Delhi | ఆప్ నేత‌ల ఇండ్ల‌పై ఈడీ దాడులు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన నాయ‌కుల నివాసాల‌పై మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వ‌హిస్తున్న‌ది

Delhi | ఆప్ నేత‌ల ఇండ్ల‌పై ఈడీ దాడులు
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి,
  • రాజ్యసభ ఎంపీ నివాసాల్లో సోదాలు
  • ఢిల్లీ, చండీగఢ్, వారణాసిలోని
  • 12 చోట్ల ఈడీ అధికారుల‌ సోదాలు


విధాత‌: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన నాయ‌కుల నివాసాల‌పై మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వ‌హిస్తున్న‌ది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ స‌భ్యుడు నివాసాల్లోనూ ఈడీ సోదాలు జ‌రిపిన‌ట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈడీ అధికారులు ఢిల్లీ, చండీగఢ్, వారణాసిలోని 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.


కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌, రాజ్యసభ ఎంపీ ఎన్‌డీ గుప్తా, ఢిల్లీ జల్‌బోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్‌కు చెందిన ఇండ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు చేస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. “మేము భయపడటం లేదు. అవినీతికి సంబంధించిన కేసుల్లో ఎటువంటి ఆధారాలు లేవు (ఏదైనా అక్రమాలకు). నిందితులను ప్రభుత్వ సాక్షిగా మార్చడానికి ఈడీ ప్రయత్నిస్తున్న‌ది” అని ఢిల్లీ మంత్రి అతిషి మంగ‌ళ‌వారం మీడియాకు వెల్ల‌డించారు.


జల్ బోర్డ్‌లో జరిగిన‌ట్టు ఆరోపిస్తున్న కుంభకోణానికి సంబంధించి జరిగిన ఈ దాడులు ఆప్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కి కొన్ని గంటల ముందు వెలుగులోకి వ‌చ్చాయి. సీబీఐ నమోదు చేసిన కేసులో రెండు ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జ‌రుపుతున్న‌ది. ఈ కేసులో జల్ బోర్డుకు చెందిన ఇద్దరు మాజీ చీఫ్ ఇంజనీర్లను అరెస్టు చేశారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.