పాక్ సైన్యం కాల్పులు.. మిస్సైల్ దాడులు!17 మంది భారత పౌరులు మృతి

  • By: sr    news    May 08, 2025 8:30 PM IST
పాక్ సైన్యం కాల్పులు.. మిస్సైల్ దాడులు!17 మంది భారత పౌరులు మృతి

విధాత, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ భూభాగంలో భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ మెరుపు దాడులతో ఖంగుతిన్న పాక్ ఆర్మీ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట గ్రామాల ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులకు, మిస్సైల్ దాడులకు తెగబడుతోంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులు కాల్పులలో ఇప్పటి వరకు 16మంది పౌరులు, ఓ జవాన్ మృతి చెందగా..60మంది వరకు గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి.

కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్‌ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్‌ బలగాలు మోర్టార్‌ షెల్లింగ్‌, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఇప్పటివరకు పూంఛ్‌, కుప్వారా, కర్నాహ్‌లో సహా సరిహద్దు వెంట పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు పిల్లలు, జవాన్ సహా 13మంది మృతి చెందారు. గురువారం పాకిస్తాన్ సైన్యం జరిపిన బాంబు దాడిలో పూంచ్ జిల్లాలో ఓ ఇల్లు ధ్వంసమైన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ఒక మాజీ సైనిక అధికారి కూడా ఉన్నారు. బాంబుదాడిలో ఓ గురుద్వారా పాక్షికంగా దెబ్బతింది.

నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం ప్రయోగించిన మిస్సైల్ ప్రొజెక్టెల్ శకలాలు పంజాబ్ లోని అమృత్ సర్ పొలాల్లో పడ్డాయి. పాక్ సైన్యం ప్రయోగిస్తున్న మోటార్ షెల్స్ ను, మిస్సైల్ లను భారత ఆర్మీ సర్ఫెస్ టూ ఎయిర్ మిస్సైల్(సామ్), రష్యాకు చెందిన ఎస్ 400రక్షణ వ్యవస్థతో తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్‌ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. భారత సైన్యం పాక్ దాడులను తిప్పుకొడుతుంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులు జరుపుతోంది. దీంతో భారత సైన్యం సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. గత 14 రోజులుగా పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

పూంచ్‌ సెక్టార్‌ దగ్గర పాక్‌ బలగాల కాల్పులలో భారత జవాన్ లాన్స్‌నాయక్‌ ర్యాంక్‌లో ఉన్న దినేష్‌కుమార్‌ మృతి చెందాడు. పాక్‌ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్‌ రెజిమెంట్‌కు చెందిన లాన్స్‌ నాయక్‌ దినేశ్‌కుమార్‌ అమరుడైనట్లు వైట్‌ నైట్‌ కోర్‌ ధ్రువీకరించింది. ఇటు భారత ఆర్మీ ఫిరోజ్‌పూర్‌లో పాకిస్తానీ చొరబాటుదారుడిని హతమార్చాయి.

దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌

పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్‌ సరిహద్దును సీజ్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్‌పుర్‌, బికనేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేశారు. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నారు.

ఇక పంజాబ్‌లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్‌పుర్‌, పఠాన్‌కోట్‌, ఫజ్లికా, అమృత్‌సర్‌, గురుదాస్‌పుర్‌, తార్న్‌ తరన్‌ ప్రాంతాల్లో 72 గంటలపాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్‌శాఖ, ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి.. సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు.