ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. 8 మంది సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. కారు టైర్ పగలడంతో డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వేగంగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. కారు టైర్ పగలడంతో డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వేగంగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న 8 మంది సజీవదహనం అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. బరేలీ జిల్లాలోని నైనిటాల్ నేషనల్ హైవేపై శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఓ కారు వేగంగా దూసుకెళ్తోంది. దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది.
దీంతో డంపర్, కారులో పేలుడు సంభవించి, మంటలు ఎగిసిపపడ్డాయి. అప్రమత్తమైన డంపర్ డ్రైవర్, క్లీనర్ అక్కడ్నుంచి పరారీ అయ్యారు. కారు డోర్లు లాక్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది సజీవదహనం అయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతులు ఓ పెళ్లి వేడుకకు హాజరై బహేరీ నుంచి బరెలీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న భోజపురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.