 సీట్లున్నాయి.


కర్ణాటకలో ఎక్కువ, తెలంగాణలో కొంతవరకు మినహా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి, లక్షద్వీప్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఒక్కో స్థానాన్ని కూడా వదిలిపెట్టకూడదనేది ఆ పార్టీ అగ్రనేతల ఆలోచన. ఈ రాష్ట్రాల్లో 1989లో తమ పార్టీ జీరో సీట్ల నుంచి 29 సీట్లకు చేరిందని, బీజేపీకి ప్రజలు దగ్గరవుతున్నారనేందుకు ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.


అక్కడ లోటును ఇక్కడ భర్తీ చేసే యోచన


దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలనే ఆ పార్టీ హైకమాండ్‌ వ్యూహం వెనుక అనేక కారణాలున్నాయి. బీజేపీ కేంద్రంలో సింగిల్‌గా మెజారిటీ సాధించడానికి కారణం ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ (80\62), గుజరాత్‌ (26\26), మధ్యప్రదేశ్‌ (29\28), రాజస్థాన్‌ (25\24), బీహార్‌ (40\17), పశ్చిమబెంగాల్‌ (42\18) వంటి పెద్ద రాష్ట్రాల్లోనే కాదు హిమాచల్‌ ప్రదేశ్‌ (4\4), హర్యానా (10\10), ఉత్తరాఖండ్‌ (5\5), ఛత్తీస్‌గఢ్‌ (9\11), జార్ఖండ్‌ (11\14) వంటి చిన్నరాష్ట్రాల్లోనూ, ఈశాన్య రాష్ట్రాలు అస్సాం ( 9\14) త్రిపుర (2\2 ), జమ్ముకశ్మీర్‌లో (3\6) గణనీయంగా సీట్లు దక్కించుకున్నది.


ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా పోరాటం చేసింది. అవి రద్దు చేసే వరకు గట్టిగా నిలబడి విజయం సాధించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రామమందిర నిర్మాణం పేరుతో ఆ పార్టీ చేసిన రథయాత్ర ఫలితంగా రాజకీయంగా బాగా బలపడింది. రామ మందిర నిర్మాణం పూర్తిచేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పి, దాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయనున్నది. దానిద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి కమలనాథులు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు.


జనవరి 22 తర్వాత రామ మందిర ప్రారంభం తర్వాత రాష్ట్రాల వారీగా కోట్ల మంది రామల్‌ లల్లాను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మందిర్‌ దర్శన్‌ అభియాన్‌ను ఎలా కొనసాగించాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అయితే దీనిద్వారా ఎంత లబ్ధి జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కర్ణాటకలో జై బజరంగ బలి అని నినదించి ప్రచారం చేసినా ప్రజలు ఆ పార్టీని ఘోరంగా ఓడించారు. అందుకే ఉత్తరాదిన నష్టపోయే సీట్లను దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా భర్తీ చేయడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది.


గెలుపు సులభమేమీ కాదు


గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించినా ఈసారి ఇండియా కూటమి, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌ శ్రేణుల్లో వచ్చిన జోష్‌తో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఓడినా ఎక్కువ సీట్లే వచ్చాయి. ఓటింగ్‌ శాతంలో తేడా కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తక్కువగానే ఉన్నది. అలాగే ఈ నెల 14 నుంచి మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి ప్రారంభం కానున్న రాహుల్‌ ‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 66 రోజుల పాటు 6,713 కిలోమీటర్లు సాగే ఈయాత్ర 110 జిల్లాల్లో 100 లోక్‌సభ, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేయనున్నది.


ముఖ్యంగా ఈ యాత్ర అత్యధికంగా 11 రోజుల పాటు యూపీలో జరగనున్నది. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో ముఖాముఖి తలపడే స్థానాలతో పాటు ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల కూడా ఈ యాత్ర సాగుతుంది. ఈ పరిణామాలు కాషాయ పార్టీని కలవరపెడుతున్నాయని సీనియర్‌ జర్నలిస్టు ఒకరు అన్నారు. పదేళ్ల తమ పాలన విధానాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పడిపోతున్న మద్దతు ధరలు వంటివి ఆ పార్టీ ఓట్లకు గండికొట్టడం ఖాయమని చెప్పారు. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మెజార్టీ కోసం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా.. దక్షిణాదిలోనూ సీట్ల సంఖ్య పెంచుకోవడం అత్యంత ముఖ్యమని బీజేపీ నేతలకు ఏడాదిన్నర క్రితమే అర్థమైపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే అప్పటి నుంచే ఈ రాష్ట్రాలపై దృష్టి సారించిందని అంటున్నారు.


మత అజెండా ఓట్లు రాల్చేనా!


గత ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 23, కర్ణాటకలో 25కు 25 సీట్లలోనూ బీజేపీ విజయం సాధించింది. 21 సీట్లున్న ఒడిశాలో 8, 17 సీట్లున్న తెలంగాణలో 4 గెలుచుకున్నది. ఈసారి వీటిని నిలబెట్టుకోవడంతో పాటు ఇంకా ఎక్కువ సంఖ్యలో సీట్లు దక్కించుకోకపోతే కేంద్రంలో అధికారం కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ, కర్ణాటకలో కాంగ్రెస్‌, తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఒడిశాలో బీజూ జనతాదళ్‌ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో, ప్రతిపక్షాలు అధికారంలో లేదా బలంగా ఉన్న చోట్ల బీజేపీ అధిష్ఠానం వ్యూహాలు ఫలిస్తాయా? రామమందిర నినాదం, ఆర్టికల్‌ 370 రద్దు వంటివి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెడుతాయా? అన్నది చూడాల్సి ఉన్నది.