పెరిగిన క్రైమ్ రేటు: సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి

అధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో నేర నియంత్రణ..పరిశోధన రంగం విస్తరించడంతో హత్యలు వంటి నేరాలు తగ్గిపోతున్నాయి

పెరిగిన క్రైమ్ రేటు: సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి
  • తగ్గిన హత్యలు.. పెరిగిన స్థిరాస్తి, సైబర్‌ నేరాలు


విధాత: అధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో నేర నియంత్రణ..పరిశోధన రంగం విస్తరించడంతో హత్యలు వంటి నేరాలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో పెరిగిన స్థిరాస్తి వ్యాపారం, ఆన్‌లైన్ కార్యకలాపాలతో ఆర్ధిక, సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. అదే విషయం హైద్రాబాద్ నగరంలో నేరాల గణంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.


సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు హైద్రాబాద్ నగరంలో 2022తో పోల్చితే 2023లో క్రైమ్ రేటు 2 శాతం మేర పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం నగర వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం మేర పెరిగాయన్నారు.


ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని, మహిళలపై అత్యాచార కేసులు 2022లో 343గా ఉండగా, ఈ ఏడాది 403 నమోదైనట్లుగా తెలిపారు. సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయని, గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే, ఈసారి రూ.133 కోట్లను సైబర్ మోసగాళ్లు కాజేశారని తెలిపారు. ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో 344 కేసుల నమోదుతో స్పల్పంగా పెరిగాయన్నారు.


పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని, డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోందని, సరపరా చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామన్నారు. డ్రగ్స్ ను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్‌ను వినియోగిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని సీపీ వెల్లడించారు.


అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామని, చాలా కాలం తర్వాత ఈ ఏడాది గణేశ్ నిమజ్జనోత్సవం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.


రాచకొండలో డ్రగ్స్ సీజ్‌.. నైజేరియన్ కోసం గాలింపు

రాచకొండ పోలీసులు డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో జోరు పెంచారు. శుక్రవారం సినిమా డబ్బింగ్ ఆర్టిస్టును అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి 30 గ్రాముల డ్రగ్స్ ను సీజ్ చేశారు. గోవాలో నైజీరియన్ దగ్గర డ్రగ్స్‌ కొని ఇక్కడ అమ్మేందుకు కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడు. నైజేరియన్ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. డ్రగ్స్ రహిత హైద్రాబాద్‌గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై నిఘా ముమ్మరం చేశారు.