ఐఎస్ఎస్‌లో తయారుచేసే ఆహారపదార్థాల్లో ప్రాణాంతక బ్యాక్టీరియా
అంతరిక్షం (Space) లో సుదూర యాత్రలకు వివిధ దేశాల పరిశోధనా సంస్థలు ప్రణాళికలు వేస్తున్న విషయం తెలిసిందే

అంతరిక్షం (Space) లో సుదూర యాత్రలకు వివిధ దేశాల పరిశోధనా సంస్థలు ప్రణాళికలు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయాల్లో వారికి తాగునీరు, ఆహారం (Space Grown Food) ఎలాంటివి అందించాలి? భూమిపై నుంచి పంపాలా లేదా వ్యోమనౌకలోనే తయారుచేసుకునేలా ఉండాలా అనే దానిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యోమనౌకలో ఇప్పటికే సలాడ్‌లు చేయడం, ఆకుకూరలు పండించడం వంటి పరిశోధనలు జరిగాయి.
తాజాగా జరిపిన అధ్యయనంలో ఇలాంటి ఆహారపదార్థాలను తినడం వల్ల వ్యోమగాముల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తేలింది. ప్రమదకర బ్యాక్టీరియా వీటిలో వ్యాప్తి చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బయటపడింది. యూనివర్సిటీ ఆఫ్ డెలావర్ జరిపిన ఈ పరిశోధన వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్, ఎన్‌పీజే మైక్రోగ్రావిటీ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం.. నాసా (NASA) మూడేళ్ల నుంచి లెటస్ అనే ఆకుకూరను.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పెంచుతోంది.
పూర్తిగా మూసేసి ఉండే అత్యాధునిక ఛాంబర్లలో భూమిపై ఉన్న వాతావరణాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి వీటిని పెంచుతున్నారు. ఈ ఆకుకూరలను, వీటితో తయారుచేసిన సలాడ్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించగా.. అందులో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు బయటపడింది. దాంతో పాటు ఫంగీ కూడా ఉండగా.. ఇవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని తిన్న వారిలోనే కాకుండా మొత్తం వ్యోమగాములందరికీ వ్యాధులు వ్యాపించి పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిశోధన కోసం యూనివర్సిటీలోనే ఐఎస్ఎస్ పరిస్థితులను సృష్టించి లెటస్‌ను పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు తయారుచేశారు. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని వీటికి కల్పించినప్పుడు.. వీటి పత్ర రంధ్రాలు (స్టొమాటా) పూర్తిగా తెరచి ఉండిపోయాయి. దీంతో బ్యాక్టీరియ, ఫంగస్ వీటిలోకి ప్రవేశించి తద్వారా అవి కలుషితం కావడానికి అవకాశం ఏర్పడుతోందని తేలింది. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు.. ఇలాంటి ఆహార పదార్థాల ఉత్పత్తికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నందున.. ఈ కోణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.