Subhanshu Shukla| నమస్తే ఇండియా : శుభాంశు శుక్లా

Subhanshu Shukla|  నమస్తే ఇండియా : శుభాంశు శుక్లా

Subhanshu Shukla| అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణం అని పేర్కొన్నారు. నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై మన త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తుంటే నాతో మీరంతా ఉన్నారనే భావన కలుగుతోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు.. భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరంతా భాగమవ్వాలని కోరుకుంటున్నా. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని మనమంతా కలిసి ప్రారంభిద్దాం. జై హింద్‌. జై భారత్‌’’ అని శుభాంశు శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు.

నాకోసం వేచి ఉండండి..

ఈ ప్రయాణానికి ముందు శుక్లా తన కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన సందేశం పంపారు. ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని శుభాంశు కుటుంబసభ్యులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక ప్రయాణానికి ముందు ఆయన తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వర్చువల్‌గా తినిపించారు. ఈ మిషన్‌ ప్రయోగాన్ని శుభాంశు కుటుంబసభ్యులు కూడా వీక్షించారు. ఆ సమయంలో వారంతా భావోద్వేగానికి గురయ్యారు.

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

శుభాంశు శుక్లా అంతరిక్ష యానంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు స్పందించారు. రాష్ట్రపతి తన సందేశంలో భారత్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారని ప్రశంసించారు. మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉందని.. మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారన్నారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాన్నానన్నారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ తన సందేశంలో భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారని అభినందించారు. కోట్లమంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని పేర్కొన్నారు. భారత్‌, హంగేరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వారికి మోదీ అభినందనలు తెలిపారు.