కడియంతో కలిసి పోలేదు.. పోటీపై కాలం నిర్ణయిస్తుంది: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
- మార్పులు చేర్పులు ఉంటాయి
- అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందాం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన తీరే సపరేటు. ఆయన ఏం మాట్లాడినా సంచలనం. అయనే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ సాక్షిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కలిసిపోయారని మంత్రి కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారని వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. కానీ ఇవన్నీ నిజాలు కావంటూ ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా ప్రకటించి అందరిని మరోసారి ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ప్రగతి భవన్ వేదికగా ఏం జరిగిందనేది పక్కకు పెడితే రాజయ్య తాజా ప్రకటన మరోసారి సంచలనంగా మారింది. రాజయ్య యూ టర్న్ తీసుకున్నారా? లేక అలాంటిది ఏం జరగలేదా? తేలాల్సిందే. ఏమైనా రాజయ్య.. రాజయ్యే. ఆయనపై అనుచరుల ఒత్తిడి ఏమైనా వచ్చిందా? ఏమో కానీ ఆయన మరోసారి సంచలనానికి తెరతీశారు.
కడియం శ్రీహరితో కలిసిపోలేదు
ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో నేను కలిసి పోలేదు. కడియంతో కలిసి పోయాననే ప్రచారం అవాస్తవమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన కామెంట్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించే సమయంలో మంత్రి కేటిఆర్ లేకపోవడంతో రెండు రోజుల క్రితం ప్రగతి భవన్ వెళ్ళి ఆయనను కలిశానని రాజయ్య చెప్పారు.
కేటీఆర్ తో నాకు జరిగిన సంభాషణను వక్రీకరించడాన్ని ఖండిస్తున్నాని అన్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీల తో కలిసి ఫొటోలు దిగామన్నారు. ఆ ఫొటోకు ఊహాగానాలతో కథనాలు విలువడ్డాయని, రకారకాలుగా జరుగుతున్న ప్రచారం వల్ల కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు.
మార్పులు చేర్పులు ఉంటాయి
ప్రత్యేక నివేదికలు, సర్వే రిపోర్ట్‌ల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయని రాజయ్య మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు. కేటాయించిన స్థానాలలో ఎక్కడ బీ ఫామ్ లు ఇవ్వలేదన్నారు. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉందామన్నారు. తాను ఎన్నికల బరిలో నిలిచే విషయం కాలమే నిర్ణయిస్తుందన్నారు. జనవరి 17 వరకు ఎమ్మెల్యేగా ఉంటా, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలల్లో అందరూ పాల్గొనాలి, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని రాజయ్య కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram