BRS | కేసుల కత్తి..! 28 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు

BRS BRS అభ్యర్థుల ప్రకటనపై అయోమయం ఆగస్ట్‌ చివరిలో ప్రకటించే యోచనలో సీఎం కోర్టు తీర్పుల అంశంతో వేచిచూసే వైఖరి? ఇప్పటికే వనమాపై హైకోర్టు అనర్హత వేటు తాజాగా కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్ కొట్టివేత కేసులన్నీ నెలాఖరులోపు తేల్చాలన్న సుప్రీం కేసులలో ఉన్న అమాత్యులకు కోర్టుల షాకులు ఆలస్యం కానున్న బీఆరెస్‌ తొలి జాబితా! విధాత, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ విషయంలో […]

BRS | కేసుల కత్తి..! 28 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు

BRS

  • BRS అభ్యర్థుల ప్రకటనపై అయోమయం
  • ఆగస్ట్‌ చివరిలో ప్రకటించే యోచనలో సీఎం
  • కోర్టు తీర్పుల అంశంతో వేచిచూసే వైఖరి?
  • ఇప్పటికే వనమాపై హైకోర్టు అనర్హత వేటు
  • తాజాగా కొప్పుల ఈశ్వర్‌ పిటిషన్ కొట్టివేత
  • కేసులన్నీ నెలాఖరులోపు తేల్చాలన్న సుప్రీం
  • కేసులలో ఉన్న అమాత్యులకు కోర్టుల షాకులు
  • ఆలస్యం కానున్న బీఆరెస్‌ తొలి జాబితా!

విధాత, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ విషయంలో మరికొన్నాళ్లు వేచి చూసే వైఖరిని అనుసరిస్తారా? తాజాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తొలి జాబితా ప్రకటనకు కోర్టు కేసులు అడ్డంకిగా నిలుస్తాయని వారు పేర్కొంటున్నారు.

ఈ నెలాఖరుకల్లా 28 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కేసులు తేలిపోనున్నాయి. వారిలో ఎంతమందిపై అనర్హత వేటు పడుతుందనేది ఇప్పటికైతే తెలియదు. దీంతో ముందు అనుకున్నట్లుగా ఆగస్టు 18న 80మందితో విడుదల చేయాలనుకున్న బీఆరెస్ అభ్యర్థుల తొలి జాబితాను వాయిదా వేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు పడింది. ఇక మిగిలిన కేసులు కూడా ఒకటొకటిగా తీర్పులు వెల్లడి కావాల్సి ఉన్నాయి. అవి తేలాకే అభ్యర్థులను ప్రకటిస్తారన్న చర్చ బీఆరెస్‌ వర్గాల్లో సాగుతున్నది. వీరిలో కొంతమందికి టికెట్‌లు దక్కుతాయన్న చర్చ ఉన్నప్పటికీ.. కోర్టు తీర్పు నేపథ్యంలో అధినేత ఆలోచన ఎలా ఉంటుందనే అంశం కూడా ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ రేపుతున్నది.

కొప్పులకు హైకోర్టు షాక్‌

మంత్రి కొప్పుల ఈశ్వర్ తన ఎమ్మెల్యే పదవిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలంటూ వేసిన మధ్యంతర పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసి మంత్రికి షాక్ ఇచ్చింది. మూడేళ్ల పాటు విచారణ జరిగాక, అడ్వకేట్ కమిషన్ ముందు వాదనలు విన్నాక, ఈ దశలో కేసును కొట్టివేయలేమని, తుది వాదనలు వినాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కొప్పులకు తన అనర్హత కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్న టెన్షన్ పట్టుకుంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 441 ఓట్ల మెజార్టీతో కొప్పుల ధర్మపురి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌పై గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో ఈశ్వర్ అక్రమాలకు పాల్పడ్డారని, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తి చేయకముందే అధికారులు ఈశ్వర్ గెలిచినట్లుగా ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు కౌంటింగ్ డాక్యుమెంట్లను, సీసీ టీవి ఫుటేజీలను సమర్పించాలని ఆదేశించింది.

స్ట్రాంగ్ రూమ్ తాళంచెవులు లేవంటూ జగిత్యాల కలెక్టర్ పేర్కొనగా, తాళాలు పగులగొట్టి పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇంతలోగా మంత్రి కొప్పుల తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టులో అప్పీల్‌ చేయగా, గత జూన్ 28న దానిని కోర్టు కొట్టివేసింది.

అనంతరం కొప్పుల సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా ఎదురుదెబ్బ తగలగా, మళ్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. ఇప్పుడు దానిని కూడా కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తుది వాదనలు వినాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను బుధవారానికి వేసింది.

శ్రీనివాస్‌గౌడ్‌లోనూ టెన్షన్‌

ఇదే రీతిలో ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలన్న అభ్యర్థనను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. సోమవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు శ్రీనివాస్‌గౌడ్ కేసు విచారణలో ఆయనపై ఏకంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించడం విదితమే. అటు మంత్రి గంగుల కమలాకర్‌పై కూడా అనర్హత కేసు విచారణ కొనసాగుతున్నది.

గుబులు రేపుతున్న సుప్రీం ఆదేశాలు

ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంత్రుల కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కేసులతో పాటు అనర్హత కేసులు ఎదుర్కొంటున్న 28మంది ఎమ్మెల్యేలు కోర్టు తీర్పులు ఏ విధంగా వస్తాయోనన్న ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది.

మొత్తం 30మంది ఎమ్మెల్యేలపై అనర్హత కేసుల పిటిషన్ల విచారణ పెండింగ్‌లో ఉండగా, అందులో 28మంది అధికార పార్టీ వారే ఉన్నారు. అనర్హత కేసుల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్‌, ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌, హుస్నాబాద్ సతీశ్‌, మంచిర్యాల ప్రేమ్‌సాగర్‌రావు, గద్వాల్ కృష్ణమోహన్‌రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్‌, కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్‌, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్‌, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్‌, మల్కాజిగిరి మైనంపల్లి హన్మంత్‌, వికారాబాద్ మెతుకు ఆనంద్‌, నాంపల్లి జాఫర్ హుస్సేన్‌, పటాన్ చెరువు మహిపాల్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తున్నది.