All Party Meet | ప్రత్యేక సమావేశాలపై ఉత్కంఠ..17న అఖిలపక్షం భేటీ
All Party Meet పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు నిర్వహిస్తున్న కేంద్రం ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడిస్తారా? ఎజెండాలో ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లు, జమిలి? న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. సంబంధిత నాయకులకు సమావేశ ఆహ్వానాన్ని ఈమెయిల్ […]

All Party Meet
- పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు నిర్వహిస్తున్న కేంద్రం
- ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడిస్తారా?
- ఎజెండాలో ఉమ్మడి పౌరస్మృతి, మహిళా బిల్లు, జమిలి?
న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు.
సంబంధిత నాయకులకు సమావేశ ఆహ్వానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించినట్టు ఆయన ఎక్స్‌లో తెలిపారు. 18 నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆగస్ట్ 31న జోషి ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సమావేశాల ఎజెండాపై ఎలాంటి స్పష్టతనూ ఆయన ఇవ్వలేదు. అమృత్‌కాల్‌లో పార్లమెంటులో ఫలప్రదమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టు మాత్రమే అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అజెండా అధికారికంగా బయటకు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి.
మహిళా కోటా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతితోపాటు జమిలి ఎన్నికలపై చర్చిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ మరుసటి రోజే జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేయడంతో దానిపై అనుమానాలు బలపడ్డాయి.
అయితే.. కేంద్రమంత్రులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జమిలికి అవకాశం లేదని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో రాజ్యాంగంలో ఉన్న ‘ఇండియా.. దటీజ్ భారత్’ అనే పదబంధంలోని ఇండియాను తొలగించి, భారత్‌ను మాత్రమే ఉంచుతారన్న చర్చ జోరుగా సాగింది. దీనిని విశ్వసించేందుకు అనుగుణంగా తదుపరి పరిణామాలు కూడా ఉన్నాయి.
ఇటీవల ఢిల్లీలో ముగిసిన జీ20 సదస్సులో ఇండియా బదులు భారత్ అని ప్రస్తావించడంతో ఈ విషయంలోనూ పెద్ద ఎత్తునే చర్చ నడిచింది. ఇక తాజా సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారని తెలుస్తున్నది. సమావేశాలకు కొద్ది రోజుల వ్యవధే ఉన్నప్పటికీ ఇంకా అజెండాను ప్రకటించకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.