ఎన్ని­కల తెరపై బీజేపీ సినిమా!

రజా­కార్‌! ఆర్టి­కల్‌ 370! బస్తర్‌: ది నక్స­లైట్‌ స్టోరీ! సావ­ర్కర్‌! ఇటీ­వల వెండి­తె­రపై వాలిన కొన్ని చిత్రాలు! అంతకు ముందు మోదీపై సినిమా తీసినా

ఎన్ని­కల తెరపై బీజేపీ సినిమా!
  • దేశ ప్రజల్లో ఆరె­స్సెస్‌ భావ­జాల వ్యాప్తి
  • ముస్లిం వ్యతి­రే­కత రెచ్చ­గొట్టే యత్నం
  • వామపక్ష, ప్రగతిశీల శక్తులే టార్గెట్‌
  • ఆఖ­రికి మహాత్మాగాంధీనీ వద­ల్లేదు
  • ప్రభుత్వ అను­కూ­లంగా తయారీ
  • లోక్‌సభ ఎన్నికల్లో జనం ఓట్లపై ఆశ
  • సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ..
  • బీజేపీకోసమే సినిమాలన్న క్రిటిక్స్‌
  • కొట్టిపారేస్తున్న వాటి దర్శక నిర్మాతలు
  • చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా

రజా­కార్‌! ఆర్టి­కల్‌ 370! బస్తర్‌: ది నక్స­లైట్‌ స్టోరీ! సావ­ర్కర్‌! ఇటీ­వల వెండి­తె­రపై వాలిన కొన్ని చిత్రాలు! అంతకు ముందు మోదీపై సినిమా తీసినా, వాజపేయి జీవిత చరిత్రను తెరకెక్కించినా, కశ్మీర్‌ ఫైల్స్‌.. కేరళ స్టోరీ.. మరికొన్ని రాబోయే సినిమాలు జేఎన్‌యూ వంటివాటి ఉద్దేశం ఒక్కటే! లోతుగా అవ­సరం లేదు.. స్థూలంగా గమ­నిస్తే చాలు.. ఇవన్నీ ఆరె­స్సెస్‌ భావ­జా­లాన్ని జనం మెద­ళ్లలో బల­వం­తంగా జొప్పిం­చేం­దుకు, మైనా­ర్టీ­లపై వ్యతి­రే­క­తను పెంచేం­దుకు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, ఒక వర్గం ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించేందుకు, చెప్పినవే వాస్తవాలని జనాన్ని నమ్మించేందుకు, అంతిమంగా రాబోయే లోక్‌­సభ ఎన్ని­కల్లో బీజే­పీకి ఓట్లు వేయించుకునేందుకు ఉద్దేశించినవని స్పష్టంగానే అర్థమైపోతున్నది.

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ పుంఖానుపుంఖాలుగా ప్రభుత్వ అనుకూల, బీజేపీ, ఆరెస్సెస్‌ భావజాల చిత్రాలు వెండి తెరకెక్కేందుకు క్యూ కడుతున్నాయి. జనాభిప్రాయాన్ని ఏదో విధంగా మల్చి.. నాలుగు ఓట్లు దండుకున్నా చాలన్న పద్ధతిలో ఈ సినిమాల తీరు కనిపిస్తున్నది. విచిత్రం ఏమిటేంటే.. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టిస్తున్నా.. క్షేత్రస్థాయిలో.. సినిమా విడుదల సమయంలో మాత్రం చాలా సినిమాలు బోల్తా కొడుతున్నాయి. కొన్ని బలవంతంగా నెట్టుకొస్తున్నాయి.

బీజేపీకి ఉడతాభక్తి సాయం!

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని బీజేపీ చెబుతున్నా.. వాస్తవానికి ఆ పార్టీలోనే అనేక అనుమానాలు ఉన్నాయని జరుగుతున్న విభిన్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతున్నది. దేశాన్ని కొత్త పుంతలు తొక్కించానని మోదీ చెబుతున్నారు. అదే నిజమనుకుంటే మోదీకి ఇతరత్రా మార్గాలు అవసరం లేదు. కానీ.. ప్రతి సీటులో గెలుపూ ముఖ్యమైనదిగానే బీజేపీ భావిస్తుండటం గమనార్హం. అందుకే ఎవరితో వీలుంటే వారితో పొత్తులకు సిద్ధమవుతున్నది. పాత దోస్తులను దగ్గరికి తీస్తున్నది. ఇండియా కూటమి నేతలను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెడుతున్నది. కాంగ్రెస్‌ ఖాతాలనే స్తంభింపజేసి, కేజ్రీవాల్‌ వంటివారిని అరెస్టు చేసి, ఏకపక్ష ఎన్నికల పోరాటం కోరుకుంటున్నది. పనిలోపనిగా మత అజెండాను సైతం ముందుకు తెస్తున్నది. రామాలయాన్ని హడావుడిగా పూర్తిచేయించింది. వీటన్నింటి ద్వారా ఏ ఒక్క ఓటూ పోకుండా చూసుకోవడం బీజేపీ లక్ష్యంగా పెట్టుకోవడం ఆ పార్టీ అభద్రతాభావాన్ని వెల్లడిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే సావర్కర్‌ వంటివారిని హీరోలుగా చిత్రీకరించడం, తెలంగాణ సాయుధ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా సాగిందనే అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నించడం, వామపక్షవాదులను ‘కుహనా వామపక్షవాదులు’ అనే ముద్ర వేసే ప్రయత్నాలతో పలు సినిమాలు రావడం యాదృచ్ఛికమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.

సావర్కర్‌ను కీర్తించేలా..

తాజాగా విడుదలైన చిత్రం సావర్కర్‌. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఆయనను కీర్తించలేదని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. బ్రిటిషర్లపై సాయుధ పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని పేర్కొంటున్నారు. సావర్కర్‌ పోరాటం చరిత్ర నుంచి తుడిచివేశారని, ఇప్పుడు తమ సినిమా చరిత్రను తిరగరాస్తుందని రణదీప్‌ హుడా చెబుతున్నారు. ఈ సినిమా వాయిస్‌ ఓవర్‌లో మహాత్మాగాంధీ కాకుంటే మూడు దశాబ్దాలకు ముందే దేశం నుంచి బ్రిటిషర్లను తరిమేసి ఉండేవాళ్లమని వస్తుంది.

ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే పోస్టర్‌

‘యాక్సిడెంట్‌ ఆర్‌ కాన్‌స్పిరసీ: గోధ్రా’ సినిమా సైతం ప్రభుత్వ అనుకూలతను పెంచేందుకు ఉద్దేశించినట్టే కనిపిస్తుంది. గోధ్రా అల్లర్లకు కారణమైన రైల్లో అగ్నిప్రమాదం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందనే వాదనను ఈ సినిమా బలంగా ముందుకు తెచ్చే ప్రయత్నంలా కనిపిస్తున్నది. సినిమా పోస్టర్‌ కూడా తగలబడుతున్న రైలు కోచ్‌.. అందులో విండో నుంచి చేతులు బయటకు ఉంటాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్‌ నానావతి కమిషన్‌ నివేదిక ఆధారంగా ఈ సినిమా తీసినట్టు చెబుతున్నారు. ఇదే ఉదంతంపై ది సబర్మతి రిపోర్ట్‌ అనే సినిమా సైతం ఉన్నది. ఇందులో సైతం ముస్లిం వ్యతిరేకతే కనిపిస్తున్నది.

కమ్యూనిస్టులపై వ్యతిరేకతను పెంచడమే లక్ష్యం?

ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీని తలపించేలా.. ఏప్రిల్‌లో వెండి తెరపైకి వచ్చేందుకు ‘జహంగీర్‌ నేషనల్‌ యూనివర్సిటీ’ పేరుతో మరో సినిమా సిద్ధమవుతున్నది. నిజానికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) దేశానికి మేధావులను అందించిన, అందిస్తున్న విద్యాసంస్థగా ప్రఖ్యాతి చెందింది. అనాది నుంచి ఇక్కడ ప్రగతిశీల భావాలు ఎక్కువ. సహజంగానే బీజేపీ ప్రభుత్వ విద్వేషపూరిత విధానాలను ఖండించేవారూ ఇక్కడ ఎక్కువే. ఇటీవలే విడుదలైన ప్రొఫెసర్‌ సాయిబాబా దీనిలో ఆచార్యుడే. కానీ.. జేఎన్‌యూ వాస్తవ పరిస్థితిని వక్రీకరించేలా ఈ చిత్రం రూపొందిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా పోస్టర్‌ను గమనిస్తే.. కాషాయ రంగులో ఉన్న భారతదేశ చిత్రపటాన్ని ఒక పిడికిలిలో గుప్పిట పట్టినట్టు ఉంటుంది. ఒక విద్యా సంస్థ దేశాన్ని చీల్చగలదా? అన్న క్యాప్షన్‌ ఉంటుంది. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్న పట్టణం నుంచి ‘జేఎన్‌యూ’కు వచ్చిన విద్యార్థి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ‘జాతి వ్యతిరేక’ కార్యకలాపాలపై పోరాటం ఇతి వృత్తం. క్యాంపస్‌లో వామపక్ష ఆధిపత్యాన్ని అతడు సవాలు చేస్తాడు. ఈ సినిమా పోస్టర్‌పై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వాడివేడి వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. కేంద్ర నిధులతో నడిచే యూనివర్సిటీలో అసహ్యకరమైన వాస్తవాలను బయటపెట్టే ‘జేఎన్‌యూ’ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక యూజర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెడితే.. మరొకరు ‘బాలీవుడ్‌ ప్రాపగాండా వేరే లెవల్‌’ అని కౌంటరిచ్చారు.

ఈ సినిమాలకూ ఫ్యాన్స్‌ ఉంటారా?

అసలు ఇన్ని సినిమాలు, అందులోనూ రాజకీయ ఇతివృత్తాలతో, ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే సినిమాలకు ఫ్యాన్స్‌ ఎంత ఉంటారనేది ఒక ప్రశ్న. అదే సమయంలో కొద్ది రోజుల వ్యవధిలో రాబోయే ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీపడి ఒకదాన్ని మరొకటి ఫట్‌మనిపిస్తాయా? అనేది మరో చర్చ. రానున్న కొద్దివారాల వ్యవధిలోనే దాదాపు పది వరకూ ఇటువంటి సినిమాలు వెండితెరకు ఎక్కనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆర్టికల్‌ 370 విడులైన కొద్ది రోజుల వరకూ బాగానే నడిచినా.. ఇప్పుడు పడిపోయింది. పుల్వామా, బాలాకోట్‌ వంటి దాడుల ఆధారంగా తీసిన ఈ సినిమా.. నరేంద్రమోదీ వంటి యుక్తి కలిగిన ప్రధాని 370 ఆర్టికల్‌ను తొలగించడం ద్వారా రక్షకుడుగా నిలిచినట్టు చాటుతుంది. ఆర్టికల్‌ 370 సినిమా కానీ, బస్తర్‌ సినిమా కానీ.. రెండింటిలోనూ ఒక చోట ఉగ్రవాదులను, మరో చోట నక్సలైట్లను ఎదుర్కొనే బలమైన పాత్రల్లో మహిళలను చూపించడం ఉద్దేశపూర్వకమేనని, తద్వారా మహిళా ఓట్లను ఆకర్షించే ప్రయత్నమని పలువురు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు ప్రధాని మోదీ నుంచి ఇప్పటికే ప్రశంసలు కూడా అందాయి.

కొన్ని హిట్‌.. చాలా ఫట్‌

రాజకీయ ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంత మొత్తం రాబట్టగలుగుతాయి? కశ్మీరీ పండిట్ల కష్టాలపై వివేక్‌ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు.. నిర్మాణ వ్యయానికి పదింతలు వసూళ్లు లభించాయని చెబుతారు. ఆయన ఆయనే మళ్లీ రాజకీయ ఇతి వృత్తంతో తీసిన ‘ది వ్యాక్సిన్‌ స్టోరీ’ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. వాస్తవాలకు మసిబూసి మారేడు కాయ చేసిందన్న ఆరోపణలు వచ్చినా.. ‘కేరళ స్టోరీ’ సినిమా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు రాబట్టిందని అంచనా. వేల మంది హిందూ యువతులను మతమార్పిడి చేసి, దేశం నుంచి తరలించి, ఉగ్రవాద సంస్థల్లో చేర్చుతున్నారనే ఆరోపణలతో ఈ సినిమా తీశారు. కానీ.. ఎక్కడా ఈ ‘వేల సంఖ్యలో మిస్సింగ్స్‌’కు సంబంధించి రికార్డులు లేకపోవడం గమనార్హం. కేరళ స్టోరీ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్‌.. ఇప్పుడు బస్తర్‌ సినిమా తీశారు. ఈ ప్రాంతంలో నక్సలిజాన్ని ఎలా అణచివేశారన్న ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. బహిరంగంగా ఉరి తీయడాలు, కాల్పుల మోతలు, భయానక హింసాత్మక దృశ్యాలతో ఈ సినిమా సాగిపోతుంది. కానీ.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. జనవరి నెలలో ‘మై అటల్‌ హూ’ పేరుతో మాజీ ప్రధాని వాజపేయి జీవితంపై ఒక సినిమా వచ్చింది. కానీ.. విడుదలైన కొద్ది రోజులకే థియేటర్లు దానిని ఎత్తేశాయి. గత ఎన్నికలకు ముందు మోదీపై తీసిన సినిమా కూడా ఆడలేదు. రజాకార్‌ సినిమా కూడా ఇదే తరహాలో కనిపిస్తుంది. కరడుగట్టిన ముస్లిం వ్యతిరేకతతో తీసిన సినిమా ఇది తయారైందన్న విమర్శలు వచ్చాయి. టికెట్లే అమ్ముడుపోక థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. చరిత్రను వక్రీకరించిన ఫలితమే ఈ కలెక్షన్లనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. ఈ సినిమా నిర్మాత గూడురు నారాయణ రెడ్డి.. తాను బీజేపీ కార్యకర్తనని గర్వంగా చెప్పుకొంటాననడం గమనార్హం.

ఎన్నికల్లో బీజేపీ లబ్ధికేనా?

ఈ సినిమాలన్నీ బీజేపీకి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే ఉద్దేశించినట్టు కనిపిస్తున్నాయని ఫిలిం క్రిటిక్స్‌ అంటుంటే.. ఆయా సినిమాల దర్శకులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ‘బీజేపీ ఎన్నికల్లో ఎలానూ స్వీప్‌ చేయబోతున్నది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు మా సినిమాలు వారికి అవసరమా?’ అని బస్తర్‌ సినిమా నిర్మాత విపుల్‌ షా ఒక వార్తాచానల్‌తో మాట్లాడుతూ అన్నారు. మొత్తంగా ఈ సినిమాలన్నింటి సారాంశాన్ని గమనిస్తే చాలా వరకూ డైరెక్ట్‌గా ముస్లిం వ్యతిరేకతతో ఉండేవే కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జేఎన్‌యూ, బస్తర్‌ వంటివి వామపక్ష భావజాలాన్ని, ‘అర్బన్‌ నక్సల్స్‌’ అని ముద్ర వేస్తున్నవారిని టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తాయి. మరో విచిత్రం ఏమిటంటే.. వీటిలో కశ్మీర్‌ ఫైల్స్‌, కేరళ స్టోరీ వంటివి మినహాయిస్తే.. అన్నీ బాక్స్‌ ఆఫీస్‌ వద్ద బోల్తా కొట్టినవే!