మాల్దీవులకు భారతీయుల ‘బాయ్‌కాట్‌’ దెబ్బ..! విమానాలు రద్దు చేసిన ట్రావెల్‌ కంపెనీ..!

మాల్దీవులకు భారతీయుల ‘బాయ్‌కాట్‌’ దెబ్బ..! విమానాలు రద్దు చేసిన ట్రావెల్‌ కంపెనీ..!

BoycottMaldives | లక్షద్వీప్‌, మాల్దీవులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన తర్వాత లక్షద్వీప్‌లో పర్యాటకరంగం ఊపందుకున్నది. ఈ క్రమంలో మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ‘బాయ్‌కాట్‌ మాల్దీవులు’ ట్రెండింగ్‌ మారింది. ఆ దేశ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది మాల్దీవుల్లో వెకేషన్‌ కోసం బుక్‌ చేసుకోగా.. వాటన్నింటిని రద్దు చేసుకుంటున్నారు.


ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రధాని మోదీ, భారత్‌పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ట్రావెల్‌ కంపెనీలు సైతం మండిపడుతున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్స్‌ను క్యాన్సిల్‌ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో నిశాంత్‌ పిట్టి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధానికి సంఘీభావంగా ఈజీ మై ట్రిప్ మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.


వ్యాఖ్యలపై పెను దుమారం..


మాల్దీవుల మంత్రులు షియునా, మల్లా షరీఫ్‌, మహ్జూమ్‌ మజీద్‌లు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత హై కమిషనర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మంత్రులను మాల్దీవులను పదవుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వ అధికార ప్రతినిధి, మంత్రి ఇబ్రహీం ఖలీల్ చెప్పుకొచ్చారు. వారు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.


వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో చిత్రాలను పోస్టు చేసిన ఆయన.. ఇక్కడ టూరిటం అభివృద్ధి కోసం ద్వీపాన్ని సందర్శించేందుకు ముందుకురావాలని భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమలో మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రులు మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్‌ మాల్దీవులు అంటూ సోషల్‌ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు.


20-25 రోజుల తర్వాత ప్రభావం


సోషల్ మీడియాలో మాల్దీవులకు వ్యతిరేకంగా పెరుగుతున్న నిరసనల ఫలితం రాబోయే 20-25 రోజుల్లో స్పష్టమవుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అంచనా వేసింది. ఒక వ్యక్తి ఇప్పటికే విమానం.. హోటల్‌ను బుక్ చేసుకుంటు రద్దు చేయాలని చెప్పాడని తెలిపింది. గత కొద్ది రోజులుగా మాల్దీవులకు కొత్త ఎంక్వైరీలు లేవని పేర్కొన్నది. ప్రస్తుతం మాల్దీవులు వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేయలేదని మేక్‌ మై ట్రిప్‌ టూర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు దీప్‌ కల్రా తెలిపారు.


ఈ క్రమంలో సోషల్ మీడియాలో సాగుతున్న ట్రెండ్ ప్రభావం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అదే సమయంలో విమానాలు, హోటల్స్‌ కోసం చెల్లింపులు చేసిన వ్యక్తులు పర్యటనలను రద్దు చేసుకోరని భావిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ మెహ్రా చెప్పారు. అయితే కొత్తగా జరిగే బుకింగ్స్‌పై అంచనాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.


లక్షద్వీప్‌ కోసం ఈజీమై ట్రిప్‌ ఆఫర్స్‌


ఆన్‌లైన్ టూర్ కంపెనీ ఈజీ మై ట్రిప్ లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆఫర్లను తీసుకురాబోతున్నది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన, మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యల కారణంగా మాల్దీవులకు వెళ్లే విమానాల బుకింగ్స్‌ను కంపెనీ నిలిపివేసింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిశాంత్ తాము దేశం కోసం నిలబడతామన్నారు. లక్షద్వీప్‌లో పర్యటించేందుకు ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లక్షద్వీప్‌లోని నీరు, బీచ్‌లు మాల్దీవుల మాదిరిగానే ఉన్నాయని ఆయన అన్నారు. లక్షద్వీప్‌లో ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తామన్నారు.


భారతీయులు మాల్దీవులు అంటే ఇష్టం..


ఢిల్లీకి చెందిన ఓ టూర్ ఆపరేటర్ మాట్లాడుతూ.. భారతీయులకు మాల్దీవులంటే చాలా ఇష్టం. కానీ సోషల్ మీడియా ప్రభావంతో భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. 2023 సంవత్సరంలో మాల్దీవులకు వచ్చిన 17.57 లక్షల మంది పర్యాటకుల్లో గరిష్టంగా 2.09 లక్షల మంది పర్యాటకులు భారతీయులున్నారు. ఆ తర్వాత రష్యా, చైనా ఉన్నాయి.


హిందూ మహాసముద్రంలోని ఆసియా ప్రధాన భూభాగానికి దక్షిణంగా 750 కి.మీ దూరంలో ఉన్న మాల్దీవుల జనాభా 5.15 లక్షలు. ఇక్కడ 1,190 ద్వీపాలు ఉన్నాయి. వాటిలో 190 మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయంలో 90శాతం దిగుమతి చేసుకున్న వస్తువులు, పర్యాటక పరిశ్రమ నుంచి మాత్రమే వస్తుంది.