Bhatti Vikramarka | 5 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్: CLP నేత భట్టి విక్రమార్క

Bhatti Vikramarka విధాత: ఐదు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్ వారి తాత, ముత్తాతలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సత్తా, దమ్ము ధైర్యం వారెవరికి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం 84వ రోజు దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం డిండి నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత పాదయాత్ర శిబిరం వద్ద నిర్వాసితులతో […]

Bhatti Vikramarka | 5 నెలల్లో అధికారంలోకి కాంగ్రెస్: CLP నేత భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

విధాత: ఐదు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్ వారి తాత, ముత్తాతలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకునే సత్తా, దమ్ము ధైర్యం వారెవరికి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం 84వ రోజు దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం డిండి నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించారు. ఆ తర్వాత పాదయాత్ర శిబిరం వద్ద నిర్వాసితులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తుండ్రని, కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల వారోత్సవాలు చేసే అర్హత బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఒక్క చిన్న చెరువు అయినా తవ్వారా? కృష్ణ, గోదావరిపై పెద్ద ఆనకట్టలు ఏమైనా కట్టారా? పెండింగ్లో ఉన్న సాగునీటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వారోత్సవాలు చేస్తారని భట్టి విమర్శించారు.

కొట్లాడి కోరి రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసమని, తొమ్మిది సంవత్సరాలుగా నీళ్లు తీసుకురాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఏమైనా గాడిదలు కాస్తుండ్రా అని భట్టి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టుల పనులు పూర్తి చేయలేదన్నారు. తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా నల్లగొండ జిల్లాలో ఒక ఎకరానికైనా అదనంగా కృష్ణ నీళ్లు తీసుకువచ్చారా అని, దీనిపై చర్చకు నేను సిద్ధమని సవాల్ చేశారు.

నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టును పది సంవత్సరాలు అవుతున్నా పూర్తి చేయకుండా సిగ్గులేని ఈ ప్రభుత్వం నీటిపారుదల వారోత్సవాలు చేస్తున్నదన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నుంచి నీళ్ళు తెచ్చుకుందామన్న సోయి లేని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాకు దిష్టిబొమ్మలాగా ఉన్నారన్నారు.

తెలంగాణ వచ్చి పది ఏండ్లు అవుతున్నా ఎస్ ఎల్ బి సి టన్నెల్ ఎందుకు ఆలస్యం అవుతుందని ఒక్క రోజైనా సమీక్ష చేశారా? అని భట్టి ప్రశ్నించారు. మంత్రివా? నల్లగొండ జిల్లాకు దిష్టిబొమ్మవా? మంత్రి వైతే నీళ్ల కోసం ఎస్ ఎల్ బి సి టన్నెల్ కు వెళ్లి రివ్యూ చేస్తుంటివి కదా అని, ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించి, పని పూర్తి చేయించి నీళ్లు తీసుకువచ్చే వాడివని, నీకు చిత్తశుద్ధి ఏదని? నల్లగొండ జిల్లా ప్రజలపై ప్రేమ ఏదని నిలదీశారు.

నీళ్లు తెచ్చుకుందామన్న సోయి లేదు కానీ ప్రగతి భవన్ కి వెళ్లి సీఎం కి భజన చేసే మంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు అవసరమా? ఆలోచన చేయండన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారేవన్నారు. నిధులు ఇవ్వకుండా ఎవరు అడ్డుకున్నారని, ఎందుకు ఇవ్వలేదని, అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అన్నారని, 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు ఇస్తే అవి పూర్తయి వాటి దిగువన ఉన్న బీడు భూములు సస్యశ్యామలమయ్యేవని, వాటిని ఎందుకు పెండింగ్ పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.

పార్లమెంట్ మెంబర్ గా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండకు ఏం తెచ్చావని భట్టి ప్రశ్నించారు. ప్రగతి భవన్ గేట్ కాడికి వెళ్లి గడగడ వణికిపోతు తిరిగి వచ్చే వీళ్ళు నల్లగొండ పోరాట చరిత్ర పరువు తీస్తున్నారన్నారు.

నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసిందో, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం చేశారో మీడియా సాక్షిగా చర్చిద్దామని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని భట్టి సవాల్ విసిరారు. 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలకులు భూములను దోచుకోవడం, నిధులు దోపిడీ చేయడం, కొలువులు కొల్లగొట్టడం, ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఏం చేశారన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకొని కృష్ణా నీళ్లను పారించుకుందామన్నారు. నిర్వాసితులకు సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నీ అమలు చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కి నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు.

ప్రాజెక్టుల కింద భూములు తీసుకుంటున్న కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ అమలు చేయకపోగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు అదే ఉద్యోగం అని మాట్లాడిన పాలకులకు బుద్ధుందా? ఉపాధి హామీ కూలీ పనికి, భూమి పోయినందుకు ఇస్తానన్న కొలువుకు ఏమైనా సంబంధం ఉందా? అని భట్టి నిలదీశారు.

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనుల్లో మేట్లు చేసే పనులకు కొబ్బరికాయలు కొట్టి అభివృద్ధి పనులు అంటూ చెప్పడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పారదర్శకంగా నిర్వహించిన రెవెన్యూ రికార్డులను నాశనం చేసి సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణలో అతిపెద్ద భూకుంభకోణానికి తెర లేపారన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తమ బినామీలపై పార్ట్ బి లో ఉన్న భూములను రికార్డులో ఎక్కించుకోవడానికి తీసుకు వచ్చిన ధరణిని కచ్చితంగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూములను ధరణి ద్వారా బలవంతంగా గుంజుకున్న వాటిని తిరిగి తీసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా భూ భాదితులకు పంపిణీ చేసి అన్ని హక్కులు కల్పిస్తామన్నారు.

భూమి పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల పాకిస్థాన్లో బతుకుతున్నామా? అన్న భావన వారి హృదయాల్లో తీసుకురావడం ఈ ప్రభుత్వ దుర్మార్గం విధానమన్నారు.

పాత కాలం నాటి భూస్వామ్య నియంతృత్వ ధోరణి ఆలోచనతో పాలన చేస్తున్న పాలకులు తప్పా కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ నక్కలగండి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇవ్వాలన్నారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులకు ప్రాజెక్టు కింద భూమికి భూమి ఇవ్వాలన్నారు.

అమాయకులైన గిరిజనులకు నాలుగు లక్షల చొప్పున పరిహారం ఇస్తే వారు భూమిని బయట ఏవిధంగా కొంటారన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ తెలంగాణలో ఏ మూలకు వెళ్లిన ఎకరం 50 లక్షల పైబడి ఉందని చెప్పి నిర్వాసితులకు నాలుగు లక్షల పరిహారం ఇవ్వడం సరికాదన్నారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని చట్టబద్ధమైన ప్రజల కోరికను ఈ పాలకులు నెరవేర్చాలని, లేకుంటే కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామన్నారు.