Kaleswaram Commission | ఐదున కాళేశ్వరం విచారణకు హాజరుకానున్న కేసీఆర్.. అమెరికా టూర్ వాయిదా

Kaleswaram Commission | కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విచారణకు హాజరవుతున్నందున అమెరికాలో మనవడు హిమాన్స్ రావు వద్దకు వెళ్లాలనుకున్న ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలతోపాటు, మేడిగడ్డ బారాజ్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బారాజ్ లీకేజీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 14 నెలలుగా జరుగుతున్న విచారణ తుది దశకు చేరుకున్నది.
225 మందికిపైగా విచారణ
సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లతో కలిపి సుమారు 225 మందిని కమిషన్ విచారించి, అఫిడవిట్లను తీసుకున్నది. విచారణకు హాజరైన వారిలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, సోమేష్ కుమార్, రిటైర్డ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు కూడా ఉన్నారు. పాతిక మంది ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరై తాము నిమిత్తమాత్రులం అని వెల్లడించడం విశేషం. డీపీఆర్‌కు భిన్నంగా నిర్మాణం, నిధులు విడుదలలో తమ ప్రమేయం లేదని, ప్రాజెక్టు నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని చెప్పడంతో ఆయనను విచారించేందుకు కమిషన్ నోటీసు పంపించింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కేసీఆర్‌ను కోరింది. 6వ తేదీన మాజీ ఆర్థిక మంత్రి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, 9వ తేదీన మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, ఎమ్మెల్యే టీ.హరీశ్ రావులను కూడా విచారణకు రావాలని కోరింది. రెండు వారాల్లో తమ నిర్ణయాన్ని తెలియచేయాలని కమిషన్ కోరడంతో, కేసీఆర్ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులను కల్పించనున్నారు.
విచారణపై సుదీర్ఘ మంతనాలు
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సందర్భంలో ఏ ప్రశ్నలు వస్తాయి? వాటికి ఎలా సమాధానాలు చెప్పాలి? ఎలా వ్యవహరించాలనే విషయంలో న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల, మాజీ ఇంజినీర్లతో కేసీఆర్ పలుమార్లు భేటీ అయి చర్చించారని తెలిసింది. అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే విషయంలో కసరత్తు కూడా చేశారంటున్నారు. అన్నింటికీ సిద్ధపడిన తర్వాతే.. విచారణకు వెళ్తున్న విషయాన్ని పార్టీలో సీనియర్ నాయకులకు కేసీఆర్ సమాచారమిచ్చారు.
బీఆర్‌కేఆర్ భవన్ వద్ద భద్రత పెంపు
జూన్ 5వ తేదీన కేసీఆర్, ఆ తరువాత ఈటల రాజేందర్, టీ హరీశ్ రావు విచారణకు వస్తున్నందున ట్యాంక్‌బండ్ బీఆర్‌కేఆర్ భవన్ పరిసర ప్రాంతాల్లో ముందస్తు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ భవనం 8వ అంతస్తులో కాళేశ్వరం కమిషన్ కార్యాలయం ఉన్నది. కీలక నేతలు రానున్న నేపథ్యంలో వారం పాటు ఈ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు గస్తీ పెంచనున్నారు.